ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.
భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్‌లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్‌ఎఫ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్‌లోని సైబర్ హబ్‌తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.
వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment