ఊపిరి.. ఉక్కిరి బిక్కిరి
కనిపించని సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం
- సర్కారు ఆసుపత్రుల్లో అత్యవసరమైతే ఇక్కట్లే..
- జిల్లా కేంద్రం, హిందూపురంలో మాత్రమే ఏర్పాటు
- వీటిలోనూ కొన్ని వార్డుల్లో సిలిండర్లే దిక్కు
- వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత
- గోరఖ్‌పూర్ ఘటనతోనూ మేల్కోని అధికార యంత్రాంగం
అనంతపురం మెడికల్: గోరఖ్‌పూర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పసిప్రాణాలు గాల్లో కలిసిన విషయం తెలిసిందే. సిలిండర్లు సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు చెల్లించలేదనే కారణంగా సరఫరా నిలిపివేయడంతో ప్రాణవాయువు అందక అభంశుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇంతలా కాకున్నా ‘అనంత’లోనూ సర్కారు ఆస్పత్రులకు ‘ఊపిరి’పోయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం స్పందిస్తే తప్ప భవిష్యత్‌లో ‘గోరఖ్‌పూర్’ తరహా ఘటన పునరావృతం కాకుండా చూడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘సెంట్రల్’ సిస్టం ఉన్నా అంతంతమాత్రమే..
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 17 ఏళ్ల క్రితం ఏర్పాటైన సర్వజనాస్పత్రిలో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఉన్నా పూర్తి స్థాయిలో విస్తరించని పరిస్థితి. ప్రధానంగా ఛాతీ వార్డులో ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులకు అష్టకష్టాలు తప్పట్లేదు. గతంలో ఇదే వార్డులో ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. ఎంఎస్–1, ఎంఎస్–2, ఎఫ్‌ఎస్–1, ఎఫ్‌ఎస్–2, ఎంఎం, ఎఫ్‌ఎం, ఐడీ వార్డుల్లోనూ ఆక్సిజన్ ఆవశ్యకత ఉన్నా ‘సెంట్రల్’ సిస్టం లేకపోవడంతో అత్యవసరమైతే ఏకంగా ఏఎంసీకి తీసుకొస్తున్నారు. సాధారణంగా ఇక్కడి పడకలన్నీ ఎప్పుడూ రోగులతో నిండిపోతుంటాయి.
ఈ సమయంలో ఇతర వార్డుల్లోంచి కేసులను తీసుకొస్తే వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మళ్లీ వార్డుల్లోనే ‘సిలిండర్లు’ ఉంచి ప్రాణవాయువు అందిస్తున్నారు. నిత్యం 80 నుంచి 90 సిలిండర్లు అవసరం అవుతుండగా.. ఓ ప్రైవేట్ ఏజెన్సీ వీటిని సరఫరా చేస్తోంది. ఇక హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అత్యవసర విభాగాలకు మాత్రమే ‘సెంట్రల్ ఆక్సిజన్’ సరఫరా అవుతోంది. ఇక్కడ పెద్ద సిలిండర్లు 18, చిన్న సిలిండర్లు 42 ఉండగా.. బెంగళూరులోని ఓ ఏజెన్సీతో అద్దె ప్రాతిపదికన నెట్టుకొస్తున్నారు.
అద్దె చెల్లింపులతోనే కాలయాపన
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 80 పీహెచ్‌సీలు ఉండగా ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా ఎక్కడా సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా పద్ధతి లేదు. కదిరి, ధర్మవరం, రాయదుర్గం, గుత్తి, పెనుకొండ, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, మడకశిర, సీకే పల్లి, శింగనమల, నల్లమాడ, పామిడి, కొండకమర్ల, కళ్యాణదుర్గం, కణేకల్లు, తనకల్లు ఆస్పత్రులు 30 నుంచి 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి.
ఈ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, సర్జరీలు, ప్రసవాలు ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఏవైనా ప్రమాదాల్లో చిక్కుకునే వారికి తక్షణం ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది. అయితే శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా అద్దె చెల్లింపులతోనే కాలం గడుపుతున్నారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను సిలిండర్ల కోసం వెచ్చిస్తున్నారు. వాస్తవానికి ఆయా ఆస్పత్రుల్లో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఏర్పాటు చేయాలంటే రూ.కోట్లేమీ కావని, రూ.లక్షల్లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవచ్చని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. కొన్ని ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం గమనార్హం.
వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత
జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో మ్యానిఫోల్డ్(సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా జరిగే గది) గదిలో విధులు నిర్వర్తించేందుకు టెక్నీషియన్లు ఎవరూ లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆస్పత్రిలోని అనస్తీషియా టెక్నీషియన్లే ఈ బాధ్యత చూస్తున్నారు. రోజుకు నాలుగైదు సార్లు సిలిండర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో సారి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. సర్జరీలు జరిగే సమయంలో తప్పనిసరిగా అనస్తీషియా టెక్నీషియన్లు ఆపరేషన్లలో నిమగ్నమై ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మ్యానిఫోల్డ్ గదిలో సిలిండర్లు బిగించడం కష్టతరంగా మారుతోంది.
అత్యవసరమైతే ఏఎంసీకి తీసుకెళ్తాం
సర్వజనాస్పత్రిలోని ఎఫ్‌ఎం వార్డులో రోజూ 30 మంది అడ్మిట్ అవుతారు. కొన్ని బ్యాడ్ కేసులు ఉంటాయి. రెండు సిలిండర్లు వార్డులో ఉంటాయి. అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తే ఏఎంసీకి తరలిస్తాం. ఆ టైంలో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కోసారి గొడవకు దిగుతారు. ఈ వార్డుతో పాటు చెస్ట్ వార్డులోనూ సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం ఉంటే బాగుంటుంది. మెడికల్ వార్డుల్లో తప్పనిసరి.
- ఆర్‌బీ పద్మావతి దేవి, ఏపీ నర్సెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు.