సాక్షి, యాదాద్రి: కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్ ఫీజుల షాక్ ఇచ్చింది. తిరుమల తరహాలో యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పిస్తామన్న దేవస్థానం ప్రకటనతో సంతోషపడ్డ భక్తులు పార్కింగ్ ఫీజుల పెంపు ప్రకటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండపైన పార్కింగ్ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. దేవస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదివారం నుంచి ఈ పార్కింగ్ చార్జీల వసూలు ప్రారంభం కానుంది.
ఈ మేరకు శనివారం ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాల ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్ వాహనాలకు పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
అలాగే దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని, ఫీజు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment