నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది! | If the mouth is clean the brain is healthy | Sakshi
Sakshi News home page

నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది!

Published Wed, Mar 20 2019 1:31 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

If the mouth is clean the brain is healthy - Sakshi

నోటిని శుభ్రం చేసుకున్నారా... అన్ని అవయవాలనూ క్లీన్‌ చేసుకున్నట్టే! ‘‘తమ్ముడు మన్ను తిన్నాడం’’టూ చిన్నికృష్ణుడి మీద పెద్దాడి కంప్లెయింట్‌. ‘‘ఏదీ నోరు తెరువ్‌’’ అంది యశోద. చిన్నికన్న నోరు తెరిస్తే... సకల లోకాలూ... పదహారు భువనభాండాలూ కనిపించాయట ఆమెకు. అంటే యశోదమ్మ కూడా చిన్నారి కృష్ణుడి (నోటి) ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నట్టేగా! రమణీయ భాగవత కథాస్ఫూర్తిని మన ఆరోగ్యానికీ   అనువర్తించుకుందామా? మన నోటిలో సకల అవయవాల రక్షణా ఉంటుంది. కేవలం మన నోటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకున్నామనుకోండి. ఒంట్లోని దాదాపు అన్ని అవయవాలనూ క్లీన్‌ చేసేసినట్టే. వాటన్నింటినీ బ్యాడ్‌ బ్యాక్టీరియాకు దూరం ఉంచినట్టే. నమ్మడం లేదా? మీ నోటి శుభ్రత వల్ల ఎన్నెన్ని కీలక భాగాలకు రక్షణ కలుగుతుందో తెలుసుకుంటే... మీరలా నోరు తెరచుకుని చూస్తుండిపోతారంతే. పళ్లను బ్రష్‌ చేసుకుంటే... దేహంలోని అవయవాలు ఎలా ఖుష్‌ అవుతాయో చూద్దాం. 

ఓరల్‌ హైజీన్‌తో గుండెకు రక్ష
మనం రోజూ చక్కగా బ్రష్‌చేసుకుంటూ, చిగుర్ల ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించకపోతే వచ్చేందుకు గుండెజబ్బులు రెడీగా ఉంటాయ్‌. ఇందుకు రెండు కారణాలు. మొదటిది... నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్నిరకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు (క్లాట్స్‌), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్‌) తయారు చేస్తాయి. దాంతో గుండెపోటు అవకాశాలు పెరుగుతాయి. రెండో కారణం... నోట్లోని హానికరమైన బ్యాక్టీరియావల్ల కాలేయంలో కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటు రావచ్చు. అందువల్ల మీరు నోరు శుభ్రం చేసుకుంటున్నారంటే... గుండె పరిసరాల్లోనూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారని అర్థం. మీకో విషయం తెలుసా? గుండెకు బైపాస్‌సర్జరీ చేయించుకోదలచిన వారు ముందుగా దంతవైద్యుడిని కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌ ఏవీలేవని నిర్ధారణ చేసుకుంటేనే శస్త్రచికిత్స జరిగేది. నోటికీ, గుండెకూ ఇంతటి దగ్గరి సంబంధముందన్నమాట. 

నోటి శుభ్రతతో లంగ్స్‌ కూడా హెల్దీగా
అందరి నోళ్లలోనూ, గొంతులోనూ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో–ఫ్యారింజియల్‌ బ్యాక్టీరియా అంటారు. ఇది గొంతులోకీ, అక్కడి నుంచి లంగ్స్‌లోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్‌కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది వయసు పైబడ్డవారిలో జరిగితే సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌) వంటి ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే నోరు బాగుంటే బ్రెత్‌ బాగుంటుందని ఇంగ్లిష్‌లో అంటారు. ఇక్కడ బ్రెత్‌ అంటే ఊపిరికి సహాయం చేసే ఊపిరితిత్తులు అనుకోవచ్చు.  

మన నోరు క్లీన్‌గా ఉందంటే... మనల్ని క్లీన్‌ చేసే కిడ్నీలూ క్లీన్‌
మన దేహంలోని వ్యర్థాలను క్లీన్‌ చేసే డ్యూటీ మూత్రపిండాల (కిడ్నీల)దన్న విషయం తెలిసిందే. కిడ్నీలకూ, నోటికీ ఉన్న సంబంధమేమిటో చూద్దాం. మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి కూడా మారిపోతుంది. వాళ్ల నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనలోని మలినాలనూ, వ్యర్థాలనూ తొలగించేవి కిడ్నీలే కదా. అవి పనిచేయనందు వల్ల ఆ మలినాలన్నీ ఒకేచోట పోగుపడినట్టుగా అవుతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే అలా దుర్వాసన వస్తుంటుందన్నమాట. కాబట్టే కిడ్నీలూ బాగుండాలంటే నోరు బాగుండాలి. నోరు బాగుంటే అవీ బాగుంటాయి. ఇక కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్‌ చికిత్స తీసుకునేవారు నోటిని క్లీన్‌ చేసుకోవాలనుకుంటే అది డయాలసిస్‌ అయిన మర్నాడు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. 

నోరు క్లీన్‌గా ఉంటే  మెదడుకూ ఆరోగ్యం
నోటి శుభ్రతకూ, మెదడుకు కూడా  సంబంధం ఉందంటే నమ్మడం కష్టం. కానీ అది నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్‌ ప్లాక్‌ లేదా సబ్‌ జింజివల్‌ ప్లాక్‌ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లను గుంపులుగా చేరేలా చేస్తుంది.  దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్‌ ఫార్మేషన్‌’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్‌’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీయవచ్చు. అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ళ దగ్గరి ఇన్ఫెక్షన్‌ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ అనే కండీషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే... మనం ముఖం శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట.  

పన్ను – కన్ను
పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును తగ్గిస్తుందనీ మనలో చాలామందికి ఓ అపోహ. ఇది నిజం కాదు. అయితే నోటిలో  వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే కంటికి చేరితే అది ‘కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌’గా మారవచ్చు. కొన్నిసార్లు పైవరస పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పడితే, అది కంటినీ ప్రభావితం చేయవచ్చు. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకోదలచిన  వారు ముందుగా నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్‌లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. 

నోటి పరిశుభ్రత – డయాబెటిస్‌
డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. లాలాజలం ఉత్పత్తి దెబ్బతినవచ్చు. అందుకే చక్కెరవ్యాధి ఉన్న చాలామందిలో నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి దారితీయవచ్చు. చక్కెర నియంత్రణలో లేకపోతే జింజివైటిస్, పెరియోడాంటైటిస్‌ వంటి చిగుర్ల ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు రావచ్చు. ఇక పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుర్లనుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే ముందుగా దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్‌ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇక్కడ చెప్పిన ఉదాహరణలతో తెలిసే విషయం ఒక్కటే... మనం ఒక్క మన నోటిని శుభ్రంగా ఉంచుకున్నామంటే... శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లే! అందుకే ఉదయం తప్పక నోరు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరే పనైనా చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నోరు తప్పక శుభ్రం చేసుకోవాలి. 

నోటి శుభ్రత ఇలా...
►పుట్టిన పాపాయి మొదలుకొని (పళ్లు రాకముందు నుంచే) అందరూ పళ్ళు శుభ్రం చేసుకోవాలి

►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోవాలి. పైకీ, కిందికీ రౌండ్‌గా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ చేసుకోవాలి. అంతే తప్ప పలువరసకు అడ్డంగా బ్రష్‌ చేసుకోవడం సరికాదు

►బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోవాలి. చిగుర్లను బ్రష్‌తో గాయపరచుకోకుండా చూసుకోవాలి. మరీముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇది చాలా ప్రధానం

►పంటికి బయటా, లోపల కూడా బ్రష్‌ చేసుకోవాలి

►బ్రష్‌ను అదేపనిగా నములుతూ ఉండకూడదు. మరీ పలువరస అరిగిపోయేలా చాలాసేపు బ్రష్‌ చేసుకోవడమూ సరికాదు. బ్రష్‌ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు లేదా మూడు నిమిషాలపాటు సాగాలి

►పళ్లు తోముకున్న తర్వాత ముఖం కడుక్కునే సమయంలో, చిగుళ్లపై వేలితో మృదువుగా మాలిష్‌ చేస్తున్నట్లుగా మసాజ్‌ చేసుకోవాలి

►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్‌ కూడా చేసుకోవాలి

►మూడునెలలకోసారి లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు కోలుకున్న వెంటనే పాత బ్రష్‌ మార్చేయాలి

►ప్రతి ఆర్నెల్లకోమారు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి, పళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. గార (ప్లాక్‌) వంటివి తొలగించుకునేలా క్లీన్‌ చేయించుకోవాలి.

కాబోయే తల్లి నోరు శుభ్రంగా ఉంటే... కడుపులో బిడ్డా క్షేమం 
గర్భవతుల్లో సాధారణంగా రెండోనెలలో ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్‌’ అనే చిగుర్ల వ్యాధి కనిపిస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని–క్యాన్సర్‌ కానీ కొన్ని గడ్డలు పెరగవచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నెలలు నిండకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డ బరువు  తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే అది పుట్టబోయే బిడ్డకూ మేలు.

డాక్టర్‌ ప్రత్యూషదంత వైద్య నిపుణులు ప్రొఫెసర్‌ ఓరల్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియాలజీ, 
కిమ్స్‌ హాస్పిటల్, సికింద్రాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement