పెద్దాయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించిపోతోంది. తానింక ఎక్కువ కాలం బతకలేనన్న భయం అతణ్ని చుట్టుముడుతోంది. ఒకటే ఆలోచనలు. కూతురితో ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్న విషయమొకటి చెప్పడానికి సరైన సమయం ఇదేనని భావించాడు. కూతురు నిశ్చలకు కబురు అందింది. ‘‘ఇంతబతుకూ బతికి చివరికి తలకొరివి పెట్టే దిక్కులేకుండా వెళ్లిపోతానని భయంగా ఉందమ్మా! నీ పెళ్లన్నా అయ్యుంటే అల్లుడే కొడుకై ఉండేవాడు’’ దీనంగా చెప్పాడు పెద్దాయన. ‘‘దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి నాన్నా!’’ అంది నిశ్చల అభావంగా. ‘‘లేదమ్మా! ఇప్పుడు నా ఆలోచనంతా చిట్టిబాబు గురించే’’‘‘చిట్టిబాబా?అతనెవరు?’’ ‘‘మీ అన్నయ్య..’’ అన్నాడు పెద్దాయన. చాలాసేపు ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించింది. ‘‘అతనెక్కడున్నా ఇక్కడికి రప్పించాలి. అతనే నా చితికి నిప్పంటించాలని నాకనిపిస్తోందమ్మా!’’ కళ్లలో తిరుగుతున్న నీళ్లను తుడుచుకుంటూ కొనసాగించాడు పెద్దాయన. ‘‘అన్నయ్య ఏంటి నాన్నా?’’ పెద్దాయన కష్టపడి లేచి కూర్చున్నాడు. అతను కొన్ని సంవత్సరాలుగా తనలో దాచుకున్న నిజం. చిట్టిబాబు. చిట్టిబాబు కథంతా చెప్పాడు పెద్దాయన. చిట్టిబాబు పెద్దాయన ప్రేమించిన అమ్మాయికి పుట్టిన కొడుకు. అతణ్ని తన జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదు ఆ పెద్దాయన.పేరొక్కటే తెలుసు. అది కూడా చిట్టిబాబు అన్న ముద్దుపేరు మాత్రమే. ‘‘ఈ అవసాన దశలో వాణ్ని ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా!’’ అన్నాడు పెద్దాయన, అప్పటికదే తన చివరిమాట అయిపోయినంత బాధతో.
నిశ్చల ఏ పని చేస్తున్నా ఈ ఆలోచనల్ని వెంటేస్కొనే తిరుగుతోంది. ఎవరీ చిట్టిబాబు? ఎక్కడుంటాడు? ఇంత పెద్ద ప్రపంచంలో అతణ్ని కనిపెట్టగలదా? ‘‘ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటీ? ఆ చిట్టిబాబును వెతికి తేవాలి.. అంతేనా?’’ అంది జ్వాల, నిశ్చలను గట్టిగా కదుపుతూ. జ్వాలకు మాత్రమే తన విషయాలన్నీ చెప్పుకుంటుంది నిశ్చల. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అవునన్నట్టు తలూపింది నిశ్చల. ‘‘ఇటువంటి కేసుల్ని మా జేమ్స్‌పాండు గారు ఇట్టే తేల్చేస్తారు తెల్సా?’’ అంది జ్వాల. ‘‘ఎవరు?’’ ‘‘జేమ్స్‌పాండ్! జేమ్స్‌పాండ్ తెలీదా? మొన్నొక కేసులోంచి నన్ను బయటపడేయలేదూ? ఆయన. గొప్ప తెలివితేటలున్న మనిషిలే!’’‘‘ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా?’’ అంది నిశ్చల, కాస్త ధైర్యం తెచ్చుకున్న స్వరంతో.
జేమ్స్‌పాండ్ కొద్దిరోజుల క్రితంవరకూ చిన్న డిటెక్టివే కానీ ఇప్పుడు అతని రేంజ్ వేరే! ఓ పెద్ద కేసును డీల్ చేశాడు. అందులో దోషి తాను పనిచేస్తున్న ఆఫీసు బాసే. ఆ బాస్ పనయిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం పాండ్‌కే దక్కింది. పాండ్ అసలు పేరు పాండురంగారావు. డిటెక్టివ్‌లకు ఇలాంటి సాదాసీదా పేరుండటం బాగోదని జేమ్స్‌పాండ్ అని మార్చుకున్నాడు. ఏ కేసునైనా ఇట్టే డీల్ చేస్తానని చెప్పుకుంటాడు కానీ అంత గొప్ప డిటెక్టివ్ అయితే కాదు. ‘అసలు డిటెక్టివే కాదు’ అని ఆయన అసిస్టెంట్ అంటూంటే, అతణ్ని దగ్గరికి లాక్కొని కొడతాడు కూడా. నిశ్చలను పాండ్ వద్దకు తీసుకొచ్చింది జ్వాల. చిట్టిబాబు కథంతా చెప్పింది నిశ్చల. ఎలాగైనా వెతికిపెట్టాలని కోరింది. ‘‘ఇలాంటివి మనకు కొట్టినపిండి..’’ అని గట్టిగా నవ్వాడు జేమ్స్‌పాండ్. నిశ్చల కుదుటపడింది. చిట్టిబాబు జాడ తెలిసే అవకాశం ఉన్న కొందరి పేర్లు చెప్పింది. ‘‘ఇంక మీ పని అయిపోయినట్టే’’ ధీమాగా చెప్పాడు జేమ్స్‌పాండ్. దారం దొరికింది జేమ్స్‌పాండ్‌కు. ఆ దారం అంచు పట్టుకొని చిట్టిబాబును వెతుక్కుంటూ వెళ్లి పట్టుకున్నాడు. మరోపక్క పెద్దాయన ఆరోగ్యం కూడా బాగైంది. చావుకు దగ్గరవుతాననుకున్న వాడు కాస్తా చిట్టిబాబు దొరికేశాడన్న ఆనందంలో చక్కగా లేచి తిరగడం మొదలుపెట్టాడు. నిశ్చల సంతోషంగా ఉంది. నిశ్చల కంటే కూడా జ్వాల ఎక్కువ సంతోషంగా ఉంది. జ్వాలకు ఇప్పుడు జేమ్స్‌పాండ్ కేవలం ఫ్రెండ్ కాదు. అంతకుమించి.
‘‘చిట్టిబాబును వెతికి తెచ్చినందుకు థ్యాంక్సండీ.’’ అంది జ్వాల. ‘‘అబ్బబ్బా! మీరు చెప్పాల్సిన థ్యాంక్స్‌లన్నీ నిన్న ఫోన్‌లో చెప్పేశారు. మళ్లీ చెప్పి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా నేనిక్కడికి వచ్చింది మీ థ్యాంక్స్ అందుకోవడానికి కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి’’ అన్నాడు పాండ్.‘‘ఇంటర్వ్యూనా?’’ ‘‘మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుటప్ చెయ్యాలి.’’ అంటూ ఒక పేపర్ తీశాడు పాండ్. ఆ పేపర్‌పై తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నాడు. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలివి. మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్‌లో పనిచేస్తున్నారు కదూ? ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు? ఈ కేసు కోర్టులో ఎప్పుడు తేల్చొచ్చు అన్నారు? మీకు అక్కలు ఎంతమంది అండీ? జ్వాల రాసిన సమాధానాలివి. అవును. పాండురంగారావు గారిని. వచ్చే నెల. ఇద్దరు. పాండ్ ఆ పేపర్ అందుకొని, ఇప్పుడు ఈ పేపర్ వెనుక ఉన్న అసలు ప్రశ్నలు చూడండంటూ పేపర్ తిప్పి చూపాడు. అక్కడున్న ప్రశ్నలు, ఈ సమాధానాలు కలిపి చదువుకోమన్నాడు. మీరు ప్రేమిస్తున్నారు కదూ? అవును. ఎవర్నీ? పాండురంగారావు గారిని. మీ పెళ్లెప్పుడు? వచ్చే నెల. మీకెందరు పిల్లలు కావాలి? ఇద్దరు. చదవగానే జ్వాల చిరు కోపంతో పాండ్‌ను చూసింది. పాండ్ గట్టిగా నవ్వాడు. కాసేపటికి సరదాగా క్షమించమంటూ అడిగాడు. ఆమె సిగ్గు నటించింది. అప్పటికే వాళ్లు మంచి ప్రేమికులు.అందరూ హ్యాపీ. నిశ్చల, జ్వాల, పాండు రంగారావు, పెద్దాయన. అందరూ హ్యాపీ. కానీ ఒకతను వచ్చాడు – ‘‘చిట్టిబాబు మీరనుకున్న వ్యక్తి కాదు. నేనే అసలు చిట్టిబాబుని..’’ అంటూ. చిట్టిబాబు కథ మళ్లీ మొదటికి వచ్చింది. జేమ్స్‌పాండ్ ఇప్పుడు మళ్లీ మొదట్నుంచీ ఈ దారాన్ని పట్టుకొని చిట్టిబాబును వెతుక్కుంటూ రావాలి.వెతుక్కుంటూ వచ్చాక అతను తెలుసుకునే ఓ విషయం, అతణ్ని కూడా గతంలోకి వెళ్లిపోయేలా చేస్తుందని ఇప్పుడతనికి తెలియదు.
చిట్టిబాబు ఎవరు?
Published Sun, Apr 29 2018 12:03 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment