Mouthwash
-
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్ మౌత్ వాష్ వాడితే కేన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. బెల్జియంలోని యాంట్వెర్ప్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్‌వాష్ రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నారు. మౌత్ ఫ్రెష్నర్లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది. నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నివారణలో శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.అయితే కెన్వ్యూ వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.మౌత్ వాష్‌లో ఏముంటుంది?సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్ ముప్పును కూడా పెంచుతుంది. -
Amazon: మౌత్‌వాష్ ఆర్డర్ చేస్తే.. ఖరీదైన ఫోన్
ముంబై: సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసినవి కాకుండా వేరే ప్రొడక్ట్స్ రావడం చాలా సహజం. అయితే తాము ఆర్డర్ చేసిన వస్తువు కన్నా ఎక్కువ ఖరీదైనది వస్తే.. రిటర్న్ చేసే వారు చాలా తక్కువ మంది. ఎక్కడో ఒకరో, ఇద్దరో మాత్రం వాటిని రిటర్న్ చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమెజాన్‌లో మౌత్‌వాష్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏకంగా రెడ్మీ నోట్ 10 ఫోన్ డెలివరీ వచ్చింది. దాంతో సదరు వ్యక్తి.. ఆ మొబైల్‌ని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన లోకేష్ దగ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్‌లో మౌత్‌వాష్ ఆర్డర్ చేశాడు. అయితే అతడికి రెడ్మీ నోట్10 డెలవరీ చేశారు. మౌత్‌వాష్ ఆర్డర్ చేశాను కాబట్టి మొబైల్‌ని రిటర్న్ చేయడానికి కుదరడం లేదంటూ అతడు ట్వీట్ చేశాడు. ‘‘హలో అమెజాన్ నేను # 406-9391383-4717957 కోల్గెట్ మౌత్‌వాష్ ఆర్డర్ చేశాను. దాని బదులుగా నాకు రెడ్మీ నోట్ 10 వచ్చింది. మౌత్‌వాష్ నిత్యవసర వస్తువు కాబట్టి యాప్‌లో రిటర్న్ పెట్టడానికి కుదరడం లేదు. నాకు వచ్చిన ప్యాకేజ్ మీద నా పేరే ఉంది. కానీ ఇన్వాయిస్ వేరేవారిది. నా దగ్గర నుంచి ఈ మొబైల్ తీసుకెళ్లి.. దాన్ని ఆర్డర్ చేసిన వారికి డెలవరీ చేయాల్సిందిగా నేను మీకు ఈమెయిల్ కూడా చేశాను’’ అంటూ ట్వీట్ చేశాడు. Hello @amazonIN Ordered a colgate mouth wash via ORDER # 406-9391383-4717957 and instead of that got a @RedmiIndia note 10. Since mouth was in a consumable product returns are restricted and am unable to request for return via the app(1/2) pic.twitter.com/nPYGgBGNSR — Lokesh Daga (@lokeshdaga) May 13, 2021 మే 13న చేసిన ఈ ట్వీట్‌కి ఇప్పటికే అనేక రీట్వీట్లు వచ్చాయి. అతడి నిజాయతీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అమెజాన్‌లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్! -
మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: మౌత్‌వాష్‌లు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తాయట. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఔననే అంటున్నారు కొందరు పరిశోధకులు. కరోనాను తగ్గించే మందుతోపాటు అసలు వైరస్ సోకకుండా నిరోధించే వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో కొందరు పరిశోధకులు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. జర్మనీకి చెందిన రూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మౌత్‌వాష్‌లపై పరిశోధనలు జరిపారు. కోవిడ్ వైరస్‌పై అవి ఎలా పనిచేస్తాయో కల్చర్ టెస్ట్ ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత ఆ వైరస్ మానవ కణాలపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా పరిశోధించారు. వైరస్‌ను విస్తరించకుండా నిరోధిస్తాయి.. 229ఇ అనే మానవ కరోనా వైరస్‌పై మౌత్‌వాష్‌ను ప్రయోగించారు. 30 సెకన్ల పాటు ద్రావణాలతో కలిపి ఉంచాక, ఆ వైరస్ క్రియారహితం అయిందని గుర్తించారు. కోవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ముందు కొన్ని గంటలపాటు గొంతు పైభాగంలోని సైనస్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. నిత్యం మౌత్‌వాష్‌తో గార్గ్లింగ్ చేస్తే గొంతు వద్దే వైరస్‌ను నియంత్రించొచ్చని, పూర్తిగా నిరోధించలేక పోయినా.. దాన్ని బాగా తగ్గించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఇది వైరస్ నిరోధానికి సరైన పద్ధతిగా మాత్రం భావించొద్దని పేర్కొంటుండటం విశేషం. ఇది కేవలం ల్యాబ్‌లో చేసిన ప్రయోగమే తప్ప మనుషులపై చేసిన క్లినికల్ ట్రయల్స్ కాదని వారు చెబుతున్నారు. ‘మౌత్‌వాష్‌లో ఉండే క్లోర్ఎక్స్డిన్ రసాయనానికి వైరస్‌ను క్రియారహితం చేసే శక్తి ఉంటుంది. వైరస్ నిరోధానికి తీసుకునే చర్యల్లో ఇది కూడా ఓ అంశమని గుర్తించాలి తప్ప.. దీన్ని వైద్యంగా భావించొద్దు’ అని నగరానికి చెందిన మైక్రోబయోలజిస్టు దుర్గా సునీల్ పేర్కొన్నారు. -
మౌత్‌వాష్‌తో కరోనా వ్యాప్తికి చెక్?!
బెర్లిన్: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి ఈ పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్ వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేశారు. (లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి) కరోనా రోగుల్లో గొంతు, కావిటీలోల ఎక్కువ మొత్తంలో వైరల్ లోడు కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం.. వైరస్ బారిన పడిన వారు ఇతరులతో మాట్లాడటం, దగ్గడం, చీదడం వంటివి చేసినప్పుడు వైరస్ డ్రాప్లెట్స్ అవతలి వారి మీద పడటంతో వారు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్ కణాల సంఖ్య తగ్గి.. వ్యాప్తి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన కోసం వారు జర్మనీలోని ఫార్మసీలలో లభించే 8 రకాల మౌత్వాష్లను పరీక్షించారు. ఇవన్ని వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పుక్కిలించడం వల్ల లాలాజల వైరల్ లోడ్ తగ్గి.. తద్వారా కరోనా వైరస్ ప్రసారం తగ్గుతుందన్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు మౌత్వాష్లను వైరస్ కణాలతో కలిపి.. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత వెరో ఈ6 కణాలను పరీక్షించగా వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెరో ఈ6 కణాలు వైరస్‌ను ఆకర్షిస్తాయని తెలిపారు. ఈ పరిశోధనలో చాలా మౌత్‌వాష్‌లు సమర్థవంతంగా పని చేశాయని.. ప్రత్యేకంగా మూడు రకాలు వైరస్‌ను పూర్తిగా తొలగించినట్లు కనుగొన్నామన్నారు. పుక్కిలించిన తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందనే అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు అంటున్నారు.(కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్‌వో) -
మౌత్‌ఫ్రెష్‌తో జాగ్రత్త..
న్యూఢిల్లీ : ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత మౌత్‌వాష్‌తో మరోసారి నోటిని శుభ్రం చేసుకోవడం కొందరికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు కాస్తా తగ్గిపోతాయని అంటున్నారు ప్లైమౌత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సాధారణంగా వ్యాయామం చేసిన వెంటనే మన రక్తపోటు కొంచెం పెరగడం.. ఆ తర్వాత తగ్గుతుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి రక్తనాళాలు వ్యాకోచం చెంది శరీరంలోని అవయవాలకు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అంచనా. వాసోడైలేషన్‌అని పిలిచే ఈ ప్రక్రియ వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే జరుగుతుందని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ ఆ తర్వాతకూడా చాలాసమయం పాటు ఇది కొనసాగడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. కారణం ఏంటోతెలుసుకునేందుకు జరిపిన పరిశోధనల్లో నోటిలోని ఓ బ్యాక్టీరియా నైట్రేట్లతో జరుపుతున్న రసాయన చర్యలు కారణమని స్పష్టమైంది. నైట్రిక్ ఆక్సైడ్ క్షీణించే క్రమంలో నైట్రేట్లు ఏర్పడుతుంటాయి. నోటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ఈ నైట్రేట్లను కాస్తా నైట్రైట్లుగా మార్చి.. మళ్లీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతున్నాయి. మౌత్‌వాష్ కారణంగా ఈ బ్యాక్టీరియా నశించిపోతుండటంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిలో తగ్గుదల నమోదవుతోంది. -
నోరు బాగుంటే... హెల్త్ బాగుంటుంది!
