
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, మాల్స్, బస్టాండులు తదితర చోట్ల వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్పందించింది. పార్కింగ్ ఫీజుల దోపిడీ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందులో భాగంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.