వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.
లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా.
లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది.
ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment