న్యూఢిల్లీ : ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత మౌత్‌వాష్‌తో మరోసారి నోటిని శుభ్రం చేసుకోవడం కొందరికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు కాస్తా తగ్గిపోతాయని అంటున్నారు ప్లైమౌత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సాధారణంగా వ్యాయామం చేసిన వెంటనే మన రక్తపోటు కొంచెం పెరగడం.. ఆ తర్వాత తగ్గుతుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి రక్తనాళాలు వ్యాకోచం చెంది శరీరంలోని అవయవాలకు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అంచనా. వాసోడైలేషన్‌అని పిలిచే ఈ ప్రక్రియ వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే జరుగుతుందని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ ఆ తర్వాతకూడా చాలాసమయం పాటు ఇది కొనసాగడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది.
కారణం ఏంటోతెలుసుకునేందుకు జరిపిన పరిశోధనల్లో నోటిలోని ఓ బ్యాక్టీరియా నైట్రేట్లతో జరుపుతున్న రసాయన చర్యలు కారణమని స్పష్టమైంది. నైట్రిక్ ఆక్సైడ్ క్షీణించే క్రమంలో నైట్రేట్లు ఏర్పడుతుంటాయి. నోటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ఈ నైట్రేట్లను కాస్తా నైట్రైట్లుగా మార్చి.. మళ్లీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతున్నాయి. మౌత్‌వాష్ కారణంగా ఈ బ్యాక్టీరియా నశించిపోతుండటంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిలో తగ్గుదల నమోదవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment