పుట్టిన బిడ్డకూ ఆధార్
-
పెద్దాస్పత్రిలో ఏర్పాట్లు
-
జనన ధృవీకరణ పత్రం కూడా
-
ప్రజలకు ఎంతో మేలు
నెల్లూరు(అర్బన్):
ఇక మీదట స్థానిక దర్గామిట్టలోని జనరల్(పెద్దాసుపత్రి) ఆసుపత్రిలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్‌ను ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం మొదట దశలో విశాఖపట్టణంతో పాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని జనరల్ ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో భాగంగా నగరంలోని పెద్దాసుపత్రిలో ఆధార్‌కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంప్యూటర్, ప్రింటర్‌లను కొనుగోలు చేయబోతున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జూన్ నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి జనన, మరణాలకు సంబంధించి ధృవపత్రాలను ఇస్తున్నారు. జననాలకు సంబంధించి తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌ను నోట్ చేయాలని 10 రోజుల క్రితమే ఆదేశాలొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పుట్టిన బిడ్డకు ఆధార్ నంబర్‌ను ఇవ్వాలని ఆదేశాలొచ్చాయి. బిడ్డకు పేరుపెట్టకుండానే ఫిమేల్/ మేల్ బేబీ అని నమోదు చేసి మొదట ఆధార్‌ను ఇస్తారు. ఐదారు నెలల తరువాత తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరుపెట్టుకుని వస్తే మళ్లీ ఆధార్‌లో పేరును నమోదు చే స్తారు. దీంతో గ్రామీణ పేదలు ఎక్కడికి తిరగకుండానే కాన్పు జరిగిన చోటే ఆధార్‌ను సులభంగా పొందే అవకాశముంటుంది. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.
కాస్త ఆలస్యం:
ఆధార్ నమోదు ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నెల్లూరు పెద్దాసుపత్రిలో కాస్త ఆలస్యం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు, రూమ్ ఏర్పాటుకు కొద్ది రోజులు పట్టవచ్చు. ఈ విషయమై డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా స్పందించారు. ప్రింటర్, కంప్యూటర్‌లు కొనుగోలుకు సంబంధించి కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడాల్సి ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడాక వాటిని కొనుగోలు చేసి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా సరిచూసుకుని ఆధార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ ఆధార్ ప్రక్రియతో పెద్దాసుపత్రిలో కాన్పులు కూడా పెరుగుతాయని భావిస్తున్నామని తెలిపారు.