కేసీఆర్ ఘన విజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యమాల పురిటిగడ్డ మెతుకుసీమలో టీఆర్‌ఎస్ ధూం..ధాం చేసింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీకే జిల్లా ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండులు దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి, విజయశాంతి తదితరులు ఓటమిపాలయ్యారు. జిల్లా ముద్దుబిడ్డ, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం దాదాపు లాంఛనమే. జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లనూ గెలుచుకుని టీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
నారాయణఖేడ్, జహీరాబాద్‌లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్నట్టు కనిపించినా.. సార్వత్రిక ఎన్నికల్లో ‘యువతరం’ అండగా నిలబడి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. శనివారం జరగబోయే టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సభాపక్ష నాయకునిగా కేసీఆర్ పేరు ప్రతిపాదించనున్నారు.
హరీష్‌రావు భారీ మెజార్టీతో గెలుపు
సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్‌రావు భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో సుమారు 1.50 లక్షల ఓట్లు పోల్ కాగా హరీష్‌రావుకు 1.18 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం 93,928 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మిగిలిన పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. నిజానికి గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌కు 95,858 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గతంలో పాలిస్తే పోలింగ్ శాతం ఈ ఎన్నికల్లో తగ్గడంతో ఆయనకు కొద్దిగా ఆధిక్యం తగ్గింది.
ఇక కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి 19,218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గజ్వేల్ నియోజకవర్గంలో 1.99 లక్షల ఓట్లు పోల్ కాగా కేసీఆర్‌కు 86,372 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డి 33,998 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతిని 39, 234 ఓట్ల మెజార్టీతో ఓడించారు. దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై 37,899 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
హోరాహోరీ పోరులో....
అందోల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధిక్యత కనబరిచినప్పటికీ చివరి రౌండ్లలో చేతులెత్తేశారు. 10వ రౌండ్ వరకు రాజనర్సింహ దాదాపు 1,700 ఓట్ల మెజార్టీ ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో కూడా ఆయన మెజార్టీని కనబరిచారు. చివరి ఐదు రౌండ్ల నుంచి బాబూమోహన్ అనూహ్యంగా దూసుకురావడంతో దామోదరకు ఓటమి తప్పలేదు. మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు స్వల్ప ఆధిక్యంతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి గీతారెడ్డి 814 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుపై గెలుపొందారు.
అభ్యర్థుల ఓట్ల వివరాలు
గజ్వేల్‌లో కేసీఆర్: గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయం సాధించారు. 19,218 ఓట్ల మెజార్టీతో సమీప టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై గెలుపొందారు. గజ్వేల్‌లో నియోజకవర్గం ఎమ్మెల్యే బరిలో పది మంది పోటీ చేయగా ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.చంద్రశేఖర్‌రావుకు 86,372 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి 33,998 ఓట్లు సాధించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపొందటం ఇదే ప్రథమం.
సిద్దిపేటలో హరీష్ ఐదోమారు విజయం:
సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 93,928 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాడురు శ్రీనివాస్‌గౌడ్‌పై గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన ఐదో మారు గెలిచారు. ఇక్కడ బరిలో ఉన్న పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎమ్మెల్యే బరిలో 11 మంది ఉండగా హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరు శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి చొప్పదండి విద్యాసాగర్‌కు 13,003 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బత్తుల చంద్రంకు 3,774, లోక్‌సత్తా అభ్యర్థి శ్రీనివాస్‌కు 627, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140 ఓట్లు వచ్చాయి.
సంగారెడ్డిలో చింతాదే గెలుపు: సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ 29,814 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఇక్కడ ఓటమి చవిచూశారు. జగ్గారెడ్డికి 53,046 ఓట్లు రాగా బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కె. సత్యనారాయణకు 11,091 ఓట్లు, సీపీఎం అభ్యర్థి బి.మల్లేశానికి 2,681 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభర్థులు పోటీ చేయగా పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
దుబ్బాకలో రామలింగారెడ్డి ఘన విజయం: దుబ్బాక నియోజవకర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిపై ఆయన 37,899 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. నియోజవకర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా రామలింగారెడ్డికి 82,123 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి 44,224, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 15,118 ఓట్లు సాధించారు. తొమ్మిది మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు.
పటాన్‌చెరులో గూడెం గెలుపు: పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందారు. మహిపాల్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం. సపాన్‌దేవ్‌పై 19,007 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సపాన్‌దేవ్‌కు 55,100 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యరి టి. నందీశ్వర్‌గౌడ్‌కు 37,205తో మూడో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 17 మంది బరిలో నిలవగా 14 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
అందోలులో బాబూమోహన్ విక్టరీ: అందోలు నియోజవకర్గంలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మాజీ డిప్యూటీ సీఎం సి. దామోదరను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పి. బాబూమోహన్ ఓడించారు. దామోదర, బాబూమోహన్ మధ్య విజయం నీదా నాదా అన్నట్టు దోబూచులాడింది. చివరకు బాబూమోహన్ 3,208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాబూమోహన్‌కు మొత్తం 86,759 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి దామోదరకు 83,551 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎల్లయ్యకు 3,059 ఓట్లు పొందారు.
నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ పాగా: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా టీఆర్‌ఎస్ పాగా వేసింది. మాజీ మంత్రి సునీతారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి విజయం సాధించారు. చిలుముల మదన్‌రెడ్డి 14,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మదన్‌రెడ్డికి మొత్తం 85,890 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి 71,673, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బల్వీందర్‌నాథ్‌కు 6,075 ఓట్లు వచ్చాయి.
మెదక్‌లో వికసించిన ‘పద్మ’: మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతిని ఓడించారు. పద్మా దేవేందర్‌రెడ్డి 39,234 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. పద్మా దేవేందర్‌రెడ్డికి 89,119 ఓట్లు రాగా విజయశాంతికి 49,885 ఓట్లు వచ్చాయి. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బట్టి జగపతికి 9,266 ఓట్లు వచ్చాయి.
ఖేడ్‌లో మళ్లీ కిష్టారెడ్డే: నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల కిష్టారెడ్డి రెండోమారు విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై ఆయన 14,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కిష్టారెడ్డికి మొత్తం 62,007 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డికి 47,225, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 40,307 ఓట్లు వచ్చాయి.
స్వల్ప మెజార్టీతో గీతమ్మ విజయం: మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండోమారు గెలుపును సొంతం చేసుకున్నారు. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుపై గీతారెడ్డి 842 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గీతారెడ్డికి 57,558 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు 56,716, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వై. నరోత్తంకు 39,057 ఓట్లు వచ్చాయి.