Nellore Government Hospital
-
ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మృతి చెందడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని సూపరిండెంట్ సిద్ధా నాయక్ ఖండించారు. ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని సూపరింటెండెట్ పేర్కొన్నారు. చదవండి: ఆ నలుగురిపై సీఎం జగన్ కౌంటర్లు.. అందుకేనా? -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అతడి బాధితులు నిర్భయంగా మహిళా కమిషన్‌కు వివరాలు వెల్లడించాలని చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఫిర్యాదులు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. సూపరింటెండెంట్ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో గురువారం బహిర్గతమైన విషయం తెలిసిందే. -
ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు కూలీలు మృతి
సాక్షి, నెల్లూరు: సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమచారం. దువ్వూరు నుంచి విడవలూరుకు చేపల వేట కోసం వెళ్తున్న కూలీలు దువ్వూరు వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుచ్చి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని వెల్లడించారు. ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో కూలీలు మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. -
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. తిరుపతి స్విమ్స్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 14 రోజుల చికిత్స తర్వాత మరోసారి అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగిటివ్‌గా తేలిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. అలాగే కరోనా సోకిన వ్యక్తి నెల్లూరుకు వచ్చాక అతనితో సన్నిహితంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 73కు చేరింది. చదవండి : రికార్డు స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు కరోనా బాధితుడు ‘కరోనా వ్యాప్తి ఆందోళనకరమే’ -
నెల్లూరులో కరోనా నిర్ధారణ కాలేదు : సూపరింటెండెంట్
సాక్షి, నెల్లూరు : ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్ధారణ కాలేదని నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఆ వ్యక్తి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపామని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ఉందని తేలితే వైద్యం అందిస్తామని తెలిపారు. -
శిశువు కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. కిడ్నాప్‌కి పాల్పడిన ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు. కోట మండలానికి చెందిన లక్ష్మీ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ ఏడవడం లేదని అత్యవసర విభాగంలో చేర్చారు. కొద్ది సేపటి తర్వాత ఆ శిశువు తల్లిని అంటూ అత్యవసర విభాగంలోని వచ్చిన ఓ మహిళ బిడ్డను తీసుకొని పరారైంది. బిడ్డను చూసేందుకు లక్ష్మీ కుటుంబ సభ్యులు అత్యవసర విభాగంలోకి వెళ్లగా అక్కడ శిశువు కనిపించలేదు. దీంతో లక్ష్మీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కిడ్నాప్‌కు పాల్పడిన మహిళను గుర్తించారు. సదరు మహిళ తనకు తెలుసునని ఓ యువకుడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై కోవూరు ఉన్న మహిళను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో మహిళను కూడా అరెస్టు చేశారు. బిడ్డను లక్ష్మీకి అప్పగించారు. -
కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు
నెల్లూరు (బారకాసు): వైద్యం కోసం వెళ్లిన రోగికి ఆపరేషన్ చేసి.. అతడి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన ఘటన నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరానికి చెందిన ఎస్.చలపతి కొంత కాలంగా చలపతి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యం నిమిత్తం ఈనెల 2న నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. కడుపు లో టీబీ వల్ల చీము పట్టి పేగులు పాడయ్యాయని వైద్యులు గుర్తించారు. ఈనెల 3న జనరల్ సర్జన్ విభాగానికి చెందిన హెచ్ఓడీ డాక్టర్ పద్మశ్రీ, ఇతర వైద్యులు పద్మజారాణి, సాయిసుదీప్, వేణుగోపాల్‌ల బృందం ఆయ నకు శస్త్రచికిత్స చేసింది. ఆ సమయంలో డాక్టర్ పద్మజారాణి ఆపరేషన్‌కు ఉపయో గించే కత్తెరను రోగి కడుపులోనే వదిలేసింది. మిగిలిన వైద్యులు ఈ విషయం గమనించ కుండా కుట్లు వేసేశారు. దీంతో కోలుకోని చలపతి ఈనెల 27న ఆస్పత్రికి వచ్చి ఎక్స్‌రే తీయగా.. కడుపులో కత్తెర కన్పించడంతో వైద్యులు కంగుతిన్నారు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా ఈ నెల 28న చలపతికి రెండోసారి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కత్తెరను తొలగించారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరిని వివరణ కోరగా.. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని చెప్పారు. -
డాక్టర్లే బిడ్డను చంపేశారు..
