ఇన్‌ఫెక్షన్‌: సెల్యు'లైట్‌' తీసుకోకండి..! | Cellulite: What It Is Causes, Location And Treatment | Sakshi
Sakshi News home page

సెల్యులైటిస్‌ని తేలిగ్గా తీసుకుంటే.. అమాంతం ప్రాణాలే..!

Published Tue, Mar 18 2025 9:35 AM | Last Updated on Tue, Mar 18 2025 1:16 PM

Cellulite: What It Is Causes, Location And Treatment

ఓ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా చర్మానికి సెల్యులైటిస్‌ అనే కండిషన్‌ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్‌నెస్‌)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే  తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం.

సెల్యులైటిస్‌ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్‌ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్‌తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్‌ఫ్లమేషన్‌)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. 

ఇన్‌ఫ్లమేషన్‌తో కూడిన సెల్యులైటిస్‌ను  తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్‌ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. 

సెల్యులైటిస్‌ కనిపించే సూక్ష్మక్రిములివే... 
సెల్యులైటిస్‌ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. 

ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్‌ ఎస్‌పీపీ, బ్యాక్టీరియోడీస్‌ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. 

సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?
వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా  బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్‌ ఫూట్‌ (టీనియా పెడిస్‌) వంటి కండిషన్‌లో చర్మానికి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది  బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. 

ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్‌ సిస్టమ్‌ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. 

అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా  బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్‌ ఫూట్‌ (టీనియా పెడిస్‌) వంటి కండిషన్‌లో చర్మానికి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది  బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. 

ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్‌ సిస్టమ్‌ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.

చర్మం రంగు మారడం: 
సెల్యులైటిస్‌ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. 

వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ  అనిపిస్తుంటుంది. 

ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన  జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. 

సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్‌

  • చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. 

  • దీర్ఘకాలంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్‌ ఫూట్‌ వంటివి). 

  • ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. 

  • కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. 
    ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్‌ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 

  • డయాబెటిస్‌ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్‌ ఉన్నవారిలో సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).

  • రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్‌ వెయిన్స్‌ వంటివి). 

  • పెరిఫెరల్‌ వ్యాస్క్యులార్‌ డిసీజ్‌ వంటి జబ్బుల కారణంగా. 

  • శరీరంలో లింఫ్‌ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. 

  • దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్‌ హెపటైటిస్, సిర్రోసిస్‌ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు  అవకాశాలెక్కువ). 

స్థూలకాయం ఉన్నవారిలో. 

  • ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. 

  • చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. 

  • చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్‌గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్‌ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. 

  • ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌ వల్ల. 

  • కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. 

  • దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్‌ రావచ్చు. 

ఒకసారి సెల్యులైటిస్‌ సోకాక...

  • ఒకసారి సెల్యులైటిస్‌ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్‌’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్‌ సెల్యులైటిస్‌ అంటారు.

  • సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్‌ వస్తుంటుంది. సెల్యులైటిస్‌ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్‌ సెల్యులైటిస్‌ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్‌ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లో ఇలా  జరుగుతుంది. సెల్యులైటిస్‌ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్‌ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్‌ సెల్యులైటిస్‌ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్‌ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్‌ రావడాన్ని ‘బైలేటర్‌ కాంకరెంట్‌ సెల్యులైటిస్‌’ అంటారు. 

చికిత్స 
యాంటీబయాటిక్స్‌తో చికిత్స 
స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే  యాంటీబయాటిక్స్‌ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్‌ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.

వ్యాయామం (ఫిజియోథెరపీ) 
వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. 

కొన్ని జాగ్రత్తలు
సెల్యులైటిస్‌ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 

  • కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.

  • కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.

  • కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.

  • కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.

  • కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం.  గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం.  

  • కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్‌ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ విషయంలో  మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) 

  • అథ్లెట్స్‌ ఫూట్‌ వంటి ఇన్ఫెక్షన్‌తోపాటు అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం 

  • వేరికోస్‌ వెయిన్స్‌ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం 

  • సెల్యులైటిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం.  

చివరగా... సెల్యులైటిస్‌ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.
డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌
డా.జి. వెంకటేష్‌ బాబు, సీనియర్‌ కన్సల్టెంట్‌,  ప్లాస్టిక్‌ – కాస్మటిక్‌ సర్జన్‌ 

(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement