పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారణ ఆగస్టు 7కి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ విజయవాడకు చెందిన చందన మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు.
మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పుని చ్చిందని తెలిపారు. ఈ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. జీవో 13 సినిమా టికెట్లకు సంబంధించిందని, అందులో పార్కింగ్ ఫీజుల ప్రస్తావన లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment