అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లు
కాకినాడ: కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కె.సత్తిబాబు విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై అవిశ్వాసానికి మద్దతుగా 36 మంది ఓట్లు వేశారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా.. మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. చివరకు మేయర్ కూడా తన ఓటు వేసుకోలేదు. సొంత టీడీపీలో అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి మరీ మేయర్, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. టీడీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లపై మొత్తం 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
వీరిలో టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, ఓటు హక్కు కలిగిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. మొత్తం 46 మంది హాజరయ్యారు. బీజేపీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న సమావేశానికి హాజరుకాలేదు.
చేతులెత్తే పద్ధతిన ఓటింగ్
ఉదయం 11 గంటలకు మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండే ఓటర్లు చేతులెత్తి సమ్మతి తెలియజేయాలని జేసీ సూచించారు. టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే.. మొత్తం 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. తీర్మానాన్ని వ్యతిరేకించే సభ్యులు చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొనాలని జేసీ సూచించగా ఎవరూ చేతులు ఎత్తలేదు. మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా స్తబ్ధుగా ఉండిపోయారు. దీంతో మేయర్‌కు ఒక్క కార్పొరేటర్ మద్దతు కూడా లేదని నిర్ధారణ అయ్యింది.
అనంతరం 12 గంటలకు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు వేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్ ఫలితాన్ని కలెక్టర్ రవికిరణ్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని జేసీ చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన అనంతరం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు.
చంద్రబాబును ధిక్కరించిన తెలుగుదేశం కార్పొరేటర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు మాటను, పార్టీ విప్‌ను కూడా టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించారు. అసమ్మతి కార్పొరేటర్లతోపాటు పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు కూడా విప్‌ను పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు షాక్ అయ్యా రు. విప్ జారీ చేసినా మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం చర్చకు దారితీసింది. టీడీపీలో అసమ్మతితో ఉన్నవారు>క మిగిలిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే కొండబాబు వర్గంగా చలామణి అవుతున్నారు. ఆయన కూడా తన వర్గం కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించేలా చూసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment