Kakinada mayor
-
కాకినాడ మేయర్ పావని తొలగింపు
సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టింగ్ మేయర్‌గా చోడిపల్లి డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘యాక్టింగ్ మేయర్’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్‌కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. -
విశ్వాసం కోల్పోయిన కాకినాడ మేయర్
కాకినాడ: కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కె.సత్తిబాబు విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై అవిశ్వాసానికి మద్దతుగా 36 మంది ఓట్లు వేశారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా.. మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. చివరకు మేయర్ కూడా తన ఓటు వేసుకోలేదు. సొంత టీడీపీలో అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి మరీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. టీడీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లపై మొత్తం 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. వీరిలో టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, ఓటు హక్కు కలిగిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. మొత్తం 46 మంది హాజరయ్యారు. బీజేపీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న సమావేశానికి హాజరుకాలేదు. చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ ఉదయం 11 గంటలకు మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండే ఓటర్లు చేతులెత్తి సమ్మతి తెలియజేయాలని జేసీ సూచించారు. టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే.. మొత్తం 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. తీర్మానాన్ని వ్యతిరేకించే సభ్యులు చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొనాలని జేసీ సూచించగా ఎవరూ చేతులు ఎత్తలేదు. మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా స్తబ్ధుగా ఉండిపోయారు. దీంతో మేయర్‌కు ఒక్క కార్పొరేటర్ మద్దతు కూడా లేదని నిర్ధారణ అయ్యింది. అనంతరం 12 గంటలకు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు వేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్ ఫలితాన్ని కలెక్టర్ రవికిరణ్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని జేసీ చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన అనంతరం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు. చంద్రబాబును ధిక్కరించిన తెలుగుదేశం కార్పొరేటర్లు టీడీపీ అధినేత చంద్రబాబు మాటను, పార్టీ విప్‌ను కూడా టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించారు. అసమ్మతి కార్పొరేటర్లతోపాటు పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు కూడా విప్‌ను పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు షాక్ అయ్యా రు. విప్ జారీ చేసినా మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం చర్చకు దారితీసింది. టీడీపీలో అసమ్మతితో ఉన్నవారు>క మిగిలిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే కొండబాబు వర్గంగా చలామణి అవుతున్నారు. ఆయన కూడా తన వర్గం కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించేలా చూసినట్లు తెలిసింది. -
అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని
సాక్షి, కాకినాడ: కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ పావని, ఉపమేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్అఫిషియో సభ్యులు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: (సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరిగేది ఇలా.. 44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ విప్‌పై గందరగోళం టీడీపీ విప్‌పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్ విషయంలోనే విప్ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్ విషయంలో విప్ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్‌తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు. కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్ పావని కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్‌కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. -
కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్ హరికిరణ్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి కాకినాడ చేరుకుని ఓటింగ్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే మేయర్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది మంది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు చెబుతున్నారు. మేయర్ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్ ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్‌పై పడింది. -
తుది తీర్పునకు లోబడి ‘కాకినాడ మేయర్’ ఫలితం
సాక్షి, అమరావతి: కాకినాడ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 5న జరగనున్న సమావేశ ఫలితం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పావనిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, కాకినాడ మునిసిపల్ కమిషనర్, కార్పొరేటర్లు సీహెచ్ వెంకట సత్యప్రసాద్, వాసిరెడ్డి రామచంద్రరావులను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెల 18న జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ పావని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. పావని తరఫు న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపిస్తూ.. ఆమెపై అవిశ్వాసం చట్టవిరుద్ధమన్నారు. చట్టప్రకారం నాలుగేళ్లు పూర్తయ్యాకే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, తన పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన నోటీసు ఆమెకు అందలేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఇంటికి వెళితే తీసుకునేందుకు పావని కుటుంబసభ్యులు తిరస్కరించారని తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారం.. ఆమె ఇంటికి నోటీసులు అతికించామని చెప్పారు. పావని కార్పొరేటర్‌గా ఎన్నికై నాలుగేళ్లు పూర్తయిందన్నారు. నిబంధనల ప్రకారమే కలెక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. -
కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేయర్ పావనికి కలెక్టర్ హరికిరణ్ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్ పావని బయటకు రాకపోవడంతో మేయర్ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు -
కాకినాడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పావని, డిప్యూటీ మేయర్-1 సత్తిబాబుపై కౌన్సిలల్ మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించి కలెక్టర్ హరికిరణ్‌కు 33 మంది కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇటీవలే మేయర్ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకోగా.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తీరుతో టీడీపీ పట్ల ఆపార్టీ కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేశారు. -
మేయరమ్మా... ఇదేంటమ్మా!
కాకినాడ: కౌన్సిల్ నిర్ణయాలను ‘తీర్మానం’ చేసే విషయంలో కాకినాడ మేయర్ సుంకర పావని వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోందంటూ కార్పొరేటర్లు ఎండగట్టారు. కౌన్సిల్ నిర్ణయాలను తీర్మానం చేయడంలో ఆమె చూపిస్తోన్న అలసత్వం సమస్యలకు తావిస్తోందంటూ ఆమెపై కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిదంటే.. కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం గత నెల 27న జరిగింది. బడ్జెట్‌తో పాటు 25కు పైగా అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది కొనసాగింపుతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం కౌన్సిల్ సమావేశం పూర్తయిన వెంటనే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘తీర్మానం’ రూపంలో నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు తీర్మానాల వివరాలను నోటీసు బోర్డులో ఉంచి అమలు దిశగా సంబంధిత సెక్షన్లకు పంపాలి. అయితే కౌన్సిల్ సమావేశం జరిగి 10 రోజులు దాటినా ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. సమస్యలు గాలికొదిలి.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం.. కౌన్సిల్ నిర్ణయాలను ‘తీర్మానం’ చేయాల్సిన మేయర్ తన విధులను పక్కన పెట్టి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో కౌన్సిల్ తీర్మానాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. అదే రోజు చేయాల్సిన తీర్మానాలు పదిరోజులు గడుస్తున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోవడంపై కార్పొరేటర్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. మేయర్ తీరు కౌన్సిల్‌ను అవమానించడమేనని మండిపడుతున్నారు. గతంలో కూడా తీర్మానాలు రాయడంలో జాప్యం జరిగి కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలకు, రాసిన తీర్మానాలకు తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయంటున్నారు. ఇలా జాప్యం జరిగితే ఇక కౌన్సిల్ నిర్ణయాలకు పారదర్శకత ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు మేయర్ వ్యవహరశైలి, తీర్మానాల విషయంలో జరిగిన లోపాలపై స్టాండింగ్కమిటీ సభ్యులు జేడీ పవన్‌కుమార్, బాలప్రసాద్, చవ్వాకుల రాంబాబు, సీనియర్ కార్పొరేటర్లు చోడిపల్లి ప్రసాద్, ఎంజీకే కిశోర్, మీసాల ఉదయ్, నాయకులు సుంకర సాగర్ తదితరులు కమిషనర్ స్వప్నిల్ దినకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కమిషనర్‌ను కలిసి మేయర్ తీరుపై లేఖ అందజేశారు. కార్పొరేటర్ల ఫిర్యాదు నేపథ్యంలో కమిషనర్ స్వప్నిల్దినకర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకున్నారు. లోపాలను సరిచేసి సమస్య పరిష్కరిస్తానని కార్పొరేటర్లకు ఆయన హామీ ఇచ్చారు. చదవండి: ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే.. ఏపీకి కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్! -
మేయర్ గారి షి‘కారు’కు..
జిల్లా కేంద్రమైన కాకినాడ నగరానికి ఆమె ప్రథమ పౌరురాలు. ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న ఆమె.. అదే ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు చేస్తూ.. దర్జాగా షి‘కారు’ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సహితం తుంగలో తొక్కి.. అధికారమే అండగా.. కౌన్సిల్లో ప్రత్యేకంగా తీర్మానం ఆమోదింపజేసుకుని మరీ.. తన కారు కోసం ప్రతి నెలా నగరపాలక సంస్థ ఖజానా నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. కాకినాడ మేయర్ సుంకర పావని సాగిస్తున్న ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ: నగరపాలక సంస్థల్లో మేయర్లకు, కార్పొరేటర్లకు; పురపాలక సంఘాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. ఆయా స్థానిక సంస్థల స్థాయి, ప్రాధాన్యాన్ని బట్టి నెలనెలా చెల్లించాల్సిన వేతనాన్ని నిర్ధారిస్తూ 2016 డిసెంబర్ 15న పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవోఎంఎస్ నంబర్ 335 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రికార్డు చేసి, అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేయర్‌కు ప్రయాణ భత్యంతో కలిపి గౌరవ వేతనాన్ని రూ.30 వేలు. వాస్తవానికి 2016లో జీవో సవరణకు ముందు ఈ మొత్తం రూ.14 వేలు మాత్రమే ఉండగా, దీనిని రెట్టింపు పైగా పెంచారు. అలాగే డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలుగా నిర్ధారించారు. దీని ప్రకారం ఆయా స్థానిక ప్రజాప్రతినిధులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాకినాడ మేయర్ సుంకర పావనికి కూడా ఈ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా రూ.30 వేల గౌరవ వేతనాన్ని నగరపాలక సంస్థ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. 2017 ఆగçస్టులో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన నాటి నుంచి ఈ మొత్తాన్ని ఆమెకు ఇస్తూనే ఉన్నారు. ఆమె తన కోసం ప్రత్యేకంగా ఓ కారు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ అధికారాన్ని, హోదాను, మెజారిటీని అడ్డం పెట్టుకుని కారు కోసం కౌన్సిల్లో తీర్మానం కూడా చేయించేశారు. అనంతరం టెండర్ పిలిచి మరీ మేయర్‌కు కారు కేటాయించారు. నిర్వహణ, డ్రైవర్ జీతంతో కలిపి మేయర్ వినియోగిస్తున్న ఆ కారు కోసం నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.45 వేల చొప్పున చెల్లిస్తోంది. ఒకవైపు మేయర్ హోదాలో రూ.30 వేల గౌరవ వేతనం ఇస్తూనే.. దీంతోపాటు కారుకు రూ.45 వేల చొప్పున ఇచ్చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ అదనపు సొమ్మును అలవెన్స్ రూపంలో నగరపాలక సంస్థే భరిస్తోంది. రెండేళ్లకు కలిపి సుమారు రూ.10.80 లక్షల వరకూ మేయర్ కారు కోసం చెల్లించినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ.. ఏదైనా అంశంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా కౌన్సిల్ తీర్మానం చేస్తే.. ఆ తీర్మానాన్ని విధిగా ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదిస్తేనే ఆ తీర్మానం అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మేయర్‌కు కారు ఏర్పాటు చేసే విషయంలో ఈ నిబంధనలను నాటి నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కౌన్సిల్ పరంగా ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసి, మేయర్‌కు కారు ఏర్పాటు చేసి, ప్రతి నెలా రూ.45 వేల చొప్పున కాంట్రాక్టర్‌కు చెల్లించేస్తున్నారు. కౌన్సిల్‌కు ఎన్ని అధికారాలున్నా ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘించి, తీర్మానం చేయడం, అధికారులు సైతం దీనికి సై అనడం విమర్శలకు తావిస్తోంది. ఇలా మేయర్‌కు ప్రత్యేకంగా కారు అలవెన్స్ చెల్లించడం తప్పని తెలిసినా.. అప్పటి అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడీ ఈ వ్యవహారం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ తీర్మానం మేరకే.. మేయర్‌కు కారు ఏర్పాటు చేయాల్సిందిగా అప్పట్లో కౌన్సిల్ తీర్మానం చేసింది.ఆ తీర్మానానికి అనుగుణంగానే టెండర్ ద్వారా కారు తీసుకునిమేయర్కు ఇచ్చాం.– సత్యనారాయణరాజు,డీఈ, కాకినాడనగరపాలక సంస్థ -
కాకినాడ మేయర్‌గా సుంకర పావని
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌గా సుంకర పావని ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. అంతకు ముందు టీడీపీ కార్యాలయంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. తొలుత అడ్డూరి వరలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారైందని ప్రచారం జరిగినా చివరి క్షణంలో సుంకర పావని పేరు తెరపైకి వచ్చింది. దీన్ని చినరాజప్ప అధికారికంగా ప్రకటించిన అనంతరం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌కు చేరుకుని ఆమెను ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా కాలా సత్తిబాబు ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన సుంకర లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్యే వనమాడి ప్రతిపాదించిన అడ్డూరి వరలక్ష్మిలకు నిరాశ ఎదురైంది. మేయర్ పదవిని ఆశించిన మాకినీడి శేషుకుమారి తనకు అవకాశం దక్కకపోవడంతో పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి కన్నీళ్లతో నిష్క్రమించారు.