తల్లడిల్లిన పసిహృదయం
బొడ్డూడని పసిగుడ్డును కర్కశ హృదయులు మురుగునీటిలో పడేశారు. కళ్లు తెరవక ముందే ఎలుకలు, పందికొక్కులు కొరుకుతుంటే ఆ పసిహృదయం తల్లడిల్లింది. కోటి కలలతో ప్రపంచాన్ని చూడాల్సిన ఆ శిశువు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. బహుశా భగవంతునికే ఈ పరిస్థితి చూసి మనసు చివుక్కుమందేమో! మత్స్యకారుడి రూపంలో వచ్చి రక్షించాడు. అయితే అప్పటికే ఎలుకలు కాళ్లు కొరికాయి. రక్తస్రావమైన పసి బిడ్డకు కేజీహెచ్‌లో చికిత్స అందజేస్తున్నారు.
* అప్పుడే పుట్టిన బిడ్డను డ్రైనేజీలో పడేసిన కర్కశ హృదయులు
* కాళ్లను ఎలుకలు కొరుక్కుతింటుండగా రక్షించిన మత్స్యకారుడు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని కేజీహెచ్ పిల్లల వార్డు గోడకు ఆనుకొని ఉన్న రెల్లివీధిలో బుధవారం వేకువజామున డ్రైనేజీలో ఎవరో బిడ్డను పడేసి పోయారు. సముద్రంలో చేపల వేటకెళ్తున్న మత్స్యకారుడు కారే నర్సింహులు శిశువు ఏడుపు విని పరుగున వెళ్లి చూసే సరికి రక్తపు మరకలతో ఉన్న బాలుడు కనిపించాడు.
ఎలుకలు, పందికొక్కులు తింటున్న చిన్నారిని కాలువ నుంచి బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించాడు. అప్పటికే ఎలుకల దాడిలో తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పిల్లల వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉన్నా రెండ్రోజుల వరకు ఏ విషయం చెప్పలేమని పిల్లలవార్డు విభాగాధిపతి డాక్టర్ పద్మలత ‘సాక్షి’కి తెలిపారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..: ఘటనను కలెక్టర్ యువరాజ్ దృష్టికి తీసుకెళ్లాం. బిడ్డ 1.70 కిలోల బరువున్నాడు. బాలుడి కాళ్ల వేళ్లు కొరికిన ఆనవాళ్లున్నాయి. మురికినీళ్లలో ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకింది. చికిత్స అందజేస్తున్నాం. కేజీహెచ్‌లో శిశువు అదృశ్యమైనట్టు మాకు ఫిర్యాదు అందలేదు.
- మధుసూధనబాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్