రోజూ మౌత్‌ వాష్‌ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక! Research says that Listerine Cool Mint mouth wash may increase cancer risk. Sakshi
Sakshi News home page

రోజూ మౌత్‌ వాష్‌ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!

Published Tue, Jun 18 2024 10:04 AM

 Research says that Listerine Cool Mint mouth wash may increase cancer risk

నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్‌ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే  తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే.  ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్‌ మౌత్‌ వాష్‌ వాడితే కేన్సర్‌ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది.
 

బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్‌వాష్  రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్‌ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర  వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్‌’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. 

నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్‌ఫెక్షన్లు కూడా  లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని  పరిశోధనలో తేలిందన్నారు.  మౌత్‌ ఫ్రెష్‌నర్‌లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా  బాగా పెరిగిపోతుందని, ఫలితంగా  పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్‌ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.

అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది.  నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు  కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్‌ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు.  

ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్‌ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్‌ఫెక్షన్లు,  బ్యాక్టీరియా నివారణలో  శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్‌లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా  తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని  పరిశోధకులు చెబుతున్నారు.

అయితే కెన్‌వ్యూ  వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.

మౌత్ వాష్‌లో ఏముంటుంది?
సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది.   ఇలాంటి వాటిని  నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్‌ ముప్పును కూడా  పెంచుతుంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement