అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తలమానికంగా ఉన్న స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ)ను ఆక్సిజన్ సమస్య వెంటాడుతోంది. సరైన మోతాదులో ఆక్సిజన్ రాకపోవడంతో పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఏడాది 11 నెలల్లో ఏకంగా ఎస్‌ఎన్‌సీయూలోనే 313 మంది మృతి చెందినట్లు రికార్డులోనే స్పష్టంగా ఉంది. అందులో 47 మంది వెంటిలేటర్ సదుపాయం లేక మృతి చెందారు. ఇంత జరుగుతున్నా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం మీనామేషాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిబంధల ప్రకారం ఎస్‌ఎన్‌సీయూకి ప్రత్యేకంగా ఆక్సిజన్ సదుపాయం అందించాలి.
అలా కాకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అన్ని యూనిట్లతో సమానంగా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. దీంతో సరైన మోతాదులో ఆక్సిజన్ అందడం లేదు. దీంతో పసికందుల ప్రాణాలు వెంటిలేటర్‌పైనే పోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవ ంగా వెంటిలేటర్ రన్ కావడానికి 30 నుంచి 40 శాతం ఒత్తిడితో ఆక్సిజన్ రావాలి. కానీ కేవలం 15 శాతం మాత్రమే ఆక్సిజన్ వస్తోంది.
తక్కువ ప్రెజర్‌తో ఆక్సిజన్ వస్తుండడం పసికందుల ప్రాణాలకు శాపంగా మారుతోంది. అనస్తీషియా విభాగం ఆధీనంలోనే సర్వజనాస్పత్రిలో అన్ని విభాగాలకు ఆక్సిజన్ అందాలి. ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఆక్సిజన్‌ను ఎప్పటికప్పుడు మెయిన్‌టైన్ చేయకుండా జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అసలు వాటిని ఎవరు ఆపరేట్ చేస్తారో తెలియని పరిస్థితి. బయటి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వస్తుంటాయ్..పోతుంటాయ్. వాటిని ఎవరు డెలివరీ చేస్తారు.. స్టాక్ ఏవిధంగా మెయిన్‌టైన్ చేస్తారో అర్థం కావడం లేదు. పేరుకు మాత్రం అనస్తీషియా డిపార్ట్‌మెంట్ చూసుకుంటుందని చెబుతున్నారు. వారు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
సిలిండర్ల కొరత
ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని తెలుస్తోంది. యాజమాన్యం మాత్రం అటువంటి సమస్యే లేదని చెబుతున్నా, వార్డుల్లో మాత్రం సరిపడా ఆక్సిజన్ అందడం లేదని స్వయంగా ఆయా విభాగాల హెచ్‌ఓడీలే చెబుతున్నారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 30 నుంచి 40 సిలిండర్లను వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో ప్రతి రోజూ ఆ స్థాయిలో సిలిండర్లు వినియోగించిన దాఖలాలు అంతంత మాత్రమే. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనస్తీషియా విభాగం వారు చెబుతున్నదాన్ని బట్టి సిలిండర్ల వినియోగం జరిగితే ఎస్‌ఎన్‌సీయూకి సమస్యే ఉండదు.
మూలనపడ్డ వెంటిలేటర్
ఎస్‌ఎన్‌సీయూలో రూ లక్షలు విలువ చేసే వెంటిలేటర్ మూలనపడింది. కేవలం ఆక్సిజన్ సమస్యతో దీనిని వాడడం లేదు. ఇటీవల కాలంలో సెప్టిసీమియా, గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎంతో మంది పసికందులు ఆస్పత్రిలో చేరుతున్నారు. వెంటిలేటర్ అవసరమని తేలితే ఇతర జిల్లాలకు పంపించేస్తున్నారు. ఇటీవల విక్రాంత్ రెడ్డి అనే 25 రోజులు బాబును హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కి రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి కేసులు అధికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి.
ఆక్సిజన్ కొరతతో పసికందుల ప్రాణాలకు ముప్పు
వెంటిలేటర్‌కి సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ప్రస్తుతం 15 శాతం మాత్రమే అందుతోంది. ఇదే విషయాన్ని అనేక మార్లు సూపరింటెండెంట్, అనస్తీషియా విభాగం వారికి చెప్పాం. కొంత మంది పసికందులు, చిన్నారులు ఉన్నఫలంగా మృత్యువాత పడ్డారు. ఇలాంటి సమస్య వస్తుందనే వెంటిలేటర్‌ను పక్కన పెట్టాం. ఆక్సిజన్ సరైన మోతాదులో వస్తే మెరుగైన సేవలందిస్తాం.
- డాక్టర్ మల్లేశ్వరి(చిన్నపిల్లల విభాగం హెచ్‌ఓడీ)
వెంటిలేటర్ ఆగిపోయిన సందర్భాలున్నాయ్
వెంటిలేటర్‌పై ఉన్న చిన్నారులు ఉన్నట్లుండి ఊపిరాడక గిలగిలకొట్టుకుంటున్నారు. ఆంబు ద్వారా కృత్రిమ శ్వాసను అందించిన సందర్భాలు అనేకం. వెంటిలేటర్ ఆగిపోవడం ద్వారానే సమస్య వస్తోంది.
- డాక్టర్ సంజీవప్ప, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సర్వజనాస్పత్రి)
ఆక్సిజన్ సమస్య లేదు
ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదు. ఎస్‌ఎన్‌సీయూ విభాగం ఆక్సిజన్‌ను ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. అలా కాకుండా మాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య లేదు. ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఏర్పాటు చేస్తాం.
- డాక్టర్ నవీన్(అనస్తీషియా హెచ్‌ఓడీ)
ఉసురు తీస్తున్నారు..
Published Sun, Dec 7 2014 2:59 AM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM
Advertisement