రోదిస్తున్న కుటుంబ సభ్యులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట పీహెచ్‌సీలో అప్పడే పుట్టిన శిశువు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లికి చెందిన ఓరుగంటి వర్షిత(29) శనివారం పుటిరినొప్పులతో ఇల్లంతకుంట పీహెచ్‌సీకి ప్రసవానికి వచ్చింది. సిబ్బంది సుఖప్రసవం కోసం ప్రయత్నించారు. సాయంత్రం 5గంటలకు విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సులు జగదీశ్వరీ, రేణుక, రాజశ్రీలు సిరిసిల్ల జేసీ మీటింగ్‌లో ఉన్న వైద్యాధికారి లతకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
దీంతో సుఖప్రసవం చేయాలని వారికి ఆదేశించారు. రాత్రి 7గంటలకు ప్రసవం చేశారు. మగశిశువు ఉమ్మనీరు మింగడంతో పాటు, మెడకు బొడ్డుపేగు చుట్టుకుని జన్మించాడు. గంట తరువాత కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసవం చేయకపోవడంతోనే శిశువు మృతిచెందిందని, స్టాఫ్‌నర్సులు వైద్యాధికారికి ఫోన్ చేసి ఆమె చెప్పిన ప్రకారం ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం పీహెచ్‌సీకి చేరుకుని వైద్యాధికారులు లత, రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓ పక్క శిశువు మరణించాడనే పుట్టెడు దు:ఖంలో ఉన్న వర్షితకు కేసీఆర్ కిట్ ఇచ్చేందుకు స్టాఫ్‌నర్సులు ప్రయత్నించారు. దీంతో వారిపై ‘నా కొడుకును చంపేశారు... కిట్ ఇస్తున్నారా..?’ అంటూ వర్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment