బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది.
ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట నెలలు నిండకముందే కొడుకు పుట్టాడు. అయితే బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించగా.. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. అప్పటి నుంచి మహేశ్ డబ్బులు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు.
చదవండి: సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!
కరీంనగర్లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment