oxygen problem
-
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
గోరఖ్‌పూర్ ఘటన : కఫీల్‌ఖాన్‌కు బెయిల్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్‌ఖాన్‌కు అలాహాబాద్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా తన భర్తకు బెయిల్ మంజూరైన సందర్భంగా కఫీల్‌ఖాన్ భార్య డాక్టర్ షబీస్తాన్ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్ కఫీల్‌ఖాన్ కూడా ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో ఘటనను ప్రధాన ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. -
ఊపిరి.. ఉక్కిరి బిక్కిరి
కనిపించని సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం - సర్కారు ఆసుపత్రుల్లో అత్యవసరమైతే ఇక్కట్లే.. - జిల్లా కేంద్రం, హిందూపురంలో మాత్రమే ఏర్పాటు - వీటిలోనూ కొన్ని వార్డుల్లో సిలిండర్లే దిక్కు - వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత - గోరఖ్‌పూర్ ఘటనతోనూ మేల్కోని అధికార యంత్రాంగం అనంతపురం మెడికల్: గోరఖ్‌పూర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పసిప్రాణాలు గాల్లో కలిసిన విషయం తెలిసిందే. సిలిండర్లు సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు చెల్లించలేదనే కారణంగా సరఫరా నిలిపివేయడంతో ప్రాణవాయువు అందక అభంశుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇంతలా కాకున్నా ‘అనంత’లోనూ సర్కారు ఆస్పత్రులకు ‘ఊపిరి’పోయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం స్పందిస్తే తప్ప భవిష్యత్‌లో ‘గోరఖ్‌పూర్’ తరహా ఘటన పునరావృతం కాకుండా చూడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘సెంట్రల్’ సిస్టం ఉన్నా అంతంతమాత్రమే.. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 17 ఏళ్ల క్రితం ఏర్పాటైన సర్వజనాస్పత్రిలో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఉన్నా పూర్తి స్థాయిలో విస్తరించని పరిస్థితి. ప్రధానంగా ఛాతీ వార్డులో ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులకు అష్టకష్టాలు తప్పట్లేదు. గతంలో ఇదే వార్డులో ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. ఎంఎస్–1, ఎంఎస్–2, ఎఫ్ఎస్–1, ఎఫ్ఎస్–2, ఎంఎం, ఎఫ్ఎం, ఐడీ వార్డుల్లోనూ ఆక్సిజన్ ఆవశ్యకత ఉన్నా ‘సెంట్రల్’ సిస్టం లేకపోవడంతో అత్యవసరమైతే ఏకంగా ఏఎంసీకి తీసుకొస్తున్నారు. సాధారణంగా ఇక్కడి పడకలన్నీ ఎప్పుడూ రోగులతో నిండిపోతుంటాయి. ఈ సమయంలో ఇతర వార్డుల్లోంచి కేసులను తీసుకొస్తే వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మళ్లీ వార్డుల్లోనే ‘సిలిండర్లు’ ఉంచి ప్రాణవాయువు అందిస్తున్నారు. నిత్యం 80 నుంచి 90 సిలిండర్లు అవసరం అవుతుండగా.. ఓ ప్రైవేట్ ఏజెన్సీ వీటిని సరఫరా చేస్తోంది. ఇక హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అత్యవసర విభాగాలకు మాత్రమే ‘సెంట్రల్ ఆక్సిజన్’ సరఫరా అవుతోంది. ఇక్కడ పెద్ద సిలిండర్లు 18, చిన్న సిలిండర్లు 42 ఉండగా.. బెంగళూరులోని ఓ ఏజెన్సీతో అద్దె ప్రాతిపదికన నెట్టుకొస్తున్నారు. అద్దె చెల్లింపులతోనే కాలయాపన జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 80 పీహెచ్‌సీలు ఉండగా ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా ఎక్కడా సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా పద్ధతి లేదు. కదిరి, ధర్మవరం, రాయదుర్గం, గుత్తి, పెనుకొండ, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, మడకశిర, సీకే పల్లి, శింగనమల, నల్లమాడ, పామిడి, కొండకమర్ల, కళ్యాణదుర్గం, కణేకల్లు, తనకల్లు ఆస్పత్రులు 30 నుంచి 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, సర్జరీలు, ప్రసవాలు ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఏవైనా ప్రమాదాల్లో చిక్కుకునే వారికి తక్షణం ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది. అయితే శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా అద్దె చెల్లింపులతోనే కాలం గడుపుతున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులను సిలిండర్ల కోసం వెచ్చిస్తున్నారు. వాస్తవానికి ఆయా ఆస్పత్రుల్లో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఏర్పాటు చేయాలంటే రూ.కోట్లేమీ కావని, రూ.లక్షల్లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవచ్చని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. కొన్ని ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం గమనార్హం. వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో మ్యానిఫోల్డ్(సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా జరిగే గది) గదిలో విధులు నిర్వర్తించేందుకు టెక్నీషియన్లు ఎవరూ లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆస్పత్రిలోని అనస్తీషియా టెక్నీషియన్లే ఈ బాధ్యత చూస్తున్నారు. రోజుకు నాలుగైదు సార్లు సిలిండర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో సారి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. సర్జరీలు జరిగే సమయంలో తప్పనిసరిగా అనస్తీషియా టెక్నీషియన్లు ఆపరేషన్లలో నిమగ్నమై ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మ్యానిఫోల్డ్ గదిలో సిలిండర్లు బిగించడం కష్టతరంగా మారుతోంది. అత్యవసరమైతే ఏఎంసీకి తీసుకెళ్తాం సర్వజనాస్పత్రిలోని ఎఫ్ఎం వార్డులో రోజూ 30 మంది అడ్మిట్ అవుతారు. కొన్ని బ్యాడ్ కేసులు ఉంటాయి. రెండు సిలిండర్లు వార్డులో ఉంటాయి. అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తే ఏఎంసీకి తరలిస్తాం. ఆ టైంలో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కోసారి గొడవకు దిగుతారు. ఈ వార్డుతో పాటు చెస్ట్ వార్డులోనూ సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం ఉంటే బాగుంటుంది. మెడికల్ వార్డుల్లో తప్పనిసరి. - ఆర్బీ పద్మావతి దేవి, ఏపీ నర్సెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు. -
ఉసురు తీస్తున్నారు..
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తలమానికంగా ఉన్న స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)ను ఆక్సిజన్ సమస్య వెంటాడుతోంది. సరైన మోతాదులో ఆక్సిజన్ రాకపోవడంతో పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఏడాది 11 నెలల్లో ఏకంగా ఎస్ఎన్సీయూలోనే 313 మంది మృతి చెందినట్లు రికార్డులోనే స్పష్టంగా ఉంది. అందులో 47 మంది వెంటిలేటర్ సదుపాయం లేక మృతి చెందారు. ఇంత జరుగుతున్నా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం మీనామేషాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎన్ఆర్హెచ్ఎం నిబంధల ప్రకారం ఎస్ఎన్సీయూకి ప్రత్యేకంగా ఆక్సిజన్ సదుపాయం అందించాలి. అలా కాకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అన్ని యూనిట్లతో సమానంగా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. దీంతో సరైన మోతాదులో ఆక్సిజన్ అందడం లేదు. దీంతో పసికందుల ప్రాణాలు వెంటిలేటర్‌పైనే పోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవ ంగా వెంటిలేటర్ రన్ కావడానికి 30 నుంచి 40 శాతం ఒత్తిడితో ఆక్సిజన్ రావాలి. కానీ కేవలం 15 శాతం మాత్రమే ఆక్సిజన్ వస్తోంది. తక్కువ ప్రెజర్‌తో ఆక్సిజన్ వస్తుండడం పసికందుల ప్రాణాలకు శాపంగా మారుతోంది. అనస్తీషియా విభాగం ఆధీనంలోనే సర్వజనాస్పత్రిలో అన్ని విభాగాలకు ఆక్సిజన్ అందాలి. ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఆక్సిజన్‌ను ఎప్పటికప్పుడు మెయిన్టైన్ చేయకుండా జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అసలు వాటిని ఎవరు ఆపరేట్ చేస్తారో తెలియని పరిస్థితి. బయటి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వస్తుంటాయ్..పోతుంటాయ్. వాటిని ఎవరు డెలివరీ చేస్తారు.. స్టాక్ ఏవిధంగా మెయిన్టైన్ చేస్తారో అర్థం కావడం లేదు. పేరుకు మాత్రం అనస్తీషియా డిపార్ట్మెంట్ చూసుకుంటుందని చెబుతున్నారు. వారు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సిలిండర్ల కొరత ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని తెలుస్తోంది. యాజమాన్యం మాత్రం అటువంటి సమస్యే లేదని చెబుతున్నా, వార్డుల్లో మాత్రం సరిపడా ఆక్సిజన్ అందడం లేదని స్వయంగా ఆయా విభాగాల హెచ్ఓడీలే చెబుతున్నారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 30 నుంచి 40 సిలిండర్లను వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో ప్రతి రోజూ ఆ స్థాయిలో సిలిండర్లు వినియోగించిన దాఖలాలు అంతంత మాత్రమే. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనస్తీషియా విభాగం వారు చెబుతున్నదాన్ని బట్టి సిలిండర్ల వినియోగం జరిగితే ఎస్ఎన్సీయూకి సమస్యే ఉండదు. మూలనపడ్డ వెంటిలేటర్ ఎస్‌ఎన్‌సీయూలో రూ లక్షలు విలువ చేసే వెంటిలేటర్ మూలనపడింది. కేవలం ఆక్సిజన్ సమస్యతో దీనిని వాడడం లేదు. ఇటీవల కాలంలో సెప్టిసీమియా, గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎంతో మంది పసికందులు ఆస్పత్రిలో చేరుతున్నారు. వెంటిలేటర్ అవసరమని తేలితే ఇతర జిల్లాలకు పంపించేస్తున్నారు. ఇటీవల విక్రాంత్ రెడ్డి అనే 25 రోజులు బాబును హయ్యర్ ఇన్స్టిట్యూట్కి రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి కేసులు అధికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో పసికందుల ప్రాణాలకు ముప్పు వెంటిలేటర్‌కి సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ప్రస్తుతం 15 శాతం మాత్రమే అందుతోంది. ఇదే విషయాన్ని అనేక మార్లు సూపరింటెండెంట్, అనస్తీషియా విభాగం వారికి చెప్పాం. కొంత మంది పసికందులు, చిన్నారులు ఉన్నఫలంగా మృత్యువాత పడ్డారు. ఇలాంటి సమస్య వస్తుందనే వెంటిలేటర్‌ను పక్కన పెట్టాం. ఆక్సిజన్ సరైన మోతాదులో వస్తే మెరుగైన సేవలందిస్తాం. - డాక్టర్ మల్లేశ్వరి(చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ) వెంటిలేటర్ ఆగిపోయిన సందర్భాలున్నాయ్ వెంటిలేటర్‌పై ఉన్న చిన్నారులు ఉన్నట్లుండి ఊపిరాడక గిలగిలకొట్టుకుంటున్నారు. ఆంబు ద్వారా కృత్రిమ శ్వాసను అందించిన సందర్భాలు అనేకం. వెంటిలేటర్ ఆగిపోవడం ద్వారానే సమస్య వస్తోంది. - డాక్టర్ సంజీవప్ప, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సర్వజనాస్పత్రి) ఆక్సిజన్ సమస్య లేదు ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదు. ఎస్ఎన్సీయూ విభాగం ఆక్సిజన్‌ను ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. అలా కాకుండా మాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య లేదు. ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఏర్పాటు చేస్తాం. - డాక్టర్ నవీన్(అనస్తీషియా హెచ్ఓడీ)