ప్రోగ్రెసివ్ బోన్ లాస్ నివారణ
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్‌గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.'
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...?
మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది.
ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ.
ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు..
మన ప్రమేయం లేనివి..
- కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది.
- కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి.
జెండర్ కారణాలు..
మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్‌లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది).
మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే..
- మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే..
- క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం.
- దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు).
- రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం.
- మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం.
- పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం.
- కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది.
ఎముక సాంద్రత తెలిసేదెలా..?
‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు.
ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం..
- ప్రోగ్రెసివ్ బోన్‌లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది.
- యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం.
- పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం.
- చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు.
— డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.
Comments
Please login to add a commentAdd a comment