తల్లి ఒత్తిడితో పుట్టబోయే పిల్లలకు ముప్పు!
న్యూయార్క్: గర్భంతో ఉన్న మహిళ ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందట. తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. అందుకే గర్బంతో ఉన్న మహిళలను ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఆ సమయంలో అనవసర విషయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారని ఓహియో వర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు.