జహీరాబాద్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఒక్క రోజే గడువు మిగిలి ఉంది. అయినప్పటికీ టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రులు జె. గీతారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్ మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. దీంతో ఇరువురి మధ్య టికెట్ల పంచాయితీ తేలని పరిస్థితి నెలకొంది. రాజీ కోసం అధిష్టానం నుంచి ఎలాంటి రాయబారం కూడా రానట్టు సమాచారం. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మూడు రోజులుగా మొక్కుబడిగానే సాగింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లోని అనేక గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ సభ్యుల అభ్యర్థిత్వాలు ఖరారు కానట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ వరకు అభ్యర్థులను ఖరారుచేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లను ఆశిస్తున్న వారంతా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
వారిచే నామినేషన్లు వేయించే పనిని ఆయా మండలాల పార్టీ నాయకులు చూసుకుంటున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తన వర్గానికి గీతారెడ్డి టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపారని ఫరీదుద్దీన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీటీసీ టికెట్ల కేటాయింపు విషయంలోనైనా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఫరీదుద్దీన్ అధిష్టాన వర్గాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు రెండు రోజుల గడువు విధించారు. ఇప్పటికీ అధిష్టానవర్గం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆయన మద్దతుదారులు మాత్రం గీతారెడ్డి అవలంబిస్తున్న తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన ఫరీదుద్దీన్‌ను విస్మరించడం రాజకీయ అజ్ఞానమే అవుతుందని వారు విమర్శిస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీకి పటిష్టమైన పునాదులు వేసేది పోయి పార్టీకి నష్టపర్చే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందింస్తుదోనని ఫరీదుద్దీన్ మద్ధతుదారులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఇరువురి మధ్య అధిష్టానవర్గం రాజీ ఫార్ములాను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తేలని టికెట్ల ‘పంచాయితీ’
Published Wed, Mar 19 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement
Advertisement