మద్యం మత్తులో ఏఎస్‌ఐ వీరంగం
ముక్కుపచ్చలారని చిన్నారి మృత్యువాత
పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
దుబ్బాక, న్యూస్‌లై న్: ఖాకీ కావరానికి ముక్కుపచ్చలారని ఓ చిన్నారి మృత్యువాత పడింది. సివిల్ పంచాయితీ విషయంలో తలదూర్చిన ఓ ఏఎస్‌ఐ మద్యం మత్తులో వీరంగం సృష్టించి ఐదు నెలల చిన్నారి మృతికి కారణమయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
హబ్షీపూర్‌కు చెందిన దుంపటి ఎల్లయ్య, రేణవ్వ దంపతులకు ముగ్గురూ ఆడపిల్లలు. ఐదు నెలల క్రితం మూడో అమ్మాయి నిఖిల జన్మించింది. కాగా, స్థలం విషయమై ఎల్లయ్య ఇంటి పక్కనే ఉంటున్న పెదనాన్న కుమారుడు దుంపటి బీరయ్యతో వారం రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో బీరయ్య ఐదు రోజుల కిందట దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎల్లయ్యను కొట్టాలని, ఇందుకు రూ.20 వేలు ప్రతిఫలంగా ఇస్తానని ఏఎస్‌ఐ పాషాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం ఏఎస్‌ఐ పాషా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో ఓ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని ఎల్లయ్య ఇంటికి వెళ్లి అతడిని చితకబాదాడు. ఈ క్రమంలో నేలపై నిద్రిస్తున్న ఐదు నెలల చిన్నారి నిఖిలను ఏఎస్‌ఐ తొక్కుతూ ఎల్లయ్యను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే రోజు రాత్రి రేణవ్వ కాలనీ వాసులతో కలసి దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌కు విషయాన్ని వివరించి ఎల్లయ్యను ఇంటికి తీసుకువచ్చింది. మరుసటి రోజు చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట చిన్నారి మృతదేహంతో సుమారు ఎనిమిది గంటల పాటు ఆందోళనకు దిగారు. చివరకు డీఎస్పీ శ్రీధర్ స్టేషన్ కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విచారణ జరిపి ఏఎస్‌ఐపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.