md fariduddin
-
తేలని టికెట్ల ‘పంచాయితీ’
జహీరాబాద్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఒక్క రోజే గడువు మిగిలి ఉంది. అయినప్పటికీ టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రులు జె. గీతారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్ మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. దీంతో ఇరువురి మధ్య టికెట్ల పంచాయితీ తేలని పరిస్థితి నెలకొంది. రాజీ కోసం అధిష్టానం నుంచి ఎలాంటి రాయబారం కూడా రానట్టు సమాచారం. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మూడు రోజులుగా మొక్కుబడిగానే సాగింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని అనేక గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ సభ్యుల అభ్యర్థిత్వాలు ఖరారు కానట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ వరకు అభ్యర్థులను ఖరారుచేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లను ఆశిస్తున్న వారంతా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారిచే నామినేషన్లు వేయించే పనిని ఆయా మండలాల పార్టీ నాయకులు చూసుకుంటున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తన వర్గానికి గీతారెడ్డి టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపారని ఫరీదుద్దీన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీటీసీ టికెట్ల కేటాయింపు విషయంలోనైనా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఫరీదుద్దీన్ అధిష్టాన వర్గాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు రెండు రోజుల గడువు విధించారు. ఇప్పటికీ అధిష్టానవర్గం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆయన మద్దతుదారులు మాత్రం గీతారెడ్డి అవలంబిస్తున్న తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన ఫరీదుద్దీన్‌ను విస్మరించడం రాజకీయ అజ్ఞానమే అవుతుందని వారు విమర్శిస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీకి పటిష్టమైన పునాదులు వేసేది పోయి పార్టీకి నష్టపర్చే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందింస్తుదోనని ఫరీదుద్దీన్ మద్ధతుదారులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఇరువురి మధ్య అధిష్టానవర్గం రాజీ ఫార్ములాను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇదేం తీరు
జహీరాబాద్, న్యూస్‌లైన్: మున్సిపల్ కౌన్సిలర్ల టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రి గీతారెడ్డి తన అనుచరులకు, అనుయాయులకే టికెట్లు ఇచ్చారని మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ మండిపడ్డారు. టికెట్ల కేటాయింపులో గీతారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో అధిష్టానం స్పందించాలనీ.. లేదంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి చర్యలు చేపట్టబోనని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత, వాళ్లు ఏం చెప్తే అది చేస్తానన్నారు. తాను పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నానని, అయినా తనను విస్మరించడం సరి కాదన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌శెట్కార్, డీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 24 వార్డులకు గాను 8 వార్డుల్లో తాను సూచించిన అభ్యర్థులను నిర్ణయించుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందుకు సంబంధించిన బీ ఫారాలు పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకోవాల్సిందిగా తనకు సూచించారన్నారు. ఆ బీ ఫారాలను తనకు అప్పగిస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి తీసుకువచ్చిన గీతారెడ్డి తన అనుయాయులకే అందజేశారన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఫరీదుద్దీన్ ప్రశ్నించారు. తనను నమ్ముకుని నామినేషన్లు వేసినా.. పార్టీ ప్రయోజనాల మేర వారిచేత ఉపసంహరింపజేశానన్నారు. గీతారెడ్డి వ్యవహార శైలిపై ఆయన తో పాటు పార్టీ నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు అల్లాడి నర్సింహులు, మురళీకృష్ణాగౌడ్, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు విజయకుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాణిక్యమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.