నోరు తెరవనివ్వవు! | Mouth ulcers in the mouth unopened! | Sakshi
Sakshi News home page

నోరు తెరవనివ్వవు!

Published Wed, Nov 2 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

నోరు తెరవనివ్వవు!

నోరు తెరవనివ్వవు!

మౌత్ అల్సర్లు

వారం రోజుల్లో మూడుకేజీల బరువు తగ్గిపోయింది సునీత.బరువు తగ్గాలని ఎక్సర్‌సైజ్ చేశావా? డైటింగ్ చేశావా?ఆసక్తిగా అడిగింది స్నేహితురాలు.అవేవీ కాదని తల అడ్డంగా ఊపింది సునీత.‘అయినా నేను ఓవర్‌వెయిట్ ఉంటేగా తగ్గాలనుకోవడానికి. వారం రోజులుగా నీరసంతో ఒళ్లు సోలిపోతోంది. నోట్లో ముద్ద పెట్టుకున్న మింగుడు పడడం లేదు’ అన్నది సునీత నిస్సహాయంగా. అదేమైనా వ్యాధి లక్షణమేమో... ఓ సారి డాక్టర్‌ని కలవకపోయావా... అందామె కాస్త భయంగా.నిజానికి సునీతకు పెద్ద వ్యాధి ఏదీ లేదు. చిన్నపాటి మౌత్ అల్సర్. నోటి పుండు చిన్నదే కానీ నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది.

అల్సర్ కడుపులో వస్తే తిన్న తర్వాత బాధ పెడుతుంది, నోట్లో వస్తే తిననివ్వకుండా బాధిస్తుంది. మౌత్ అల్సర్ అపాయకరం కాదు. కానీ అది పెట్టే బాధ మాత్రం ఐదారు రోగాలపెట్టు. సరిగా తినకపోవడంతో పోషకాహార లోపం, రక్తహీనత వంటి అనుబంధ సమస్యలకు కారణమవుతుంటుంది. నోటి పూతగా మొదలై, పొక్కులు పెద్దవై పుండ్లుగా మారే క్రమంలో అవి పెట్టే బాధను వర్ణించలేం. మౌనంగా భరించక తప్పని పరిస్థితిని కల్పిస్తాయి. సాధారణంగా మౌత్ అల్సర్లు బికాంప్లెక్స్ లోపం వల్లనే వస్తుంటాయి. అయితే అన్ని సందర్భాలలోనూ మౌత్ అల్సర్‌ని చిన్న సమస్యగా కొట్టి పారేయలేం. దేహంలో చోటు చేసుకునే అనేక మార్పులు ఇందుకు కారణాలవుతుంటాయి.

అల్సర్లు ఎన్ని రకాలు! ఎందుకు వస్తాయి?
బ్యాక్టీరియల్ జింజివోస్టోమాటైటిస్... ఇది నోటిలోపల, చిగుళ్లకు వచ్చే సమస్య. దీని వల్ల నోటిలోపల వాపు, పుండ్లు వస్తాయి.హెర్పిస్ సింప్లెక్స్ వైరల్ ఇన్‌ఫెక్షన్... ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్, నోటిలోపల, పెదవుల దగ్గర నీటి పొక్కులు వస్తాయి.

ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఆర్ షార్ప్ టీత్... కొందరిలో దంతాలు వంకరగానూ, పదునుగానూ ఉంటాయి. అవి నోటి లోపల గుచ్చుకోవడం వల్ల చర్మకణాలు రప్చర్ అయి గాట్లు లేదా పుండ్లు వస్తాయి.

ల్యూకోప్లాకియా... పొగాకు వాడకం వల్ల...
ఓరల్ క్యాన్సర్... ఇది నోటి క్యాన్సర్ఓరల్ లెకైన్ ప్లానస్... ఇది చర్మ వ్యాధి. కొంద రిలో నోటి లోపల చర్మానికి కూడా సోకుతుంది.  ఓరల్ థ్రష్... క్యాండిడా బ్యాక్టీరియా ఎక్కువ కావడంతో నోటి పూత వస్తుంది. అలాగే నోటి మూలల పగుళ్లు, చర్మం తెల్లగా అవుతుంటుంది.లైఫ్‌స్టయిల్‌తో... నైకోరాండిల్ వంటి మందుల వాడకం వల్ల, క్యాన్సర్ వ్యాధికి వాడే మందులు వల్ల నోటిలో చర్మం ఎర్రబారుతుంటుంది. అలాగే టూత్ పేస్టు, మౌత్ వాష్‌లలో ఉండే రసాయనాలు కలిగించే ఇరిటేషన్ నోటి లోపల చర్మం మీద అల్సర్‌గా బయటపడుతుంది.

చిన్న-పెద్ద పేగులకు సంబంధించిన క్రోన్స్ డిసీజ్, ఆహారంలో లభించే గ్లూటెన్, అమైనో యాసిడ్స్ అలర్జీ కారణంగా వచ్చే సీలియాక్ డిసీజ్, ఆర్థరైటిస్, జన్యుపరమైన లోపాలు, కంటి అల్సర్ ఉన్నప్పుడు నోటి అల్సర్ వస్తుంటుంది. వీటితోపాటు పోషకాహారలోపం, రక్తహీనత కారణంగా నోటిపూత వస్తుంటుంది. ఇతర వ్యాధులేవీ లేని చాలామందిలో కనిపించే నోటి సమస్యలు పోషకాహార లోపంతో వచ్చేవే అయి ఉంటాయి. నోటి శుభ్రత పాటించని వారిలోనూ అల్సర్లు వస్తుంటాయి. చాలా కొద్ది సందర్భాలలో జన్యులోపాలు కూడా కారణమవుతుంటాయి.

చికిత్స...
మొదటగా అల్సర్ కారణంగా వచ్చిన నొప్పిని తగ్గిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం, ద్రవాలను ఇస్తారు.  అల్సర్‌కు చికిత్స కంటే కారణాన్ని గుర్తించడమే కీలకం. దంతాలు గుచ్చుకోవడం ద్వారా వచ్చిన అల్సర్‌కు డెంటిస్ట్ చేత పంటిని సరి చేయించుకోవడమే అసలైన చికిత్స.నోటి అల్సర్ వచ్చినప్పుడు సాత్వికాహారం తీసుకోవాలి. వేడి పదార్థాలు, మసాలా వంటకాలు, కాఫీ వంటివి తీసుకుంటే నొప్పి తీవ్రమవుతుంది. రసాయనాల కారణంగా అల్సర్ వచ్చినట్లు సందేహం కలిగితే వెంటనే వాటి వాడకాన్ని మానేస్తే సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అల్సర్ ఏర్పడిన తర్వాత కూడా శుభ్రత పాటిస్తే తీవ్రత తగ్గుతుంది.యాంటీ హిస్టమైన్, అనీస్తటిక్, యాంటాసిడ్, కార్టికో స్టెరాయిడ్స్ వంటి పూత మందులను అల్సర్ మీద రాయడం, పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది. కొన్నింటికి యాంటీబయాటిక్స్‌తోపాటు ఓరల్ స్టెరాయిడ్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే రిలీఫ్ ఉంటుంది.

     
పైన చెప్పిన విధంగా తాత్కాలికమైన చికిత్స విధానాలతో అప్పటికి తగ్గి మళ్లీ వస్తుంటే పూర్తిస్థాయిలో టెస్టులు చేసి చికిత్స చేయాలి. సాధారణంగా నోటిలో వచ్చే అల్సర్లలో చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్ అల్సర్‌లను గమనిస్తుంటాం. వాటికి పూర్తి చికిత్స తప్పనిసరి. పోషకాహారలోపం కారణంగా వచ్చిన నోటిపూత, అల్సర్ తగ్గడానికి ‘బి’ కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు, ఇతర సప్లిమెంట్లను సూచిస్తారు.

నివారణ... ఇలా!
నోటిలో వచ్చే అల్సర్లలో చాలా రకాలు అపరిశుభ్రత కారణంగా వచ్చేవే ఉంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతోపాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. శుభ్రతతో సంబంధం లేకుండా ఇతర కారణాలతో మౌత్ అల్సర్ వచ్చినప్పటికీ సరైన నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్‌తో ఎదురయ్యే ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. దంతాలను డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుంటూ పొగాకు వాడకాన్ని మానేయాలి. కాఫీ, పుల్లటి పదార్థాల వాడకాన్ని పరిమితం చేయాలి.

పంటి వంకర, లేదా మొనదేలి వాడిగా ఉండడం వంటి వాటిని గుర్తించినప్పుడు అవి అల్సర్‌కు దారి తీసే దాకా వేచి చూడకుండా డెంటిస్టును సంప్రదించి సరి చేయించుకోవాలి.హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు యాంటీవైరల్ ట్రీట్‌మెంట్ బాగా పని చేస్తుంది. సీలియాక్ డిసీజ్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు డైటీషియన్ సలహా మేరకు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. తరచుగా నొప్పితో కూడిన అల్సర్ వస్తున్న సందర్భాలలో దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడకం, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటుంది.

అల్సర్‌ని నిర్లక్ష్యం చేస్తే...
అల్సర్‌కు కారణమైన ఇన్‌ఫెక్షన్ నోరంతా వ్యాపించి కొన్ని సందర్భాల్లో గొంతు వరకు కూడా వ్యాపించవచ్చు. అలాగే కొన్నిసార్లు అంటువ్యాధిలాగా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement