parking fees
-
మాల్స్‌లో పార్కింగ్ ఫీజుపై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ విజయవాడకు చెందిన చందన మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పుని చ్చిందని తెలిపారు. ఈ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. జీవో 13 సినిమా టికెట్లకు సంబంధించిందని, అందులో పార్కింగ్ ఫీజుల ప్రస్తావన లేదని తెలిపింది. -
‘కొండెక్కిన’ పార్కింగ్ ఫీజు
సాక్షి, యాదాద్రి: కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తీసుకుని కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు యాదగిరిగుట్ట దేవస్థానం పార్కింగ్ ఫీజుల షాక్ ఇచ్చింది. తిరుమల తరహాలో యాదాద్రిలో భక్తులకు వసతులు కల్పిస్తామన్న దేవస్థానం ప్రకటనతో సంతోషపడ్డ భక్తులు పార్కింగ్ ఫీజుల పెంపు ప్రకటనతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొండపైన పార్కింగ్ చేస్తే గంటకు రూ.500, ఆ పైన ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. దేవస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం ఆదివారం నుంచి ఈ పార్కింగ్ చార్జీల వసూలు ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాల ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్ వాహనాలకు పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని, ఫీజు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
'పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే మాల్స్‌కే ప్రమాదం'
పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. "బిల్డింగ్ రూల్స్ ప్రకారం, భవనం నిర్మించడానికి పార్కింగ్ స్థలం కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది. కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ పూర్తి రిస్క్‌తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్‌ను సందర్శించినప్పుడు అతని నుండి పార్కింగ్ ఫీజు రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తాను డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేట్లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ మేరకు కోర్టు ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500
పూర్తి స్థాయిలో రైళ్లు ఇంకా పట్టాలు మీద పరుగులు పెట్టడం లేదు.. అప్పుడే పార్కింగ్ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా జంటనగరాల్లో రైలు ప్రయాణాలకు గుండెకాయలాంటి సికింద్రాబాద్ స్టేషన్‌కు సొంత వాహనంలో రావాలంటే వెన్నులో వణుకుపుట్టే రేంజ్లో ఛార్జీలను విధిస్తోంది. ఇదేమంటే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకే అంటూ వితండవాదం ఎత్తుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్ జంక్షన్. ఈ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్‌లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేవలం రెండు గంటలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్ నిలిపి ఉంచితే రూ.15 , ఫోర్ వీలర్ అయితే రూ.50 వంతున పార్కింగ్ ఛార్జీగా విధించింది. ఆలస్యమయితే ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. - తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.100 - తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.200 - తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500 ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. Privatisation Shows its Colour. Parking a car for 31 minutes at a railway station now costs Rs.500 as parking charges. Whose Vikas? pic.twitter.com/EyFNS4rdPl — Brigadier A K Jairath, Retd (@KWecare) November 9, 2021 కవరింగ్ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీల విషయంలో నలువైపులా విమర్శలు పెరిగినా రైల్వే అధికారుల్లో మార్పు రాలేదు. పైగా స్టేషన్లో అనవసర రద్దీని నియంత్రించేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యంగా ఉండేందుకే ఈ ఓవర్ స్టే ఛార్జీలు పెట్టామంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. Clarification about the messages circulating in the socialmedia regarding parking charges @Secunderabad Stn. These are only Overstay charges introduced to avoid unnecessary crowding of Station premises and provide hassle free movement facility for rail passengers @KTRTRS @KWecare pic.twitter.com/KNEhUcHBZq — South Central Railway (@SCRailwayIndia) November 10, 2021 ఇలాగైతే ఎలా రెండు గంటలు దాటితే రైల్వేశాఖ అమలు చేస్తోన్న ఓవర్ స్టే ఛార్జీలు తమకు భారంగా మారాయని ప్రయాణికులు అంటున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలా ప్రయాణం చేయడం కష్టంగా అవుతోంది అంటున్నారు. మరోవైపు చాలా రైళ్లు సమయానికి రావు. ఒక వేళ రైలు ఆలస్యం కావడం వల్ల స్టేషన్లో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే.. అది రైల్వేశాఖ తప్పు అవుతుంది. అందుకు వాళ్లే పరిహారం ఇవ్వాల్సింది పోయి.. తిరిగి ప్రజల నుంచి ఓవర్ స్టే ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ స్పెషల్.. ఇక్కడ ఓవర్‌స్టే కోవిడ్ తర్వాత సాధారణ రైళ్లను క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా స్పెషల్ రైళ్లుగా పేర్కొంటూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది రైల్వేశాఖ. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. అక్కడ కూడా సొమ్ము చేసుకుంటోంది. వీటిపైనే చాలా విమర్శలు ఉండగా తాజాగా పార్కింగ్ ఓవర్‌స్టే ఛార్జీలు తెర మీదకు వచ్చాయి. -
ఇన్ఫోసిస్‌కి షోకాజ్ నోటీస్, జరిమానా.. కారణం ఇదే
దేశంలోనే రెండో అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్లో మార్పు తెచ్చేందుకు చేసిన చిన్న ప్రయత్నం బెడిసికొట్టింది. చివరకు కోర్టు నుంచి షోకాజ్ నోటీస్ అందుకోవడంతో పాటు మున్సిపాలిటీకి జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహరం అంతా హైదరాబాద్ పరిధిలోనే జరిగింది. పోచారంలో ఐటీ హబ్‌గా విరాజిల్లుతున్న ఇన్ఫోసిస్ కంపెనీకి హైదరాబాద్‌లో అనేక క్యాంపస్‌లు ఉన్నాయి. అందులో వేల మంది ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. అయితే ఇటీవల పోచారం క్యాంపస్‌కి సంబంధించి అక్కడి నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది. ఇలా చేయోచ్చా ? పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఉద్యోగుల నుంచి పార్కింగ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. స్కూటర్‌కి రూ. 250, బైక్‌కి రూ. 300 కారుకి అయితే రూ.500ల వంతున పార్కింగ్ ఫీజుని నిర్ణయించారు. ఉద్యోగుల నుంచే సంస్థ పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ విజయ్ గోపాల్ అనే సామాజిక కార్యకర్త తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసమే ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ కోర్టు ఇన్ఫోసిస్ని ప్రశ్నించింది. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించేలా ప్రోత్సహించేందుకే పార్కింగ్ ఫీజును ప్రవేశపెట్టినట్టు ఇన్ఫోసిస్ వివరించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రూ. 50,000 ఫైన్ మరోవైపు ఉద్యోగుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని తప్పు పడుతూ పోచారం మున్సిపాలిటీ అధికారులు ఇన్ఫోసిస్‌కి రూ. 50,000 జరిమానా విధించారు. తెలంగాణ స్టేట్ అపార్ట్మెంట్ యాక్ట్ 1987, తెలంగాణ స్టేట్ మున్సిపాలిటీ యాక్ట్ 2019ల ప్రకారం అపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో కామన్ ఏరియా, పార్కింగ్‌ల కోసం కేటాయించిన స్థలాన్ని కమర్షియల్ వ్యవహరాలకు ఉపయోగించరాదు. ఈ నిబంధన మీరినందున ఇన్ఫోసిస్‌కి జరిమానా విధించారు. పార్కింగ్ ఫీజు ఇలా తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లో నిబంధనల ప్రకారం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లేదా మల్టీప్లెక్స్‌లో వాహనాన్ని 30 నిమిషాల నుంచి గంట వరకు నిలిపి ఉంచినప్పుడు ఆ భవనంలో కొనుగోలు చేసినట్టు ఏదైనా బిల్లు రిసీట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ బిల్లు చేసినా పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక గంట సమయాన్ని మించితే పార్కింగ్ ఫీజు కన్నా ఆ షాపింగ్ మాల్ లేదా మల్టీప్లెక్స్‌లో చేసిన బిల్లు ఎక్కువ ఉంటే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మరి వీటి సంగతి ? పార్కింగ్ ఫీజు విషయంలో ఇన్ఫోసిస్ సంస్థ మీద చూపించిన శ్రద్ధ మిగిలిన షాపింగ్ కాంప్లెక్సుల మీద కూడా చూపెట్టాలని నగర వాసులు కోరుతున్నారు. నగరంలో చాలా షాపింగ్ మాల్స్‌లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. బిల్లులు చూపించినా బెదిరింరి మరీ డబ్బులు గుంజుతున్నారు. పోచారం మున్సిపాలిటీ తరహాలోనే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పార్కింగ్ రూల్స్‌ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి : ఆ రెస్టారెంట్లో సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు.. విచిత్రమైన కారణం -
సినిమా థియేటర్లలో ఇక పార్కింగ్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్‌లతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌లలో ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని గతంలో జారీ చేసిన ఉత్తర్వులు యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు. కేవలం సినిమా థియేటర్ మాత్రమే ఉంటే (స్టాండ్ ఎలోన్) పార్కింగ్ ఫీజులను వసూలు చేసుకోవచ్చని అన్నారు. సినిమా థియేటర్లలోని పార్కింగ్ ఏరియాల్లో ప్రేక్షకులు కాని వారు సైతం పెద్ద సంఖ్యలో వాహనాలు నిలుపుతుండటంతో నిర్వహణ కష్టంగా మారిందని థియేటర్ల యజమానుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఫీజులు వసూలు చేసుకోవడానికి అను మతిచ్చినట్టు తెలిపారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు. -
పైసా వసూల్
వినోదం కోసం వెళ్లిన వారికి థియేటర్ల యజమానులు అధిక ధరలతో సినిమా చూపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఐదు థియేటర్లు ఉండగా, అందులో పార్కింగ్ పేరిట ప్రేక్షకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని థియేటర్లలోనైతే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యే క స్థలం లేదు. సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెంచే హక్కులు ప్రభుత్వం యా జమాన్యాలకు ఇచ్చింది. అయినప్పటికీ టికెట్ల ధరలు పెంచడంతో పాటు పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయోద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. పార్కింగ్ చేసిన వాహనాలు విరామ సమయంలో తినే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువగా తీసుకుని జేబులు గుల్ల చేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ప్రత్యేకంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.30ల, ఆటోలకు, ద్విచక్రవాహనాలకు రూ.20, సైకిళ్లకు రూ.10లు వసూలు చేస్తూ సినిమాకు వచ్చిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సినిమాకు వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న రశీదు ఇలా ఒక్క థియేటర్లో ఒక షోకు సుమారు 100 వరకు వాహనాలు వస్తుండగా వాటికి రూ. 1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు అవుతున్నాయి. ఇలా ఒక రోజులో నాలుగు షోలకు రూ.4వేల నుంచి రూ.8వేల వరకు వసూలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో థియేటర్లు 5 ఒక థియేటర్లో ఉండే సీట్లు 400-500 ఒక షోకు పార్కింగ్ చేసే ద్విచక్ర వాహనాలు 100 పార్కింగ్ చేసే ఆటోలు 10 పార్కింగ్ చేసే ఆటోలు 10 ఉన్నత వర్గాల వారు వచ్చే కార్లు 5 అన్నీ అసౌకర్యలే.. సినిమా థియేటర్‌కు వచ్చిన వారిని అసౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థియేటర్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సినిమాకు వచ్చిన వందలాది మందికి సరిపోక, శుభ్రంగా లేకపోవటంతో సినిమాకు వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామ సమయంలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ కొనుగోలు చేసేవారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట లభించే ధరల కంటే రూ.5 నుంచి రూ.10ల వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు దగాకు గురికావాల్సి వస్తోంది. పేరున్న హీరో సినిమా వస్తే సినిమా యాజమాన్యం ఏకంగా టికెట్ ధరలు పెంచేస్తోంది. ఇప్పటకైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
పార్కింగ్ ఫీజుతోనే న్యూయార్క్‌లో భారీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్‌లో రెండో అతిపెద్ద ఆదాయ వనరు పార్కింగ్ ఫీజేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెయిడ్ పార్కింగ్ ద్వారా వస్తున్న వార్షికాదాయం రూ.96 లక్షలేనని, అందుకే దాన్ని ఉచితం చేసి వాహనదారులకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి రూపొందించిన పార్కింగ్ విధానం హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రం లోని అన్ని పట్టణాలకూ వర్తింపజేస్తామన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు కేటీఆర్ సమాధానమిస్తూ.. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, మెట్రో రైల్ సంస్థల ఆధ్వ ర్యంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం ఖాళీగా ఉండే ప్రభుత్వ భవన ప్రాంగణాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని, స్మార్ట్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చెరకుకు 2 సార్లు ‘పెట్టుబడి’: పోచారం ‘రామ రాజ్యం, అశోక రాజ్యం, కాకతీయ రాజ్యం.. రాజ్యమేదైనా రైతు నుంచి శిస్తు వసూలు చేశారు. కానీ కేసీఆర్ రాజ్యంలో శిస్తు లేదు సరికదా రైతుకే ఎదురు పెట్టుబడి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధానం అమలు చేస్తున్నాం. ఇది అద్భుత పథకం’ అని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రూ.4 వేల పెట్టుబడి పథకంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల వివాద రహిత భూములు గుర్తించి వాటికి పెట్టుబడి పథకం వర్తింపచేస్తున్నాం. ఇతర ప్రధాన పంటలతోపాటు శనగ పంటకూ సాయం ఇస్తున్నాం. 12 నెలల పంట చెరకును రెండు పం టలుగా పరిగణించి రూ.4 వేలను రెండు పర్యాయాలు చెల్లిస్తాం. ఉద్యాన పంటలకూ ఇలానే అందిస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం భూముల్లో వివాదాస్పద భూములు 4 శాతమే ఉన్నాయని, సమస్యలు పరిష్కారమైతే వాటికీ పెట్టుబడి వర్తింపజేస్తామన్నారు. -
రైల్వే పార్కింగ్ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సాధారణ బోగీ ప్రయాణం కేవలం రూ.135. స్లీపర్ క్లాస్ ప్రయాణమైతే రూ.280. కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒక ద్విచక్రవాహనాన్ని 24 గంటలపాటు పార్కింగ్ చేస్తే చెల్లించవలసిన ఫీజు ఎంతో తెలుసా..! అక్షరాలా మూడు వందల రూపాయలు. కారైతే ఏకంగా రూ.580 చెల్లించాలి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న పార్కింగ్ దోపిడీ ఇది. ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులపై పార్కింగ్ ఫీజుల రూపంలోనే దక్షిణమధ్య రైల్వే ఏటా రూ.5 కోట్లకు పైగా ఆర్జిస్తోంది. మరోవైపు ఈ పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవు. వాహనాలకు భద్రతనిచ్చే పై కప్పులు లేవు. ప్రయాణికుల సదుపాయాలను విస్మరించి అదనపు ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే కొనసాగిస్తున్న పార్కింగ్ దోపిడీ తీరిదీ... ఏటా రూ.5 కోట్ల పైమాటే.. ప్రతి రోజు రూ.కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించాలి. ఈ సదుపాయాల్లో భాగంగానే పార్కింగ్ వసతి కూడా ఉండాలి. కానీ స్టేషన్‌కు రెండువైపులా 6 పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి అదనపు ఆర్జనకు తెర లేపారు. ప్రీమియం పార్కింగ్ స్థలాల్లో ద్విచక్ర వాహనాలపైన గంటకు రూ.18 చొప్పున, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలపైన గంటకు రూ.47 చొప్పున చార్జీలు విధించారు. ఒక ద్విచక్ర వాహనాన్ని ప్రీమియం స్లాట్‌లో 3 గంటల పాటు పార్క్ చేస్తే రూ.54 వరకు చెల్లించాలి. కార్లకైతే రూ.94 వరకు ఖర్చవుతుంది. సాధారణ పార్కింగ్ స్థలాల్లో ద్విచక్ర వాహనాలకు ప్రతి గంటకు రూ.ఆరు చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ప్రీమియం పార్కింగ్‌లో 24 గంటల పాటు ద్విచక్రవాహనాన్ని నిలిపితే రూ.300, కార్లకైతే రూ.580 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ ట్రైన్ చార్జీ కేవలం రూ.75. కానీ ద్విచక్రవాహనాన్ని 4 గంటల పాటు నిలిపితేనే రూ.72 వరకు చెల్లించాల్సి వస్తోంది. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్పైన ఏటా రూ.3 కోట్లు, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో రూ.కోటి చొప్పున మొత్తంగా ఏటా రూ.5 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వేలం పాటల్లో అధిక మొత్తానికి ముందుకొచ్చే కాంట్రాక్టర్లకు పార్కింగ్ కట్టబెడుతున్నారు. దీంతో రెండేళ్లకోసారి చార్జీలు పెరిగిపోతున్నాయి. జీఎస్టీ దెబ్బ... పార్కింగ్ ఫీజులే భారం అనుకుంటుంటే రైల్వే శాఖ వాటిపై 18 శాతం చొప్పున జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఈ రెండేళ్లలోనే పార్కింగ్ రుసుము గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ల తరహాలో రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణికులకు పార్కింగ్‌పై రాయితీ సదుపాయం కల్పించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. జీఎస్టీతో పెరిగిన పార్కింగ్ చార్జీలు(రూ.లలో) వాహనం రెండేళ్ల క్రితం జీఎస్టీతో కారు 350 580 ద్విచక్రవాహనం 150 300 వాహనాలకు రక్షణ లేదు వాహనాలకు ఎలాంటి రక్షణ లేదు. చాలావరకు ఓపెన్ స్థలాల్లోనే పార్కింగ్ ఉంది. ఇది చాలా అన్యాయం. –మోహన్, మౌలాలి. ఫీజు చాలా ఎక్కువ ఫ్రెండ్ కోసం స్టేషన్‌కు వచ్చాను. గంట కు రూ.18 అంటే చాలా ఎక్కువే. సిటీ లో ఇంత ఎక్కువగా ఎక్కడా లేదు. – ప్రశాంత్, సికింద్రాబాద్ క్యాబ్‌లో రావడం మేలు ట్రైన్ ఎక్కాలంటే సొంత వాహనంపై స్టేషన్‌కు వచ్చి పార్కింగ్ చేసే కంటే క్యాబ్‌లో లేదా, ఆటోలో రావడం మంచిదనిపిస్తుంది. –సందీప్ -
మాల్స్‌లో పార్కింగ్ ఫీజులపై చట్టం లేదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయాలని, చేయకూడదన్న చట్టం/నియమావళి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్కింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ముసా యిదా పార్కింగ్ విధానంపై పరిశీలన జరుపుతోందన్నారు. మంగళవారం ఈ మేరకు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. రాష్ట్రంలోని 5 జిల్లాలు, 68 మండలాలు, 2,703 గ్రామాలు, 2,432 గ్రామ పంచాయతీలను ఇప్పటి వరకు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలు (ఓడీఎఫ్)గా ప్రకటించామని తెలిపారు. ఇంకా 25 జిల్లాలు, 370 మండ లాలు, 8,327 గ్రామాలు, 6,252 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాల్సి ఉందన్నారు. 60 శాతం కేంద్ర, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.2,335.37 కోట్లతో 18,18,825 గ్రామీణ గృహాల్లో మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. -
పార్కింగ్ ఫీజుల దోపిడీపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, మాల్స్, బస్టాండులు తదితర చోట్ల వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్పందించింది. పార్కింగ్ ఫీజుల దోపిడీ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
వసూల్ రాజాలెవరు...?
వేములవాడ : భోళాశంకరుడి వద్దకు వస్తున్న భక్తులకు అక్రమార్కులు నిలువునా దోచుకుంటున్నారు. పార్కింగ్ ఫీజు పేరుతో ఒక్కో వాహనం వద్దనుంచి రూ. 150, రూ.100, రూ.50 చొప్పున బినామీ రశీదులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వైనం సోమవారం వెలుగుచూసింది. అనుమతి లేకుండా పార్కింగ్ ఫీజులు వసూలు చేసే నాయకుడెవరూ..? ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. పక్షం రోజులుగా ఈ దందా సాగుతున్నా... అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ భక్తుడు సోమవారం స్థానిక విలేకరులకు సమాచారం అందించడంతో అక్రమార్కుల గుట్టురట్టయింది. దీంతో ఇందులో భాగస్వామ్యమైన వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. జేబులు నింపుకున్న అక్రమార్కులు.. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు రవాణా సౌకర్యర్థాం సొంత, అద్దె వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి వస్తుంటారు. సమ్మక్క జాతర నేపథ్యంలో వచ్చే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పార్కింగ్ ఫీజు దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యాల బిజీలో ఆలయ అధికారులు, బందోబస్తులో పోలీసులునిమగ్నం కావడంతో అక్రమార్కులకు మరింత కలిసొచ్చింది. వేలాదిగా వచ్చిన వాహ నదారుల నుంచి రూ.150, రూ.100, రూ.50 చొప్పున పార్కింగ్ ఫీజు పేరుతో వసూలు చేసి జేబులు నింపుకున్నారు. అధికారి సంతకం, ముద్రలు లేకుండానే నిలువుదోపిడీ చేశారు. టెంపుల్ కాంట్రాక్టు ఇదీ... టీటీడీ ధర్మశాల ప్రాంగణం, గుడి చెరువు కట్టవద్ద పార్కింగ్ స్థలాల వద్ద ఉన్న వాహనాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని ఆలయ అధికారులు 2015- 17 రెండేళ్ల కోసం టెండర్ నిర్వహించారు. తిరుపతి అనే కాంట్రాక్టర్ రూ.10లక్షలకు ఈ టెండర్ దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆటోలు రూ.20, కార్లకు రూ.50 చొప్పున తీసుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా జాత్రాగ్రౌండ్, బైపాస్‌రోడ్డు, గుడి చెరువు కట్ట కింద, ఇతర ప్రాంతంలో నిలుపుతున్న వాహనాలవద్ద బినామీ కాంట్రాక్టర్లు అధిక మొత్తం వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదంతా జరుగుతున్నా.. ఈ వ్యవహారం అధికారులకు చేరలేదా? లేక ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందా..? అన్న అంశం తేలాల్సి ఉంది. పోలీసుల విచారణ షురూ పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూలు దందాకు తెరలేపిన వారెవరనేది పోలీసులు కూపీ లాగుతున్నారు. దేవస్థానంపక్షాన పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వారికి సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
పార్కింగ్‌కు ‘మార్కింగ్’
పార్కింగ్ లాట్ల వద్ద పూర్తి వివరాలతో బోర్డులు అక్రమ వసూళ్లకు త్వరలో జీహెచ్ఎంసీ చెక్ సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జ్ వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలమేదో, కానిదేదో తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జ్ వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్‌లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖంగా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా.. ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారి ఫోన్ నంబరును కూడా అందుబాటులో ఉంచనున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ప్రజలకు పార్కింగ్ బాదుడు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన వివరాలు.. పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా బోర్డుల ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు.. ప్రస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5 ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ధరల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కొస మెరుపు: దాదాపు రెండేళ్ల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సైతం ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అప్పట్లో ఇది అమలుకు నోచుకోలేదు.