నోటిని శుభ్రం చేసుకున్నారా... అన్ని అవయవాలనూ క్లీన్ చేసుకున్నట్టే! ‘‘తమ్ముడు మన్ను తిన్నాడం’’టూ చిన్నికృష్ణుడి మీద పెద్దాడి కంప్లెయింట్. ‘‘ఏదీ నోరు తెరువ్’’ అంది యశోద. చిన్నికన్న నోరు తెరిస్తే... సకల లోకాలూ... పదహారు భువనభాండాలూ కనిపించాయట ఆమెకు. అంటే యశోదమ్మ కూడా చిన్నారి కృష్ణుడి (నోటి) ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నట్టేగా! రమణీయ భాగవత కథాస్ఫూర్తిని మన ఆరోగ్యానికీ అనువర్తించుకుందామా? మన నోటిలో సకల అవయవాల రక్షణా ఉంటుంది. కేవలం మన నోటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకున్నామనుకోండి. ఒంట్లోని దాదాపు అన్ని అవయవాలనూ క్లీన్ చేసేసినట్టే. వాటన్నింటినీ బ్యాడ్ బ్యాక్టీరియాకు దూరం ఉంచినట్టే. నమ్మడం లేదా? మీ నోటి శుభ్రత వల్ల ఎన్నెన్ని కీలక భాగాలకు రక్షణ కలుగుతుందో తెలుసుకుంటే... మీరలా నోరు తెరచుకుని చూస్తుండిపోతారంతే. పళ్లను బ్రష్ చేసుకుంటే... దేహంలోని అవయవాలు ఎలా ఖుష్ అవుతాయో చూద్దాం. ఓరల్ హైజీన్తో గుండెకు రక్ష మనం రోజూ చక్కగా బ్రష్చేసుకుంటూ, చిగుర్ల ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించకపోతే వచ్చేందుకు గుండెజబ్బులు రెడీగా ఉంటాయ్. ఇందుకు రెండు కారణాలు. మొదటిది... నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్నిరకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు (క్లాట్స్), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్) తయారు చేస్తాయి. దాంతో గుండెపోటు అవకాశాలు పెరుగుతాయి. రెండో కారణం... నోట్లోని హానికరమైన బ్యాక్టీరియావల్ల కాలేయంలో కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటు రావచ్చు. అందువల్ల మీరు నోరు శుభ్రం చేసుకుంటున్నారంటే... గుండె పరిసరాల్లోనూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారని అర్థం. మీకో విషయం తెలుసా? గుండెకు బైపాస్సర్జరీ చేయించుకోదలచిన వారు ముందుగా దంతవైద్యుడిని కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవీలేవని నిర్ధారణ చేసుకుంటేనే శస్త్రచికిత్స జరిగేది. నోటికీ, గుండెకూ ఇంతటి దగ్గరి సంబంధముందన్నమాట. నోటి శుభ్రతతో లంగ్స్ కూడా హెల్దీగా అందరి నోళ్లలోనూ, గొంతులోనూ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. ఇది గొంతులోకీ, అక్కడి నుంచి లంగ్స్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది వయసు పైబడ్డవారిలో జరిగితే సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) వంటి ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే నోరు బాగుంటే బ్రెత్ బాగుంటుందని ఇంగ్లిష్‌లో అంటారు. ఇక్కడ బ్రెత్ అంటే ఊపిరికి సహాయం చేసే ఊపిరితిత్తులు అనుకోవచ్చు. మన నోరు క్లీన్‌గా ఉందంటే... మనల్ని క్లీన్ చేసే కిడ్నీలూ క్లీన్ మన దేహంలోని వ్యర్థాలను క్లీన్ చేసే డ్యూటీ మూత్రపిండాల (కిడ్నీల)దన్న విషయం తెలిసిందే. కిడ్నీలకూ, నోటికీ ఉన్న సంబంధమేమిటో చూద్దాం. మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి కూడా మారిపోతుంది. వాళ్ల నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనలోని మలినాలనూ, వ్యర్థాలనూ తొలగించేవి కిడ్నీలే కదా. అవి పనిచేయనందు వల్ల ఆ మలినాలన్నీ ఒకేచోట పోగుపడినట్టుగా అవుతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే అలా దుర్వాసన వస్తుంటుందన్నమాట. కాబట్టే కిడ్నీలూ బాగుండాలంటే నోరు బాగుండాలి. నోరు బాగుంటే అవీ బాగుంటాయి. ఇక కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్ చికిత్స తీసుకునేవారు నోటిని క్లీన్ చేసుకోవాలనుకుంటే అది డయాలసిస్ అయిన మర్నాడు ప్లాన్ చేసుకోవడం మంచిది. నోరు క్లీన్‌గా ఉంటే మెదడుకూ ఆరోగ్యం నోటి శుభ్రతకూ, మెదడుకు కూడా సంబంధం ఉందంటే నమ్మడం కష్టం. కానీ అది నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్ ప్లాక్ లేదా సబ్ జింజివల్ ప్లాక్ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్లెట్లను గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్ ఫార్మేషన్’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ళ దగ్గరి ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండీషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే... మనం ముఖం శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట. పన్ను – కన్ను పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును తగ్గిస్తుందనీ మనలో చాలామందికి ఓ అపోహ. ఇది నిజం కాదు. అయితే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే కంటికి చేరితే అది ‘కార్నియల్ ఇన్ఫెక్షన్’గా మారవచ్చు. కొన్నిసార్లు పైవరస పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పడితే, అది కంటినీ ప్రభావితం చేయవచ్చు. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోదలచిన వారు ముందుగా నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నోటి పరిశుభ్రత – డయాబెటిస్ డయాబెటిస్ ఉన్నవారు షుగర్‌ను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. లాలాజలం ఉత్పత్తి దెబ్బతినవచ్చు. అందుకే చక్కెరవ్యాధి ఉన్న చాలామందిలో నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి దారితీయవచ్చు. చక్కెర నియంత్రణలో లేకపోతే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వంటి చిగుర్ల ఇన్ఫ్లమేషన్ సమస్యలు రావచ్చు. ఇక పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుర్లనుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే ముందుగా దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇక్కడ చెప్పిన ఉదాహరణలతో తెలిసే విషయం ఒక్కటే... మనం ఒక్క మన నోటిని శుభ్రంగా ఉంచుకున్నామంటే... శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లే! అందుకే ఉదయం తప్పక నోరు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరే పనైనా చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నోరు తప్పక శుభ్రం చేసుకోవాలి. నోటి శుభ్రత ఇలా... ►పుట్టిన పాపాయి మొదలుకొని (పళ్లు రాకముందు నుంచే) అందరూ పళ్ళు శుభ్రం చేసుకోవాలి ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి. పైకీ, కిందికీ రౌండ్‌గా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేసుకోవాలి. అంతే తప్ప పలువరసకు అడ్డంగా బ్రష్ చేసుకోవడం సరికాదు ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోవాలి. చిగుర్లను బ్రష్‌తో గాయపరచుకోకుండా చూసుకోవాలి. మరీముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఇది చాలా ప్రధానం ►పంటికి బయటా, లోపల కూడా బ్రష్ చేసుకోవాలి ►బ్రష్‌ను అదేపనిగా నములుతూ ఉండకూడదు. మరీ పలువరస అరిగిపోయేలా చాలాసేపు బ్రష్ చేసుకోవడమూ సరికాదు. బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు లేదా మూడు నిమిషాలపాటు సాగాలి ►పళ్లు తోముకున్న తర్వాత ముఖం కడుక్కునే సమయంలో, చిగుళ్లపై వేలితో మృదువుగా మాలిష్ చేస్తున్నట్లుగా మసాజ్ చేసుకోవాలి ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్ కూడా చేసుకోవాలి ►మూడునెలలకోసారి లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు కోలుకున్న వెంటనే పాత బ్రష్ మార్చేయాలి ►ప్రతి ఆర్నెల్లకోమారు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి, పళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. గార (ప్లాక్) వంటివి తొలగించుకునేలా క్లీన్ చేయించుకోవాలి. కాబోయే తల్లి నోరు శుభ్రంగా ఉంటే... కడుపులో బిడ్డా క్షేమం గర్భవతుల్లో సాధారణంగా రెండోనెలలో ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే చిగుర్ల వ్యాధి కనిపిస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని–క్యాన్సర్ కానీ కొన్ని గడ్డలు పెరగవచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నెలలు నిండకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే అది పుట్టబోయే బిడ్డకూ మేలు. డాక్టర్ ప్రత్యూషదంత వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
మౌత్ వాష్‌తో డయాబెటిస్
సాక్షి,న్యూఢిల్లీ:రోజుకు రెండు సార్లు మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకుంటే డయాబెటిస్ వచ్చే ముప్పు 50 శాతం అధికమని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒకసారి అసలు మౌత్‌వాష్ చేసుకోని వారితో పోలిస్తే వీరికి టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పొంచిఉందని హెచ్చరించింది. మౌత్ వాష్ చేసుకుంటే నోటిలోని చెడు బ్యాక్టీరియాతో పాటు డయాబెటిస్, ఒబెసిటీల నుంచి మనల్ని రక్షించే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందని అమెరికన్ పరిశోధకుల తాజా అథ్యయనం వెల్లడించింది. మౌత్‌వాష్ ఫార్ములాలన్నింటిలో చెడు, మంచి బ్యాక్టీరియాలను ధ్వంసం చేసే యాంటీ బ్యాక్టీరియల్ పదార్ధాలుంటాయని అథ్యయనానికి నేతృత్వం వహంచిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్రొఫెసర్ కౌముది జోషిరుర తెలిపారు. ఈ మౌత్ వాష్‌లు నిర్ధిష్ట బ్యాక్టీరియాపై పనిచేయకుండా మొత్తం బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం కలిగిఉంటాయని చెప్పారు. నోటిలో ఉన్న కొన్ని బ్యాక్టీరియాలు డయాబెటిస్, ఒబెసిటీ రిస్క్ నుంచి కాపాతాయని గత ఏడాది పీరియోడాంటల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. -
నోరు తెరవనివ్వవు!
