గాజువాక(విశాఖపట్టణం): తనకు ఏం కష్టమొచ్చిందో.. కుటుంబంలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుందో.. లేదా ఏ కలత ఆమెను పురి గొల్పిందో... వందేళ్లు వర్థిల్లాల్సిన తన 11 నెలల కుమారుడికి ఉరి వేసి తానూ తనువు చాలించిందొక తల్లి. కొత్త నక్కవానిపాలెం చెక్‌పోస్టు ప్రాంతంలో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనమైంది. ప్రత్యక్ష సాక్షులు, గాజువాక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన మణి (26)కి స్థానిక నక్కవానిపాలెం చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఉరుకూటి శ్రీనివాస్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి వినయ్(11 నెలలు) బాబు ఉన్నాడు. ఈనెల 29న మొదటి పుట్టినరోజు జరిపేందుకు ఏర్పాటు కూడా చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ టాటా మ్యాక్సి తీసుకొని శనివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయాడు.
ఆ తరువాత కొంతసేపటికి మేడపై ఉన్న గదిలోకి తన కొడుకుతో కలిసి మణి వెళ్లింది. రోజు మాదిరిగానే తన కుమారుడికి సాయంత్రం 4.30 గంటల సమయంలో స్నానం చేయించి కిందకు రావాల్సిన మణి రాకపోవడంతో ఆమె మామ బంగార్రాజు మేడపైకి వెళ్లి తలుపు తట్టారు. అయినప్పటికీ తెరవకపోవడంతో కిటికీలోంచి చూసి ఉరి వేసుకున్నట్టు గమనించి కేకలు వేశారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని తలుపులు పెకలించి మృత దేహాలను కిందకు దించారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించారు. తన భర్త బయటకు వెళ్లగానే తొలుత తన కుమారుడికి ఉరి వేసి, ఆ తరువాత తాను కూడా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి సంఘటనకు కారణాలేవీ తెలియడంలేదని పోలీసులు పేర్కొన్నారు.
పసికందుకు ఉరి వేసిన తల్లి..
Published Sat, May 7 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement
Advertisement