సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘‘మూడే ముళ్లు... ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు...’’ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలను ఈయన సరిగ్గా డబుల్ చేశాడు. ఒకే రోజు ఇద్దరికీ.. ఒక్కొక్కరికి మూడు ముళ్లు.. వెరసి ఆరు ముళ్లు వేసి పద్నాలుగు అడుగులు నడిచాడు. ఇక కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. చందంగా పెళ్లి సమయానికే ఇద్దరు వధువులూ ఒకరు మగ బిడ్డతో.. ఒకరు ఆడ బిడ్డతో పెళ్లి పీటలపై కూర్చొని సదరు పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకున్నారు.
ఈ చిత్రమైన పెళ్లి’ళ్లు’భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగాయి. పూర్వాపరాలిలా.. గ్రామానికి చెందిన సత్తిబాబు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడంతో స్వప్నకుమారి గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు సత్తిబాబు ఓకే అన్నాడు. కానీ స్వప్నకి తెలియకుండా సత్తిబాబు కుర్నపల్లికి చెందిన సునీతతోనూ మరో ప్రేమ కథ నడిపాడు. ఈమెనూ గర్భవతిని చేశాడు.
ఇరువురు యువతుల తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలూ రంగంలోకి దిగారు. తాను ఇద్దరినీ ప్రేమించానని, ఇరువురినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పగా, యువతులూ అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో ఒకే చోట కాపురం పెట్టాడు. గతేడాది జూలైలో స్వప్నకుమారి పాపకు జన్మనివ్వగా, సెప్టెంబర్‌లో సునీతకు బాబు పుట్టాడు.
కాగా తన పెళ్లి ఘనంగా జరగలేదని భావించిన సత్తిబాబు..ఈనెల 9న గురువారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి పత్రిక అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ పంచాడు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికార్డు వైరల్‌గా మారింది. సత్తిబాబు పెళ్లి ముచ్చట ఆరు ముళ్లు, పద్నాలుగు అడుగులతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment