ఈ ప్రపంచాన్ని మార్చేయండి లేదా... | We can't change this world... | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచాన్ని మార్చేయండి లేదా...

Published Thu, Sep 24 2015 2:09 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

ఈ ప్రపంచాన్ని మార్చేయండి లేదా... - Sakshi

ఈ ప్రపంచాన్ని మార్చేయండి లేదా...

ఈ ఛిద్రాన్ని (చిత్రాన్ని) చూడలేకపోతున్నారు కదూ!
ఇలాంటి ఫొటో పెట్టి
మీ మనసుకు బాధ కలిగించాం కదూ!
క్షమించమని అడగం.
అంతగా చూడలేకపోతే పేజీ తిప్పేయండి.
ఇంకో బిడ్డ ఇలా చనిపోతే పోనీయండి.
మనింట్లో బిడ్డ బాగానే ఉన్నాడుగా!
ఎమ్మెల్యేగారింట్లో బిడ్డ కూడా బాగానే ఉండివుంటాడు!
మంత్రిగారి బిడ్డయితే...
పట్టుపాన్పు మీద పవళించి ఉంటాడు.
ఇక ముఖ్యమంత్రిగారి మనవడా... ఆ గారాలపట్టికి సింగపూర్ సౌఖ్యాలు అందే ఉంటాయి.
‘ఎవరెట్లా పోతే మనకేం’ అనుకుంటే చాలా సింపుల్.
పేజీ తిప్పేయండి.
ఈ రాక్షస, దౌర్జన్య జ్ఞాపకాన్ని తొందరగా చెరిపేయండి.
ముఖం తిప్పేయండి.
లేదా... పోరాడండి... మరో బిడ్డకు ఇలా జరక్కుండా
మరో తల్లి కన్నీరు పెట్టకుండా
మరో తండ్రి నిస్సహాయంగా కూలిపోకుండా
మరోసారి మనం పేజీ తిప్పేయకుండా పోరాడండి.
మనం వేసిన ఓటుకు, వాళ్లు వేసిన వేటుకు
సంజాయిషీ అడగండి.
ఈ పసిప్రాణానికి నిజమైన నివాళి...
ఈ పందికొక్కులను నిలదీయడం...
ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నినదించడం!

ప్రభుత్వ అధికారుల పిల్లలు
వర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని
అలహాబాద్ హైకోర్టు ఇటీవల
సంచలనమైన తీర్పు ఇచ్చింది.
అలాగే మన ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు,
మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు...
గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే
చికిత్స చేయించుకోవాలనే డిమాండ్ చేయండి.
లేదా, ఆ బిడ్డ తల్లి ఆక్రోశించినట్టుగా
గుణపాఠం చెప్పండి...

 
మృత్యు ఘడియలు
ఒకసారి చేస్తే తప్పు అవుతుంది. తప్పు వ్యవస్థీకృతం అయితే నేరం అవుతుంది. నేరం కొనసాగుతూ ఉంటే అది దారుణం అవుతుంది. దారుణాన్ని నిర్లక్ష్యం చేస్తే ఘోరం జరుగుతుంది. ఘోరం జరిగినప్పుడు ప్రపంచం నివ్వెరపోతుంది. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అదే జరిగింది.
 
సహాయం అడిగినప్పుడు ఒక చేయి అందించాలి. కానీ నిస్సహాయతతో అలమటిస్తున్నప్పుడు వేయి చేతులు అందించాలి. అనారోగ్యంతో ఉన్న పసికందును పొత్తిళ్లలో చుట్టుకుని తల్లీ తండ్రీ వస్తే, బిడ్డకు వచ్చిన కష్టానికి తల్లడిల్లుతూ ఉంటే, ఖరీదైన వైద్యానికి వెళ్లే స్తోమత లేకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తే... ఎన్ని చేతులు అందించాలి? ‘బిడ్డను బతికించండి బాబూ’ అని చేతుల్లో పెడితే ఎలుకలకు పడేశారు.
 
విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమాస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే అసాధారణ శారీకర సమస్య (కన్‌జెనిటల్ ఎనామలీ) బాబులో కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకుని వచ్చారు.
 
మొన్న ఆగస్టు 19న ఆపరేషన్ జరిగింది. ఐసియూలో వెంటిలేటర్ మీద ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసియూ అంటే ఇరవై నాలుగ్గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో ఎంత నొప్పిని అనుభవించాడో అన్న కనీస స్పందన లేకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ‘నీ పెద్దబాబు బాగానే ఉన్నాడు కదా... ఈ బాబు మీద ఆశ వదులుకోండి’ అని డాక్టర్లు, నర్సులు నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. ఎలుక కొరికిన వేళ్లకు వైద్యం కూడా చేయలేదు. కళ్లు, ముక్కు, చెవులు ఉండటం వల్ల మాత్రమే వీళ్లు మనుషులు. కానీ మానవత్వం లేని రాక్షసులు.
 
పులులే కాదు ఎలుకలు కూడా రక్తాన్ని రుచి మరుగుతాయి. కాపలా లేదని గ్రహించి పసికందును కబళించడానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 26 తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా బాబు కండను పీక్కు తినడం మొదలెట్టాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది లేరు. కాపాడటానికి వైద్యులు లేరు. గమనించడానికి ఎవరూ లేరు. కానీ తల్లి పేగు కదిలింది. బిడ్డకు ఏదో అపకారం జరుగుతున్నట్టు గ్రహించింది. బాలింతరాలైనా కదల్లేని స్థితిలో ఉన్నా కళ్లు తెరిచి చూస్తే కన్నబిడ్డ రక్తపు గడ్డగా కనిపించాడు. గుండె పగిలింది. శక్తి తెచ్చుకుని వాటిని తానున్న మంచం నుంచి అదిలించడానికి ప్రయత్నించింది. అరిచింది. కేకలు పెట్టింది. కానీ ఈలోపే అంతా జరిగిపోయింది. నాలుగ్గంటలు ఎలుకల దాడి జరిగింది. ఉదయం పదకొండు వరకూ డాక్టర్లు రాలేదు. వచ్చింది కూడా వైద్యం చేయడానికో, జరిగిన ఘోరానికి విచారించడానికో కాదు. బాబు మరణాన్ని నిర్లిప్తంగా ప్రకటించడానికి. వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. కానీ ఈ వైద్యులను ఎవరితో పోల్చాలి.
 
తల్లి... బిడ్డకు జన్మను వాగ్దానం చేయాలి. వైద్యుడు... రోగికి స్వస్థతను వాగ్దానం చేయాలి. పాలకుడు ప్రజలకు సుపరిపాలనను వాగ్దానం చేయాలి. మనిషి సాటి మనిషికి సహాయాన్ని వాగ్దానం చేయాలి. ఇక్కడ తల్లి తప్ప తక్కిన అందరూ వాగ్దాన భంగం చేశారు. ‘పసిగుడ్డు పోయాడులే’ అనుకోవడానికి లేదు. దాడి చేస్తున్న ఎలుకల బాధకు ఆ పసివాడు లోలోపల చేసిన ఆర్తనాదాలు వృథా పోవు. అవి ప్రకృతిలో కలిసి, ఈ వ్యవస్థను దహించడానికి సిద్ధమైతే... అందుకు జవాబుదారీ ఎవరు?
 
ఎలుకలూ... వ్యాధులూ
ఆస్తమాలు - అలర్జీలు :
ఎలుకల వల్ల ఎన్నో రకాల అలర్జీలు వస్తాయి. వాటి చర్మం, వెంట్రుకలు, విసర్జకాలు, చివరకు దానిపై నుంచి వచ్చే గాలి కూడా చాలా మందికి అలర్జీని కలిగిస్తుంది. ఆస్తమాకు కారణమవుతుంది. ఆ గాలి పీల్చిన మరుక్షణం చాలామందిలో ఉబ్బసం మొదలవుతుంది. ఇక అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, కళ్లు మంటలు లాంటి అనే దుష్పరిణామాలు ఎదురవుతాయి.
 
ప్లేగు : ఇది ఎలుకల నుంచి వ్యాపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్లేగును కలగజేసే బ్యాక్టీరియాను ఎలుకలు వ్యాప్తి చేస్తాయి. ప్లేగులో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి. లింఫ్ గ్రంథులు ప్రభావితమయ్యే జ్వరాన్ని బ్యూబోనిక్ ప్లేగ్ అంటారు. నిమోనిక్ ప్లేగ్ అనే ఇంకో రకం ప్లేగులో బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో పెరుగుతుంది. ఇక సెప్టిసీమిక్ ప్లేగ్ అనే  మరోరకం ప్లేగు కూడా భయంకరమైనదే. ప్లేగు వ్యాధి గతంలో ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేది. దీని వల్ల కలిగే మరణాలను ‘బ్లాక్ డెత్’ అని కూడా కూడా అనేవారు.
 
లెప్టోస్పైరోసిస్ : సాధారణ ఎలుకలతో ఇది వ్యాపిస్తుంది. ఎలుకల మూత్రంతో మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు ఇది వస్తుంది. ఈ జబ్బు... తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. కాలేయం పూర్తిగా చెడిపోవచ్చు. గుండెజబ్బులకూ దారితీయవచ్చు.
 
లింఫోసైటిక్ కోరియోమెనింజైటిస్: సంక్షిప్తంగా ఎల్‌సీఎమ్‌వీ అని పిలిచే ఈ వైరస్ ఎలుకల ద్వారానే వ్యాపిస్తుంది. ఇది మెదడు చుట్టూ ఉండే పొరలకూ, వెన్నుపాముకూ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. కొందరిలో దీని వల్ల దీర్ఘకాలిక దుష్ర్పయోజనాలు కనిపిస్తాయి.
 
లాసా ఫీవర్ : మల్టీ మామత్ ర్యాట్ అనే రకం ఎలుక నుంచి వస్తుందీ జబ్బు. ఎలుకల నుంచి వాసనతో పాటు వాటి విసర్జకాల నుంచి వస్తుంది. అది కరవడం వల్ల కూడా వస్తుంది. ఒకరికి వస్తే వారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
 
హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్: పొలాల్లో తిరిగే ఫీల్డ్ మౌస్, నార్వే ర్యాట్ వంటి ఎలుకలతో ఇది వ్యాపిస్తుంది. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే ఈ వ్యాధి ఎలుకల విసర్జకాలతో వస్తుంటుంది. కొరియా, స్కాండనేవియా, యూరప్‌లలోనూ ఇది కనిపిస్తుంది. ఎలుకల మలమూత్రాల మీది నుంచి వచ్చే గాలిని పీల్చినా, వాటిని తాకినా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికీ ఇది రావచ్చు.
 
హంటా వైరస్... : ఇది ఎలుకల వల్ల మొత్తం అమెరికా ఖండమంతా వ్యాపించి వణికించే వ్యాధి. డీర్‌మౌస్, రైస్ ర్యాట్స్, వైట్‌ఫుటెడ్ మౌస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎలుకల మలమూత్రాలతో గాలి కాలుష్యం కావడం, దాన్ని మనుషులు పీల్చడం వల్ల ఇది వస్తుంది. కొన్నిసార్లు ఆ మూలమూత్రాలను తెలియకుండా తాకడం వల్ల కూడా వస్తుంది. ఎలుక కాటు వల్ల అయ్యే గాయం వల్ల కూడా వస్తుంది.  
 
ర్యాట్ బైట్ ఫీవర్: ఎలుక కరవడం వల్ల వచ్చే తీవ్రమైన జ్వరం. కేవలం కరవడం మాత్రమే గాక... చచ్చిన ఎలుకను ముట్టుకున్నా కూడా ఈ తీవ్రమైన జ్వరం వస్తుంది.
 
పైన పేర్కొన్న కొన్ని మాత్రమే గాక... పరోక్షంగా సాల్మొనెల్లా, టేప్‌వార్మ్, కొన్ని రకాల కడుపు ఇన్ఫెక్షన్స్ (గ్యాస్ట్రో ఎంటిరైటిస్)లకు ఎలుకలు కారణమవుతుంటాయి.
 
ఐసీయూ ఎలా ఉండాలంటే..!
- ఐసీయూలోకి తీసుకొచ్చిన రోగుల పట్ల అక్కడి సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటారు.
- రోగిని తీసుకురాగానే అతడి కీలకమైన అంశాలను పరిశీలిస్తారు. అంటే శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందనలు, నాడీ స్పందనలు,  బ్లడ్‌ప్రెషర్ మొదలైనవి. అవి కీలకం కాబట్టే ఐసీయూ/వైద్య పరిభాషలో వాటిని ‘వైటల్స్’ (అత్యంత ప్రధానమైనవి) అని పిలుస్తారు.
- ఒకవేళ వైటల్స్ మారిపోతూ ఉంటే, అనుక్షణం వాటి కొలతలను పరిశీలించే యంత్రాలను అమర్చి, ప్రతి క్షణం వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు.
- ఇంటెన్సివిస్ట్, అనస్థీషియా నిపుణుల వంటివారు ముందుగా రోగిని చూస్తారు. అవసరమైన నిపుణులు వెంటనే వస్తారు. ఒకవేళ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉంటే ఆ యా విభాగాల వైద్య నిపుణులు అంతా ఒక బృందంగా (టీమ్‌వర్క్) ఏర్పడి, ఒకేసారి రోగికి సేవలు అందిస్తారు.
- రోగిని పరిశీలించే సమయంలో ఇన్ఫెక్షన్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన పారిశుద్ధ్య చర్యలు అంటే ఆల్కహాలిక్ హ్యాండ్ వాష్‌లు వాడటం, రోగికి వాడిన వెంటనే పారేయాల్సిన వస్తువులు (డిస్పోజబుల్స్), పదునుగా ఉండే వస్తువులు వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన చోట పడేస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు ఆసుపత్రుల హౌజ్‌కీపింగ్ సిబ్బంది శుభ్రం చేస్తూ ఉంటారు.
- విషమంగా ఉండే రోగి పరిస్థితి నిలకడకు వచ్చే వరకూ ఐసీయూలోనే ఉంటారు. అక్కడ ప్రతి రోగి వెంట ఒక వైద్య సహాయకుడు ఉంటారు. వాళ్లు లేదా డాక్టర్లు డ్యూటీ మారాల్సి వచ్చినా, తర్వాత వచ్చే సిబ్బందికి రోగి పరిస్థితి క్షుణ్ణంగా తెలిసేలా వివరిస్తారు. ఐసీయూలోని ప్రతి రోగి గురించీ... అక్కడి సిబ్బందికి పూర్తి అవగాహన ఉంటుంది.
- సాధారణంగా రోగి ఆ యా వైద్య పరీక్షల కోసం నిర్దిష్టమైన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఐసీయూలో రోగి పరిస్థితిని బట్టి మొబైల్ ఎక్స్‌రే వంటి పరీక్ష ఉపకరణాలను రోగి దగ్గరికి తీసుకొచ్చి, అతడు ఉన్న చోటే పరీక్షలు నిర్వహిస్తారు.
- రోగిలో వచ్చే మార్పులను వెంటవెంటనే నమోదు చేస్తారు. రాబోయే మార్పులను ముందుగా ఊహిస్తే... వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు.
 
ఎలుకలు... దాని పిల్లలు...

ఎలుకల్లో అనేక రకాలు ఉంటాయి. దాని గర్భధారణ వ్యవధి, పెట్టే పిల్లల సంఖ్య... అది ఏ రకానికి చెందిదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చిన్నగా కనిపించే చిట్టెలుకల గర్భధారణ వ్యవధి (జెస్టేషన్ పీరియడ్) 17-21 రోజులు ఉంటుంది. ఇక కాస్త పెద్దగా కనిపించే ఎలుకల గర్భధారణ వ్యవధి 19-22 రోజులు ఉంటుంది. సగటున ఒక ఎలుక ఎనిమిది నుంచి పన్నెండు పిల్లలను పెడుతుంది. ఇలా ప్రతిసారి పిల్లల్ని పెట్టినప్పుడు కొన్ని వారాల పాటు తల్లి ఎలుక పిల్లలను సంరక్షిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక సీజన్ అంటూ లేకుండా ఏడాదంతా ఎలుకలు పిల్లల్ని పెడుతూనే ఉంటాయి.
 
‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపండి!’
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అధ్వాన్న పరిస్థితులు మెరుగు పడాలంటే ప్రభుత్వ విధుల్లో ఉన్న వారంతా తమ పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేయించాలని అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల పని తీరు మీద, టీచర్ల నియామకాల మీద ఉమేశ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి వేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మొన్నటి ఆగస్టు 18న ఈ తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ద్వారా జీతభత్యాలు అందుకుంటున్న వారందరూ ఈ ఆదేశాలను పాటించాలనీ, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకునే వీలును కూడా పరిశీలించాలని కోరింది. ప్రయివేటు పాఠశాలల్లోనే చదివించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తే గనక ఆ స్కూళ్లకు ఎంత ఫీజు చెల్లిస్తున్నారో అంత ఫీజు అక్కడి ప్రభుత్వ బడి కోసం జరిమానాగా కట్టాలని కూడా పేర్కొంది. ఇలా చేస్తే తప్ప ప్రభుత్వ బడులు బాగుపడవని న్యాయమూర్తి ఈ విలక్షణమైన వ్యాఖ్య చేశారు.
 
ఎలుకలు కొరికే వైద్యం
మొన్న పధ్నాలుగో తేదీని ఇంటి దగ్గర జారి పడ్డాను. కుడిచేయి విరిగింది. ట్రీట్‌మెంట్ కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కి వచ్చాను. ఎముకల వార్డ్‌లో చేరాను. శుక్రవారం(18వ తేదీ) రాత్రి నిద్రలో ఉన్నాను. విరిగిన కుడిచేతిని ఏదో కొరుకుతున్నట్టు అనిపించ డంతో మెలకువ వచ్చింది. లేచి చూసుకుంటే రక్తం కారుతోంది. అక్కడే రెండు మూడు ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. కంగారుపడి వార్డులో డ్యూటీ చేస్తున్నవాళ్లకు చెప్పాను. వెంటనే క్యాజువాలిటీకి తీసుకెళ్ళి ఇంజెక్షన్లు చేయించారు. తెల్లవారి డాక్టర్లు వచ్చి గాయాన్ని చూశారు. మొన్న ఆ బిడ్డ వంతు... ఇప్పుడు నా వంతు.
- రాయపాటి ఏసమ్మ, దుర్గి గ్రామం, గుంటూరు జిల్లా
 
గతంలో ఏం చేశారు?
ఇదివరకైతే జీజీహెచ్ శానిటేషన్‌పై రోజూ ప్రత్యేక దృష్టి పెట్టేవాళ్ళం. వారంలో ఒకసారి అన్ని డిపార్ట్‌మెంట్లనూ పరిశీలించి క్రిమికీటకాలు, జంతుజాలం లోనికి రాకుండా నివారణ చర్యలు తీసుకునేవాళ్ళం. ఎలుకల నివారణ కోసం తరచూ తనిఖీలు చేసి గుంతలు పూడ్చేయించేవాళ్లం. ఎలుకల నివారణ కోసం మందుతోపాటు ఎలుకల బోనులు పెట్టే వాళ్ళం. ఎన్‌ఐసీయూ, ఆర్థో పెడిక్, కాన్పుల విభాగం, తదితర విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, శుభ్రంగా ఉండేలా చూసేవాళ్ళం. ఓపీ, ఐపీ విభాగాలకీ, మిలీనియం బ్లాక్‌ల శానిటేషన్ పర్యవేక్షణకీ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ యాస్మిన్, డాక్టర్ రామ్‌కోటిరెడ్డిని నియమించాం కూడా!
- డా.ద్రోణంరాజు ఫణిభూషణ్, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్
 
ఆ తరువాత ఏం జరిగింది?
జీజీహెచ్‌లో ఎలుకల నిర్మూలన కోసం గుంతలను సిమెంటుతో పూడ్పించాం. అలాగే రైల్వేస్టేషన్, ఆసుపత్రి బయట పరిసరాల నుంచి ఎలుకలు లోపలకి  రాకుండా ఆసుపత్రి ప్రహరీ గోడ చుట్టూ ఉన్న గుంతలనూ పూడ్పించాం. అన్ని వార్డుల్లో బోనులు, మెష్‌లు ఏర్పాటు చేయించాం. పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో ఎలుకల నివారణ చర్యలు చేపట్టాం. తనిఖీలు నిర్వహించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.
 - డాక్టర్ చల్లా మోహన్‌రావు, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్
 
ఇప్పుడేం చేస్తున్నారు?
ముప్ఫై మంది జిల్లా అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయించాం. వీరు బుధవారం నుంచి 72 గంటల పాటు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైైవ్ నిర్వహిస్తారు. జీజీహెచ్ పారిశుద్ధ్యం మెరుగుపడేలా చూస్తారు. ఒక్కో ఉన్నతాధికారి ఒక్కో వార్డుకు ఇన్‌చార్జిగా ఉండి, ఎలుకల నిర్మూలనతోపాటు ఇతర జంతుజాలం లోపలకి రాకుండా చూస్తారు. క్రిమి కీటకాల నివారణకూ చర్యలు చేపడతారు.
- డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్
 
ధనార్జనే ధ్యేయంగా...
అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. పేదల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన ఆసుపత్రి కేవలం వైద్యుల వ్యాపారాలకు అనుకూలంగా మారింది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు నగరంలో ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే విధులు నిర్వహిస్తూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పేదలను మరిచిపోతున్నారు. ధనార్జనే ధ్యేయమైంది. సిబ్బంది, వైద్యులు పట్టించుకోవట్లేదని ఎందరో అభాగ్యులు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం శోచనీయం.
- జొన్నలగడ్డ వెంకట రత్నం, ప్రజాహక్కుల  జేఏసీ అధ్యక్షుడు
 
వందల కోట్ల బడ్జెట్ ఏమైపోతోంది?
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువసేపు గడుపుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు న్యాయం చేయలేకపోతున్నారు వైద్యులు. ఏటా వందల కోట్లతో వైద్యారోగ్యశాఖ పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆ నిధులు పేదలకు చేరకపోవడానికి కారణమేమిటో అధికారులు ఆలోచించడం లేదు. ఆ వందల కోట్ల బడ్జెట్‌లు ఏమవుతున్నాయి? రోగుల సౌకర్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? కుక్కలు, పాములు, ఎలుకల లాంటి ప్రమాదకరమైన ప్రాణుల నుంచి రోగులను ఎందుకని కాపాడలేకపోతున్నారు? ప్రభుత్వం స్పందించి, పటిష్ఠమైన  భద్రతాచర్యలు తీసుకోవాలి.
- డాక్టర్ టి.సేవాకుమార్, ఎస్‌హెచ్‌వో అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement