సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్‌లో రెండో అతిపెద్ద ఆదాయ వనరు పార్కింగ్ ఫీజేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెయిడ్ పార్కింగ్ ద్వారా వస్తున్న వార్షికాదాయం రూ.96 లక్షలేనని, అందుకే దాన్ని ఉచితం చేసి వాహనదారులకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి రూపొందించిన పార్కింగ్ విధానం హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రం లోని అన్ని పట్టణాలకూ వర్తింపజేస్తామన్నారు.
మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు కేటీఆర్ సమాధానమిస్తూ.. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, మెట్రో రైల్ సంస్థల ఆధ్వ ర్యంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం ఖాళీగా ఉండే ప్రభుత్వ భవన ప్రాంగణాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని, స్మార్ట్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
చెరకుకు 2 సార్లు ‘పెట్టుబడి’: పోచారం
‘రామ రాజ్యం, అశోక రాజ్యం, కాకతీయ రాజ్యం.. రాజ్యమేదైనా రైతు నుంచి శిస్తు వసూలు చేశారు. కానీ కేసీఆర్ రాజ్యంలో శిస్తు లేదు సరికదా రైతుకే ఎదురు పెట్టుబడి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధానం అమలు చేస్తున్నాం. ఇది అద్భుత పథకం’ అని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు.
రైతులకు రూ.4 వేల పెట్టుబడి పథకంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల వివాద రహిత భూములు గుర్తించి వాటికి పెట్టుబడి పథకం వర్తింపచేస్తున్నాం. ఇతర ప్రధాన పంటలతోపాటు శనగ పంటకూ సాయం ఇస్తున్నాం. 12 నెలల పంట చెరకును రెండు పం టలుగా పరిగణించి రూ.4 వేలను రెండు పర్యాయాలు చెల్లిస్తాం. ఉద్యాన పంటలకూ ఇలానే అందిస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం భూముల్లో వివాదాస్పద భూములు 4 శాతమే ఉన్నాయని, సమస్యలు పరిష్కారమైతే వాటికీ పెట్టుబడి వర్తింపజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment