ప్రవళిక (ఫైల్)
తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, అమ్మా నాన్న మిస్ యూ అంటూ’ ప్రవళిక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
సాక్షి, నిజామాబాద్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల వరకు వారి దాంపత్యం సాఫీగానే సాగింది. కొద్ది రోజులుగా అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం దుబ్బాకలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల శోభ– వెంకట్ రెడ్డిల కూతురు ప్రవళికను(28) బోర్గాం(పి) గ్రామానికి చెందిన చామకూర మహేశ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరిద్దరూ చదువుతున్న సమయంలో ప్రేమించుకోవడంతో ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
పెళ్లి సమయంలో కట్నకానుకలతో పాటు బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. మహేశ్ నిర్మల్‌లో మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త వారి దగ్గర బంధువులు ప్రవళికను వేధించారు. సుమారు ఆరు నెలల క్రితం కూతురి బాధను చూడలేని తల్లిదండ్రులు రూ. నాలుగు లక్షల వరకు డబ్బులు ఇచ్చినట్లు ప్రవళిక బంధువులు తెలిపారు. అయితే మళ్లీ అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, వారి బంధువులు వేధించడంతో భరించలేక పుట్టింటికి వచ్చిన ప్రవళిక శుక్ర వారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?
ఆమె తల్లి ఫిర్యాదు మేరకు భర్త చామకూర మహేశ్, అత్త చామకూర రాజవ్వ, సమీప బంధువులైన మేనమామలు, మేనత్తపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీశైలంతో పాటు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. భర్త, అత్తతో పాటు వారి సమీప బంధువులపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు, బాధితుల ఫిర్యాదు, సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్టు చేసి శిక్షపడేలా చేస్తామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
చదవండి: సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం
Comments
Please login to add a commentAdd a comment