చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Must Eat Healthy Foods During Winter Season | Sakshi
Sakshi News home page

Foods To Eat During Winter Season: చలికాలంలో వీటిని అస్సలు మిస్‌ అవ్వకండి.. ఈ ఆహారం తీసుకోండి

Published Fri, Oct 27 2023 2:25 PM | Last Updated on Fri, Oct 27 2023 3:59 PM

Must Eat Healthy Foods During Winter Season - Sakshi

చలి​కాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలి తీవ్రత పెరిగినప్పుడు గాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. 

ఆకుకూరలు
చాలామంది ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువే. చలికాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్‌ పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. 

పసుపు పాలు
గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపును వేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ గోల్డెన్‌ మిల్క్‌ను తీసుకోవాల్సిందే. 

హెర్బల్‌ గ్రీన్‌టీ
తులసి, అల్లం, లెమన్‌గ్రాస్‌తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్‌ టీని తాగితే చాలా మంచిది. 

నెయ్యి
చలికాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరనియ్యవు.

నువ్వులు
ఈ సీజన్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం కోసం నువ్వులను తీసుకోవాలి. నువ్వుల్లో వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ 
దానిమ్మలో ఎర్ర రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.

బెల్లం
బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని పెంచుతుంది. 

వేరుశనగ
ఇందులో విటమిన్ బీ 3, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం వేరుశనగలో ఉంటుంది. రాత్రి నానాబెట్టుకొని ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది. 

సిట్రస్‌ పండ్లు
చలికాలంలో వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్‌ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

జొన్నలు
జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టెలు తింటే చాలా మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement