ఒకేరోజు రూ.5,200 జంప్
కేజీ ధర రూ.95,800కు అప్
రూ.650 ఎగసి రూ.78,800కు చేరిన బంగారం
న్యూఢిల్లీ: వెండి కేజీ ధర న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో ఒకేరోజు రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరింది. వెండి ధర ఒకేరోజు ఈ స్థాయిలో ఎగియడం ఒక రికార్డు. తద్వారా ఈ మెటల్ ధర రెండు వారాల తర్వాత తిరిగి రూ.95,000పైకి చేరింది. కాగా, ఇంతక్రితం అక్టోబర్ 21న వెండి ధర ఒకేరోజు రూ.5,000 పెరగడం ఒక రికార్డు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్థానిక ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ దీనికి కారణం.
రెండు రోజుల తర్వాత పసిడి
ఇక గడచిన రెండు రోజుల్లో రూ.2,250 పడిపోయిన బంగారం ధర బుధవారం తిరిగి పుంజుకుంది. 99.9 ప్యూరిటీ పసిడి ధర రూ.650 ఎగసి రూ.78,800కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 శాతం స్వచ్ఛత ధర రూ.950 ఎగసి రూ.78,700కు ఎగసింది. డాలర్ విలువలో ఒడిదుడుకులు తాజా పసిడి పరుగుకు కారణం. అబాన్స్ హోల్డింగ్స్ సీఈఓ చింతన్ మెహతా పసిడి భవిష్యత్ ధరలపై మాట్లాడుతూ, బులియన్ ధరలకు మరింత దిశానిర్దేశం చేసే రష్యా–ఉక్రెయిన్ వివాదం, పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయని అన్నారు.
ఫ్యూచర్స్‌లో పరుగు..
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో 1% పెగా (32 డాలర్లు) పెరిగి 2,679 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఇటీవలే పసిడి 52 వారాల గరిష్టం 2,826 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ, ట్రంప్ గెలుపు, డాలర్ స్థిరత్వం వంటి పరిణామాలతో ఎల్లో మెటల్ కొంత వెనక్కు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ. 900 లాభంతో రూ. 76,870 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment