మానవత్వమా...నీవెక్కడ
Published Mon, Jul 25 2016 6:09 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
పేగుబంధాలనే తెంచుకుంటున్నారు
చేయని తప్పునకు చిన్నారులు బలైపోతున్నారు
కలవరం రేపుతున్న వరుస సంఘటనలు
సాక్షి, గుంటూరు: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే కాటేస్తున్నారు... మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. కామంతో కళ్ళు మూసుకు పోయి కన్నబిడ్డలపైనే అత్యాచారాలకు తెగబడుతున్నారు... పేగుతెంచుకుపుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు అందరి మనస్సులను కలచివేస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్థమవుతుంది.
నరసరావుపేట మండలం ఉప్పలపాడు వాగులో ఆదివారం ఉదయం మూడు రోజుల వయస్సు ఉన్న ఇద్దరు ఆడశిశువులు విగతజీవులై పడిఉన్నారు. వీరిద్దరూ కవలలు కావడం గమనార్హం. అమ్మ పొత్తిళ్లల్లో ఒదిగి పడుకోవాల్సిన పసికందులు కాలువలో నిర్జీవంగా పడిఉండటం చూసిన వారికి కంట నీరు ఆగలేదు. సంబంధం లేని వ్యక్తులే అయ్యోపాపం అంటూ నిట్టూరుస్తుంటే ... నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వారిని విసిరిపడేయడానికి మనస్సు ఎలా ఒప్పిందంటూ అక్కడి వారు శాపనార్థాలు పెడుతున్నారు. అభం శుభం తెలియని ఇద్దరు పసికందులు ఇలా మృతువాతపడడం అందరి హృదయాలను కలిచి వేసింది. గతనెలలో గుంటూరు నగరంలో భార్యపై అనుమానంతో భార్యను, కన్న బిడ్డలను హతమార్చి రైలు కిందపడేసిన సంఘటన అందరిని కంటతడిపెట్టించింది. పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి భార్య నాగలక్ష్మితోపాటు, బిడ్డలు యశ్వంత్ (3), క్రినిష్ (1)లను అతికిరాతకంగా గొంతునులిమి హతమార్చి వారి మృతదేహాలను రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే విషయం బయటకు రావడంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే మొత్తాన్ని హతమార్చినట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం.ఏడాదిన్నర బిడ్డను జీజీహెచ్‌ఎదుట ఓ తల్లి వదిలి వెళితే ... చిన్నారి ఏడుపు విని అక్కున చేర్చుకోవాల్సిన ఓ వృద్ధురాలు బిడ్డను రూ. వెయ్యిలకు అమ్మజూపిన వైనం నగరంలో పదిరోజుల క్రితం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు గమనించి వృద్ధురాలితోపాటు, చిన్నారిని పోలీసులకు అప్పగించడంతో ఆబాలుడు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మనస్సులేని తండ్రి. సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనికి చెందిన కసాయి ఈనెల 22వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో పూటుగా మద్యం సేవించి కళ్లు మూసుకుపోయి తనకు పుట్టిన ఎనిమిదేళ్ళ కుమార్తెపైనే అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడ్డాడు. తల్లి మహంకాళ్లమ్మ ఫిర్యాదుతో కిరాతక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Advertisement