infant killed
-
నిర్లక్ష్యంతో శిశువు మృతి
ఆత్మకూరు నూరు పడకల ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన ఆత్మకూరురూరల్ : ఆత్మకూరులోని ప్రభుత్వ నూరు పడకల ఆస్పత్రిలో ఐదురోజుల వయస్సు కలిగిన మగ శిశువు మృతిచెందిన సంఘటన మంగళవారం మ«ధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. దుత్తలూరుకు చెందిన రజిత కాన్పు కోసం ఈనెల 10వ తేదీ గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది. శుక్రవారం వరకు నొప్పులు రాకపోవడంతో వైద్యులు అదే సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండడంతో ఇంక్యుబేటర్‌లో ఉంచాలని, ఆ సౌకర్యం ఆస్పత్రిలో లేదని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పడంతో అక్కడికి బంధువులు తీసుకెళ్లారు. సోమవారం మ«ధ్యాహ్నం 2 గంటల సమయంలో డాక్టర్ల సూచన మేరకు శిశువును ప్రభుత్వాస్పత్రిలోని తల్లి వద్దకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో శిశువుకు కొద్దిపాటి అనారోగ్యం కలగడంతో ఆస్పత్రిలోని సిబ్బందికి చెప్పారు. వారు పట్టించుకోకపోవడంతో 7 గంటల సమయంలో శిశువును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంట సేపు పరీక్షలు నిర్వహించి శిశువు ఉమ్మనీరు తాగిందని, అవి తీసి వేసి ఇక బాగుంది.. తల్లిపాలు తాగించాలని డాక్టర్లు చెప్పడంతో తిరిగి ప్రభుత్వాస్పత్రికి తల్లి వద్దకు చేర్చారు. మధ్యాహ్నం శిశువుకు బాగోలేదని ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమన్వయ లోపం ఈ ఘటన విషయంలో డాక్టర్లు, సిబ్బంది చెబుతున్న విషయాలు వారి మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టాయి. ప్రైవేటు ఆస్పత్రి నుంచి శిశువును ఎప్పుడు తీసుకువచ్చారని సిబ్బంది బంధువులను ప్రశ్నిస్తున్నారు. అయితే బంధువులు మాత్రం మంగళవారం ఉదయం చిన్న పిల్లల డాక్టర్ సునీలా వార్డులో విజిట్ చేసినప్పుడు శిశువును చూసి తల్లిపాలు తాగించాలని తెలిపారని చెబుతున్నారు. శిశువు చనిపోయిన విషయం తెలిసినా సిబ్బంది విషయం తెలుసుకునేందుకు రాలేదంటున్నారు.ఽ -
డాక్టర్లే బిడ్డను చంపేశారు..
నేపాలి దంపతుల ఆవేదన నష్ట పరిహారం చెల్లించాలంటూ దళిత విద్యార్థి సేన ధర్నా నెల్లూరు (అర్బన్) : డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ కళ్లు తెరవకుండానే కడుపులోనే మృతి చెందాడని నేపాల్ దేశానికి చెందిన దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. బందువులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా దళిత విద్యార్ధి సేన నాయకులు ధర్నా చేశారు. ఈ సంఘటన నెల్లూరు పెద్దాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల సమాచారం మేరకు కోవూరు చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారం కాలనీలో రాంబహదూర్, ధనలక్ష్మి నివాసం ఉంటున్నారు. ధనలక్ష్మి నిండు గర్భిణి. పెద్దాసుపత్రిపై నమ్మకంతో వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. నాలుగు రోజుల కిందట కాన్పు కోసం ఆసుపత్రిలో అడ్మిషన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి కడుపులో నొప్పి వస్తుందని డాక్టర్లకు ధనలక్ష్మి చెప్పినా పట్టించుకోలేదు. చివరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయని ధనలక్ష్మి డ్యూటీ డాక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆమె ఏమి కాదులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో తెలిసిన వారి సాయంతో ఇన్చార్జి సూపరింటెండెంట్ నిర్మలకు ఫిర్యాదు చేశారు. ఆమె డాక్టర్ ఫోన్ చేసి పరీక్షించాలని సూచించారు. అయినా ఆ డాక్టర్ స్పందించక పోగా నీకు.. తెలుసా.. మాకు తెలుసా అంటూ ధనలక్ష్మిపై మండిపడింది. కడుపు నొప్పిని భరిస్తున్నా..మంగళవారం సాయంత్రం వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వేరే డాక్టర్ డ్యూటీకి రావడం, కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డాక్టర్ వెంటనే పరీక్ష చేసి చూడగా కడుపులో బిడ్డ మరణించినట్టు తెలిసింది. హడావుడిగా ఆపరేషన్ చేసి మరణించిన ఆడ బిడ్డను బంధువుల చేతిలో పెట్టారు. దీంతో బంధుమిత్రులు ఆవేదనకు గురయ్యారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చినందుకు తమ బడ్డను డాక్టర్లు చంపేశారంటూ కన్నీరు, మున్నీరుగా విలపించారు. దళిత విద్యార్థిసేన ఆధ్వర్యంలో ధర్నా విషయం తెలుసుకున్న దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద రాత్రి పూటనే ధర్నాకు దిగారు. బిడ్డ మరణానికి డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యమే కారణమన్నారు. పేదలకు ఒక రకంగా , సిఫార్సు ఉన్న వారికి మరో రకంగా వైద్య సేవలందుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు వచ్చి బాధితురాలితో మాట్లాడి పోయారు. -
ఆర్టీసీ బస్సులో ప్రసవం
కావలిఅర్బన్: ఆత్మకూరు నుంచి కావలికి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో సోమవారం గిరిజన మహిళ ప్రసవించింది. మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు.. జలదంకి మండలం 9వ మైలు గ్రామానికి చెందిన జయంతపు పెంచలయ్య, అంకమ్మ దంపతులు చిత్తు కాగితాలు ఏరుకునేందుకు ఆత్మకూరుకు వెళ్లారు. ఆమె పుట్టిళ్లయిన నడింపల్లికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. 4 నెలల గర్భిణి అయిన అంకమ్మకు మార్గమధ్యలో నొప్పులు వచ్చాయి. నొప్పులు ఎక్కువ కావడంలో బ్రిడ్జి సెంటర్ వద్ద బస్సు దిగుతూ మెట్లపై మృత శిశువును జన్మించింది. ఈ విషయం కనీసం పక్కనే ఉన్న తన భర్తకు కూడా తెలియలేదు. శిశువు బస్సు మెట్లలోపలికి వెళ్లడంతో ఎవరికీ కనబడలేదు. బస్సు దిగిన ఆమె స్పృహకోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలింది. భర్త ఆమెను పక్కనే ఉన్న ఏరియా వైద్యశాలలో చేర్పించాడు. అయితే ఆమె జన్మనిచ్చిన మృత శిశువును మాత్రం ప్రయాణికులు గుర్తించలేదు. అనంతరం బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల కంటపడింది. ఇదేమిటని పరిశీలించగా అది మృత శిశువుగా గుర్తించారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకుని పరిశీలించగా అది అంకమ్మకు జన్మించిందిగా గుర్తించారు. ఆంకమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం
ముక్కుపచ్చలారని చిన్నారి మృత్యువాత పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన దుబ్బాక, న్యూస్‌లై న్: ఖాకీ కావరానికి ముక్కుపచ్చలారని ఓ చిన్నారి మృత్యువాత పడింది. సివిల్ పంచాయితీ విషయంలో తలదూర్చిన ఓ ఏఎస్ఐ మద్యం మత్తులో వీరంగం సృష్టించి ఐదు నెలల చిన్నారి మృతికి కారణమయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. హబ్షీపూర్‌కు చెందిన దుంపటి ఎల్లయ్య, రేణవ్వ దంపతులకు ముగ్గురూ ఆడపిల్లలు. ఐదు నెలల క్రితం మూడో అమ్మాయి నిఖిల జన్మించింది. కాగా, స్థలం విషయమై ఎల్లయ్య ఇంటి పక్కనే ఉంటున్న పెదనాన్న కుమారుడు దుంపటి బీరయ్యతో వారం రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో బీరయ్య ఐదు రోజుల కిందట దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎల్లయ్యను కొట్టాలని, ఇందుకు రూ.20 వేలు ప్రతిఫలంగా ఇస్తానని ఏఎస్ఐ పాషాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం ఏఎస్ఐ పాషా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో ఓ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని ఎల్లయ్య ఇంటికి వెళ్లి అతడిని చితకబాదాడు. ఈ క్రమంలో నేలపై నిద్రిస్తున్న ఐదు నెలల చిన్నారి నిఖిలను ఏఎస్ఐ తొక్కుతూ ఎల్లయ్యను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే రోజు రాత్రి రేణవ్వ కాలనీ వాసులతో కలసి దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడున్న ఎస్ఐ హరిప్రసాద్‌కు విషయాన్ని వివరించి ఎల్లయ్యను ఇంటికి తీసుకువచ్చింది. మరుసటి రోజు చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట చిన్నారి మృతదేహంతో సుమారు ఎనిమిది గంటల పాటు ఆందోళనకు దిగారు. చివరకు డీఎస్పీ శ్రీధర్ స్టేషన్ కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విచారణ జరిపి ఏఎస్ఐపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.