నేపాలి దంపతుల ఆవేదన నష్ట పరిహారం చెల్లించాలంటూ దళిత విద్యార్థి సేన ధర్నా నెల్లూరు (అర్బన్) : డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ కళ్లు తెరవకుండానే కడుపులోనే మృతి చెందాడని నేపాల్ దేశానికి చెందిన దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. బందువులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా దళిత విద్యార్ధి సేన నాయకులు ధర్నా చేశారు. ఈ సంఘటన నెల్లూరు పెద్దాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల సమాచారం మేరకు కోవూరు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారం కాలనీలో రాంబహదూర్, ధనలక్ష్మి నివాసం ఉంటున్నారు. ధనలక్ష్మి నిండు గర్భిణి. పెద్దాసుపత్రిపై నమ్మకంతో వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. నాలుగు రోజుల కిందట కాన్పు కోసం ఆసుపత్రిలో అడ్మిషన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి కడుపులో నొప్పి వస్తుందని డాక్టర్లకు ధనలక్ష్మి చెప్పినా పట్టించుకోలేదు. చివరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయని ధనలక్ష్మి డ్యూటీ డాక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆమె ఏమి కాదులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో తెలిసిన వారి సాయంతో ఇన్చార్జి సూపరింటెండెంట్ నిర్మలకు ఫిర్యాదు చేశారు. ఆమె డాక్టర్ ఫోన్ చేసి పరీక్షించాలని సూచించారు. అయినా ఆ డాక్టర్ స్పందించక పోగా నీకు.. తెలుసా.. మాకు తెలుసా అంటూ ధనలక్ష్మిపై మండిపడింది. కడుపు నొప్పిని భరిస్తున్నా..మంగళవారం సాయంత్రం వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వేరే డాక్టర్ డ్యూటీకి రావడం, కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డాక్టర్ వెంటనే పరీక్ష చేసి చూడగా కడుపులో బిడ్డ మరణించినట్టు తెలిసింది. హడావుడిగా ఆపరేషన్ చేసి మరణించిన ఆడ బిడ్డను బంధువుల చేతిలో పెట్టారు. దీంతో బంధుమిత్రులు ఆవేదనకు గురయ్యారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చినందుకు తమ బడ్డను డాక్టర్లు చంపేశారంటూ కన్నీరు, మున్నీరుగా విలపించారు. దళిత విద్యార్థిసేన ఆధ్వర్యంలో ధర్నా విషయం తెలుసుకున్న దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద రాత్రి పూటనే ధర్నాకు దిగారు. బిడ్డ మరణానికి డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యమే కారణమన్నారు. పేదలకు ఒక రకంగా , సిఫార్సు ఉన్న వారికి మరో రకంగా వైద్య సేవలందుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు వచ్చి బాధితురాలితో మాట్లాడి పోయారు. -
మానవత్వం మరచిన వైద్యులు
అనారోగ్యతో ఆస్పత్రికి వస్తే చికిత్స చేసేందుకు నిరాకరణ నెల్లూరు(క్రైమ్) : ఊపిరి ఆడటం లేదంటూ ఓ మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తక్షణమే వైద్యసేవలందించాల్సిన అక్కడి వైద్యసిబ్బంది నిరాకరించారు. ప్రాణాలు పోతున్నాయని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం జరిగింది. నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడుకు చెందిన ఓ వివాహిత కొంతకాలం కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెకు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు నయంకాని జబ్బని పరీక్షల్లో తేలింది. జబ్బును నయం చేసేందుకు మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. మందులను వాడుతున్నా.. జబ్బునయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తే వారు సరిగా వైద్యసేవలు అందించలేదు. దీంతో ఆమెను జొన్నవాడలోని కామక్షితాయి దేవాలయం వద్ద వదిలి పెట్టారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తన పరిస్థితిని అక్కడున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చెప్పలేక చెప్పి చికిత్స అందించాలని అభ్యర్థించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యం అందించేందుకు వారు నిరాకరించారు. తన దయనీయస్థితిని అటుగా వెళ్లేవారికి చెప్పి వైద్యం అందించేందుకు సహకరించాలని కన్నీటి అభ్యర్థించింది. కొందరు సహచర రోగులు ఆమె పరిస్థితిని అక్కడున్న వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించిన పాపన పోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ఆవరణలోనే వైద్యంకోసం పడిగాపులు కాయసాగింది. తాజా ఘటన మరోసారి ప్రభుత్వ వైద్యసిబ్బందిలో మానవత్వం మచ్చుకైనా లేదన్న విషయాన్ని మరోసారి రుజువుచేస్తోందని పలువురు రోగుల బందువులు వాపోతున్నారు. -
పుట్టిన బిడ్డకూ ఆధార్
పెద్దాస్పత్రిలో ఏర్పాట్లు జనన ధృవీకరణ పత్రం కూడా ప్రజలకు ఎంతో మేలు నెల్లూరు(అర్బన్): ఇక మీదట స్థానిక దర్గామిట్టలోని జనరల్(పెద్దాసుపత్రి) ఆసుపత్రిలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్‌ను ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం మొదట దశలో విశాఖపట్టణంతో పాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని జనరల్ ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో భాగంగా నగరంలోని పెద్దాసుపత్రిలో ఆధార్‌కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంప్యూటర్, ప్రింటర్లను కొనుగోలు చేయబోతున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జూన్ నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి జనన, మరణాలకు సంబంధించి ధృవపత్రాలను ఇస్తున్నారు. జననాలకు సంబంధించి తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌ను నోట్ చేయాలని 10 రోజుల క్రితమే ఆదేశాలొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పుట్టిన బిడ్డకు ఆధార్ నంబర్‌ను ఇవ్వాలని ఆదేశాలొచ్చాయి. బిడ్డకు పేరుపెట్టకుండానే ఫిమేల్/ మేల్ బేబీ అని నమోదు చేసి మొదట ఆధార్‌ను ఇస్తారు. ఐదారు నెలల తరువాత తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరుపెట్టుకుని వస్తే మళ్లీ ఆధార్‌లో పేరును నమోదు చే స్తారు. దీంతో గ్రామీణ పేదలు ఎక్కడికి తిరగకుండానే కాన్పు జరిగిన చోటే ఆధార్‌ను సులభంగా పొందే అవకాశముంటుంది. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. కాస్త ఆలస్యం: ఆధార్ నమోదు ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నెల్లూరు పెద్దాసుపత్రిలో కాస్త ఆలస్యం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు, రూమ్ ఏర్పాటుకు కొద్ది రోజులు పట్టవచ్చు. ఈ విషయమై డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా స్పందించారు. ప్రింటర్, కంప్యూటర్లు కొనుగోలుకు సంబంధించి కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడాల్సి ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడాక వాటిని కొనుగోలు చేసి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా సరిచూసుకుని ఆధార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ ఆధార్ ప్రక్రియతో పెద్దాసుపత్రిలో కాన్పులు కూడా పెరుగుతాయని భావిస్తున్నామని తెలిపారు. -
దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు
నెల్లూరు(అర్బన్): దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు సూచించారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లను అందజేసే సదరమ్ క్యాంపును పెద్దాస్పత్రిలో మంగళవారం తనిఖీ చేశారు. రెండు వారాల నుంచి వారి సర్టిఫికెట్లపై డాక్టర్లు సంతకాలు చేయకపోవడాన్ని గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు మారడం లేదని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారంలోపు వారి సర్టిఫికెట్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. అనంతరం డాక్టర్ల హాజరుపట్టీలను పరిశీలించారు. అభివృద్ధి కమిటీలో కలెక్టర్ ఆదేశించిన మేరకు విధులకు రాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఒట్టూరు సంపత్‌రాజు, నాయకుడు గిరి, తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది నిర్లక్ష్యం... రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు
-ప్రాణాపాయస్థితిలో రోడ్డుపై బాధితుడి ఆర్తనాదాలు -పోలీసుల చొరవతో తిరిగి ఆస్పత్రికి నెల్లూరు : నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో మానవత్వం మంటకలిసింది. ఆస్పత్రిలో ఉన్న రోగికి సపర్యలు చేయాల్సి వస్తుందని భావించిన కొందరు సిబ్బంది రోగిని రోడ్డుపై పడేశారు. నడవలేని స్థితిలో రెండు రోజులుగా డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్న రోగి కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ప్రాణాపాయస్థితిలో సదరు రోగి ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల చొరవతో ఆ రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ హృదయ విదారక సంఘటనకు జిల్లా ప్రభుత్వ బోధనాస్పత్రి వేదికైంది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు కాళ్లు చచ్చుబడిపోయి తీవ్ర అనారోగ్యంతో నెల్లూరు చెరువు వద్ద పడి ఉండడాన్ని 108 సిబ్బంది గుర్తించారు. ఈ నెల 25వ తేదీన అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేర్పించారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని రెండురోజులుగా ఆ రోగి ఆస్పత్రి బయట (మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లే గేటు సమీపంలో) డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్నాడు. కాలువ పక్కనే పడి ఉండటంతో అతని కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కు తిన్నాయి. దీంతో వేళ్లలోని కండరాలు బయటకు వచ్చాయి. శనివారం వేసవి వేడికి అతడు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్ఐ జగత్సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అతనికి నా అనే వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. దీంతో అతనికి అన్ని సేవలు వైద్యసిబ్బందే చేయాల్సి ఉంది. మూత్ర, మల విసర్జన సైతం బెడ్‌పైనే. దీంతో ఇవ్వన్నీ చేయలేకనే మానవత్వం మరచిన వైద్య సిబ్బంది స్థానిక సెక్యూరిటీ గార్డుల సాయంతో రాత్రికి రాత్రే రోగిని ఆస్పత్రి బయట వదిలివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండురోజులుగా సదరు రోగి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నా ఎవరికీ కనికరం కలగలేదు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అటువైపుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకొన్న దాఖలాలు లేవు. చివరకు స్థానికులు స్పందించి పోలీసుల చొరవతో రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై వైద్యసిబ్బంది మాత్రం మరోలా చెబుతున్నారు. సదరు రోగికి మతిస్థిమితం లేదనీ... దీంతో అతడు తరచూ ఆస్పత్రిలోనుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయేవాడని ... తాము పలుమార్లు అతడిని పట్టుకొచ్చినా ఫలితం లేకుండాపోయిందని చెబుతున్నారు. రెండు కాళ్లు చచ్చుబడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి నడుచుకుంటూ ఎలా వెళుతాడని ప్రశ్నించగా దానిపై మాత్రం ఆసుపత్రి సిబ్బంది సమాధానం దాటేశారు. అక్కడున్న కొందరు రోగులు మాత్రం రెండురోజులు కిందటే ఆస్పత్రి సిబ్బందే అతడ్ని బయట పడేశారని చెబుతున్నారు. ప్రభుత్వ బోధానాస్పత్రిలో ఇలాంటి ఘటనలు షరా మామూలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో మృతి చెందిన ఘటనలు లేకపోలేదు. కొందరు చివరి పరిస్థితుల్లో బతుకు జీవుడా అంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలివెళుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశీలిస్తే నిత్యం ఎంతో మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి బయటే పడుకొని ఉండటం దర్శనమిస్తుంది. వారికి కనీస వైద్యసేవలు అందించాలన్న చిత్తశుద్ధి అటు వైద్యుల్లో... ఇటు సిబ్బందిలో కొరవడింది.