మౌత్ అల్సర్లు వారం రోజుల్లో మూడుకేజీల బరువు తగ్గిపోయింది సునీత.బరువు తగ్గాలని ఎక్సర్సైజ్ చేశావా? డైటింగ్ చేశావా?ఆసక్తిగా అడిగింది స్నేహితురాలు.అవేవీ కాదని తల అడ్డంగా ఊపింది సునీత.‘అయినా నేను ఓవర్‌వెయిట్ ఉంటేగా తగ్గాలనుకోవడానికి. వారం రోజులుగా నీరసంతో ఒళ్లు సోలిపోతోంది. నోట్లో ముద్ద పెట్టుకున్న మింగుడు పడడం లేదు’ అన్నది సునీత నిస్సహాయంగా. అదేమైనా వ్యాధి లక్షణమేమో... ఓ సారి డాక్టర్ని కలవకపోయావా... అందామె కాస్త భయంగా.నిజానికి సునీతకు పెద్ద వ్యాధి ఏదీ లేదు. చిన్నపాటి మౌత్ అల్సర్. నోటి పుండు చిన్నదే కానీ నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అల్సర్ కడుపులో వస్తే తిన్న తర్వాత బాధ పెడుతుంది, నోట్లో వస్తే తిననివ్వకుండా బాధిస్తుంది. మౌత్ అల్సర్ అపాయకరం కాదు. కానీ అది పెట్టే బాధ మాత్రం ఐదారు రోగాలపెట్టు. సరిగా తినకపోవడంతో పోషకాహార లోపం, రక్తహీనత వంటి అనుబంధ సమస్యలకు కారణమవుతుంటుంది. నోటి పూతగా మొదలై, పొక్కులు పెద్దవై పుండ్లుగా మారే క్రమంలో అవి పెట్టే బాధను వర్ణించలేం. మౌనంగా భరించక తప్పని పరిస్థితిని కల్పిస్తాయి. సాధారణంగా మౌత్ అల్సర్లు బికాంప్లెక్స్ లోపం వల్లనే వస్తుంటాయి. అయితే అన్ని సందర్భాలలోనూ మౌత్ అల్సర్‌ని చిన్న సమస్యగా కొట్టి పారేయలేం. దేహంలో చోటు చేసుకునే అనేక మార్పులు ఇందుకు కారణాలవుతుంటాయి. అల్సర్లు ఎన్ని రకాలు! ఎందుకు వస్తాయి? బ్యాక్టీరియల్ జింజివోస్టోమాటైటిస్... ఇది నోటిలోపల, చిగుళ్లకు వచ్చే సమస్య. దీని వల్ల నోటిలోపల వాపు, పుండ్లు వస్తాయి.హెర్పిస్ సింప్లెక్స్ వైరల్ ఇన్ఫెక్షన్... ఇది వైరల్ ఇన్ఫెక్షన్, నోటిలోపల, పెదవుల దగ్గర నీటి పొక్కులు వస్తాయి. ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఆర్ షార్ప్ టీత్... కొందరిలో దంతాలు వంకరగానూ, పదునుగానూ ఉంటాయి. అవి నోటి లోపల గుచ్చుకోవడం వల్ల చర్మకణాలు రప్చర్ అయి గాట్లు లేదా పుండ్లు వస్తాయి. ల్యూకోప్లాకియా... పొగాకు వాడకం వల్ల... ఓరల్ క్యాన్సర్... ఇది నోటి క్యాన్సర్ఓరల్ లెకైన్ ప్లానస్... ఇది చర్మ వ్యాధి. కొంద రిలో నోటి లోపల చర్మానికి కూడా సోకుతుంది. ఓరల్ థ్రష్... క్యాండిడా బ్యాక్టీరియా ఎక్కువ కావడంతో నోటి పూత వస్తుంది. అలాగే నోటి మూలల పగుళ్లు, చర్మం తెల్లగా అవుతుంటుంది.లైఫ్స్టయిల్తో... నైకోరాండిల్ వంటి మందుల వాడకం వల్ల, క్యాన్సర్ వ్యాధికి వాడే మందులు వల్ల నోటిలో చర్మం ఎర్రబారుతుంటుంది. అలాగే టూత్ పేస్టు, మౌత్ వాష్‌లలో ఉండే రసాయనాలు కలిగించే ఇరిటేషన్ నోటి లోపల చర్మం మీద అల్సర్‌గా బయటపడుతుంది. చిన్న-పెద్ద పేగులకు సంబంధించిన క్రోన్స్ డిసీజ్, ఆహారంలో లభించే గ్లూటెన్, అమైనో యాసిడ్స్ అలర్జీ కారణంగా వచ్చే సీలియాక్ డిసీజ్, ఆర్థరైటిస్, జన్యుపరమైన లోపాలు, కంటి అల్సర్ ఉన్నప్పుడు నోటి అల్సర్ వస్తుంటుంది. వీటితోపాటు పోషకాహారలోపం, రక్తహీనత కారణంగా నోటిపూత వస్తుంటుంది. ఇతర వ్యాధులేవీ లేని చాలామందిలో కనిపించే నోటి సమస్యలు పోషకాహార లోపంతో వచ్చేవే అయి ఉంటాయి. నోటి శుభ్రత పాటించని వారిలోనూ అల్సర్లు వస్తుంటాయి. చాలా కొద్ది సందర్భాలలో జన్యులోపాలు కూడా కారణమవుతుంటాయి. చికిత్స... మొదటగా అల్సర్ కారణంగా వచ్చిన నొప్పిని తగ్గిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం, ద్రవాలను ఇస్తారు. అల్సర్‌కు చికిత్స కంటే కారణాన్ని గుర్తించడమే కీలకం. దంతాలు గుచ్చుకోవడం ద్వారా వచ్చిన అల్సర్‌కు డెంటిస్ట్ చేత పంటిని సరి చేయించుకోవడమే అసలైన చికిత్స.నోటి అల్సర్ వచ్చినప్పుడు సాత్వికాహారం తీసుకోవాలి. వేడి పదార్థాలు, మసాలా వంటకాలు, కాఫీ వంటివి తీసుకుంటే నొప్పి తీవ్రమవుతుంది. రసాయనాల కారణంగా అల్సర్ వచ్చినట్లు సందేహం కలిగితే వెంటనే వాటి వాడకాన్ని మానేస్తే సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అల్సర్ ఏర్పడిన తర్వాత కూడా శుభ్రత పాటిస్తే తీవ్రత తగ్గుతుంది.యాంటీ హిస్టమైన్, అనీస్తటిక్, యాంటాసిడ్, కార్టికో స్టెరాయిడ్స్ వంటి పూత మందులను అల్సర్ మీద రాయడం, పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది. కొన్నింటికి యాంటీబయాటిక్స్‌తోపాటు ఓరల్ స్టెరాయిడ్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే రిలీఫ్ ఉంటుంది. పైన చెప్పిన విధంగా తాత్కాలికమైన చికిత్స విధానాలతో అప్పటికి తగ్గి మళ్లీ వస్తుంటే పూర్తిస్థాయిలో టెస్టులు చేసి చికిత్స చేయాలి. సాధారణంగా నోటిలో వచ్చే అల్సర్లలో చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్ అల్సర్లను గమనిస్తుంటాం. వాటికి పూర్తి చికిత్స తప్పనిసరి. పోషకాహారలోపం కారణంగా వచ్చిన నోటిపూత, అల్సర్ తగ్గడానికి ‘బి’ కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు, ఇతర సప్లిమెంట్లను సూచిస్తారు. నివారణ... ఇలా! నోటిలో వచ్చే అల్సర్లలో చాలా రకాలు అపరిశుభ్రత కారణంగా వచ్చేవే ఉంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతోపాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. శుభ్రతతో సంబంధం లేకుండా ఇతర కారణాలతో మౌత్ అల్సర్ వచ్చినప్పటికీ సరైన నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్‌తో ఎదురయ్యే ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. దంతాలను డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుంటూ పొగాకు వాడకాన్ని మానేయాలి. కాఫీ, పుల్లటి పదార్థాల వాడకాన్ని పరిమితం చేయాలి. పంటి వంకర, లేదా మొనదేలి వాడిగా ఉండడం వంటి వాటిని గుర్తించినప్పుడు అవి అల్సర్‌కు దారి తీసే దాకా వేచి చూడకుండా డెంటిస్టును సంప్రదించి సరి చేయించుకోవాలి.హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు యాంటీవైరల్ ట్రీట్మెంట్ బాగా పని చేస్తుంది. సీలియాక్ డిసీజ్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు డైటీషియన్ సలహా మేరకు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. తరచుగా నొప్పితో కూడిన అల్సర్ వస్తున్న సందర్భాలలో దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడకం, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటుంది. అల్సర్‌ని నిర్లక్ష్యం చేస్తే... అల్సర్‌కు కారణమైన ఇన్ఫెక్షన్ నోరంతా వ్యాపించి కొన్ని సందర్భాల్లో గొంతు వరకు కూడా వ్యాపించవచ్చు. అలాగే కొన్నిసార్లు అంటువ్యాధిలాగా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.