మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మార్చి 7న ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లకు చేరుకుంది. స్పాట్ బంగారం ధర 1.5 శాతం పెరిగి ఔన్స్'కు 1,998.37 డాలర్లకు చేరుకుంది. ఇంతకు ముందు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం పెరిగి 2,000.20 డాలర్లకు చేరుకున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.89 శాతం పెరిగి రూ.53,550 వద్ద ఉంటే, కిలోగ్రాము వెండి ధర 2.35 శాతం పెరిగి రూ.70,785 వద్ద ఉంది. దేశీయంగా కూడా బంగారం ధర భారీ స్థాయిలో పెరిగింది. బంగారం భారీ వేగంతో పెరగడంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఒక్క రోజులో పసిడి ధర సుమారు రూ.1500 పెరగడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.1500కి పైగా పెరిగి రూ.53,021కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.47,347 నుంచి రూ.48,762కు చేరుకుంది.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.48,400 నుంచి రూ.49,400కి పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.1000 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1090 పెరిగి రూ.53,890కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.2,000కి పెరిగి రూ69,920కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment