సాక్షి, అమరావతి: కాకినాడ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 5న జరగనున్న సమావేశ ఫలితం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పావనిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, కాకినాడ మునిసిపల్ కమిషనర్, కార్పొరేటర్లు సీహెచ్ వెంకట సత్యప్రసాద్, వాసిరెడ్డి రామచంద్రరావులను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెల 18న జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ పావని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. పావని తరఫు న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపిస్తూ.. ఆమెపై అవిశ్వాసం చట్టవిరుద్ధమన్నారు. చట్టప్రకారం నాలుగేళ్లు పూర్తయ్యాకే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, తన పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన నోటీసు ఆమెకు అందలేదన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఇంటికి వెళితే తీసుకునేందుకు పావని కుటుంబసభ్యులు తిరస్కరించారని తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారం.. ఆమె ఇంటికి నోటీసులు అతికించామని చెప్పారు. పావని కార్పొరేటర్‌గా ఎన్నికై నాలుగేళ్లు పూర్తయిందన్నారు. నిబంధనల ప్రకారమే కలెక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.
తుది తీర్పునకు లోబడి ‘కాకినాడ మేయర్’ ఫలితం
Published Sun, Oct 3 2021 3:33 AM | Last Updated on Sun, Oct 3 2021 3:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment