హెల్త్: డిస్‌ఫేజియా
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్‌ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి..
ఓరల్ ఫేజ్..
ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది.
ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది.
గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు
ఫ్యారింజియల్ ఫేజ్..
- గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్‌ఫేజియా’ అంటారు.
- ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు.
గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు..
ఈసోఫేజియల్ ఫేజ్..
- మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం.
- తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం
- తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం
ఇక పెద్దవయసువారిలో..
- తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని..
- గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం
- మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు
- వెన్నుపూసకు గాయం కావడం
- అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం
- మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్‌సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు
- గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం
- కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం
కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
అవసరమైన పరీక్షలు..
బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు.
చికిత్స..
- సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు).
- ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్‌మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు.
- ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు.
- క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు.
— డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్.
Comments
Please login to add a commentAdd a comment