నిర్లక్ష్యంతో శిశువు మృతి
-
ఆత్మకూరు నూరు పడకల ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరులోని ప్రభుత్వ నూరు పడకల ఆస్పత్రిలో ఐదురోజుల వయస్సు కలిగిన మగ శిశువు మృతిచెందిన సంఘటన మంగళవారం మ«ధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. దుత్తలూరుకు చెందిన రజిత కాన్పు కోసం ఈనెల 10వ తేదీ గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది. శుక్రవారం వరకు నొప్పులు రాకపోవడంతో వైద్యులు అదే సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండడంతో ఇంక్యుబేటర్‌లో ఉంచాలని, ఆ సౌకర్యం ఆస్పత్రిలో లేదని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పడంతో అక్కడికి బంధువులు తీసుకెళ్లారు. సోమవారం మ«ధ్యాహ్నం 2 గంటల సమయంలో డాక్టర్ల సూచన మేరకు శిశువును ప్రభుత్వాస్పత్రిలోని తల్లి వద్దకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో శిశువుకు కొద్దిపాటి అనారోగ్యం కలగడంతో ఆస్పత్రిలోని సిబ్బందికి చెప్పారు. వారు పట్టించుకోకపోవడంతో 7 గంటల సమయంలో శిశువును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంట సేపు పరీక్షలు నిర్వహించి శిశువు ఉమ్మనీరు తాగిందని, అవి తీసి వేసి ఇక బాగుంది.. తల్లిపాలు తాగించాలని డాక్టర్లు చెప్పడంతో తిరిగి ప్రభుత్వాస్పత్రికి తల్లి వద్దకు చేర్చారు. మధ్యాహ్నం శిశువుకు బాగోలేదని ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
సమన్వయ లోపం
ఈ ఘటన విషయంలో డాక్టర్లు, సిబ్బంది చెబుతున్న విషయాలు వారి మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టాయి. ప్రైవేటు ఆస్పత్రి నుంచి శిశువును ఎప్పుడు తీసుకువచ్చారని సిబ్బంది బంధువులను ప్రశ్నిస్తున్నారు. అయితే బంధువులు మాత్రం మంగళవారం ఉదయం చిన్న పిల్లల డాక్టర్ సునీలా వార్డులో విజిట్ చేసినప్పుడు శిశువును చూసి తల్లిపాలు తాగించాలని తెలిపారని చెబుతున్నారు. శిశువు చనిపోయిన విషయం తెలిసినా సిబ్బంది విషయం తెలుసుకునేందుకు రాలేదంటున్నారు.ఽ