డాక్టర్లే బిడ్డను చంపేశారు..
-
నేపాలి దంపతుల ఆవేదన
-
నష్ట పరిహారం చెల్లించాలంటూ దళిత విద్యార్థి సేన ధర్నా
నెల్లూరు (అర్బన్) :
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ కళ్లు తెరవకుండానే కడుపులోనే మృతి చెందాడని నేపాల్ దేశానికి చెందిన దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. బందువులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా దళిత విద్యార్ధి సేన నాయకులు ధర్నా చేశారు. ఈ సంఘటన నెల్లూరు పెద్దాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల సమాచారం మేరకు కోవూరు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారం కాలనీలో రాంబహదూర్, ధనలక్ష్మి నివాసం ఉంటున్నారు. ధనలక్ష్మి నిండు గర్భిణి. పెద్దాసుపత్రిపై నమ్మకంతో వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. నాలుగు రోజుల కిందట కాన్పు కోసం ఆసుపత్రిలో అడ్మిషన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి కడుపులో నొప్పి వస్తుందని డాక్టర్లకు ధనలక్ష్మి చెప్పినా పట్టించుకోలేదు. చివరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయని ధనలక్ష్మి డ్యూటీ డాక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆమె ఏమి కాదులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో తెలిసిన వారి సాయంతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ నిర్మలకు ఫిర్యాదు చేశారు. ఆమె డాక్టర్ ఫోన్ చేసి పరీక్షించాలని సూచించారు. అయినా ఆ డాక్టర్ స్పందించక పోగా నీకు.. తెలుసా.. మాకు తెలుసా అంటూ ధనలక్ష్మిపై మండిపడింది. కడుపు నొప్పిని భరిస్తున్నా..మంగళవారం సాయంత్రం వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వేరే డాక్టర్ డ్యూటీకి రావడం, కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డాక్టర్ వెంటనే పరీక్ష చేసి చూడగా కడుపులో బిడ్డ మరణించినట్టు తెలిసింది. హడావుడిగా ఆపరేషన్ చేసి మరణించిన ఆడ బిడ్డను బంధువుల చేతిలో పెట్టారు. దీంతో బంధుమిత్రులు ఆవేదనకు గురయ్యారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చినందుకు తమ బడ్డను డాక్టర్లు చంపేశారంటూ కన్నీరు, మున్నీరుగా విలపించారు.
దళిత విద్యార్థిసేన ఆధ్వర్యంలో ధర్నా
విషయం తెలుసుకున్న దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద రాత్రి పూటనే ధర్నాకు దిగారు. బిడ్డ మరణానికి డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యమే కారణమన్నారు. పేదలకు ఒక రకంగా , సిఫార్సు ఉన్న వారికి మరో రకంగా వైద్య సేవలందుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు వచ్చి బాధితురాలితో మాట్లాడి పోయారు.