న్యూఢిల్లీ: బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా మంగళవారం పరుగుపెట్టాయి. అంతర్జాజీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో చరిత్రాత్మక రికార్డు 2,570.2 డాలర్ల స్థాయిని తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 20 డాలర్ల లాభంతో పటిష్టంగా 2,562 డాలర్ల పైన ట్రేడవుతోంది. అమెరికా మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం.
దేశంలోనూ దూకుడే..
ఇక అంతర్జాతీయ అంశాల దన్నుతో దేశీయంగా కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పూర్తి 99.9 స్వచ్ఛత ధర రూ.1,400 పెరిగి రూ.74,150కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.73,800 స్థాయిని చూసింది. వెండి కేజీ ధర సైతం రూ.3,150 ఎగసి రూ.87,150కి చేరింది. ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు రూ.837, రూ.834 చొప్పున పెరిగి వరుసగా రూ.71,945, రూ.71,657కు చేరాయి. వెండి ధర రూ.2,030 పెరిగి రూ.85,321కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment