సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. 16వ తేదీన జరిగే ఈ కౌంటింగ్ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఆమె నాయకులు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాకినాడ జేఎన్‌టీయూలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ బ్లాక్‌లోను, స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బ్లాకులోను కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్‌కు 81 టేబుల్స్ ఏర్పాటు చేశామని, 88 మంది అభ్యర్థులను, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామన్నారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ హాలులోకి సెల్‌ఫోన్ తీసుకురావడం నిషిద్ధమన్నారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని, 7 గంటలకల్లా అభ్యర్థులు వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు రావాలని తెలిపారు. డీఆర్వో బి.యాదగిరి, తుమ్మల శ్రీనివాస్, బోనం భాస్కరరావు, ఎం.రత్నాకర్, కె.కృష్ణమూర్తి, కోలా ప్రసాద్‌వర్మ, సీహెచ్ సూర్యనారాయణమూర్తి, దంగేటి శ్రీనివాస్, ఇ.సత్యనారాయణరాజు, వి.రాజబాబు పాల్గొన్నారు.