లేని అధికారం చూపొద్దు | High Court on non packaged food in cinema theaters | Sakshi
Sakshi News home page

లేని అధికారం చూపొద్దు

Published Fri, Aug 3 2018 1:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

High Court on non packaged food in cinema theaters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో అమ్మే నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ (ప్యాకెట్‌లో కాకుండా విడిగా అమ్మే తినుబండారాలు) విషయంలో పలు నిబంధనలు విధిస్తూ తూనికలు, కొలతల శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విషయంలో అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం తూనికలు, కొలతల శాఖ అధికారులకు లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అధికారులు తమకు లేని అధికారాన్ని ప్రదర్శించినట్లయిందని స్పష్టం చేసింది.

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్యాకెట్‌లలో కాకుండా పేపర్‌ ప్లేట్‌లో పెట్టి అమ్మే సమోసాలకు సైతం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉండి తీరాలన్న నిబంధనపై విస్మయం వ్యక్తం చేసింది. అధికారుల తీరు చూస్తుంటే రోడ్లపై అమ్మే టీ, కాఫీ, సోడాలకు సైతం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇవ్వాలని అడిగే ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విషయంలో తూనికలు, కొలతల అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఏ మాత్రం నిబంధనలకు లోబడి లేవని, ఈ విషయంపై సోమవారం పూర్తిస్థాయిలో తగిన ఆదేశాలు జారీ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ప్రకటించారు.

అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకులే..
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో విక్రయించే నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విషయంలో పలు నిబంధనలు విధిస్తూ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులు గతనెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, పీవీఆర్‌ లిమిటెడ్‌లు హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు సంబంధించి విధించిన నిబంధనల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అయితే నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విషయంలో విధించిన నిబంధనలు మాత్రం సహేతుకంగా లేవని తెలిపారు. ప్యాకెట్‌లలో కాకుండా విడిగా అమ్మే ఆహార పదార్థాల విషయంలో తప్పనిసరిగా డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన పెట్టారని, ఆచరణలో ఇది ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. విడిగా అమ్మే ఆహార పదార్థం బరువు, నాణ్యత తదితరాలను డిక్లరేషన్‌లో చెప్పాలని అధికారులు అంటున్నారని ఆయన వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఉదాహరణకు మనం రెండు సమోసాలు కొంటే వాటిని పేపర్‌ ప్లేట్‌లో పెట్టి ఇస్తారు.

అధికారులు చెబుతున్న ప్రకారం ఆ పేపర్‌ ప్లేట్‌పై స్టిక్కర్‌ రూపంలో డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యం? దీన్ని అమలు చేస్తే స్టిక్కర్ల ముద్రణకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రేక్షకుల నుంచే వసూలు చేస్తారు. దీంతో సమోసాల రేటు కూడా పెరుగుతుంది. అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకులే. అయినా మనం ఎన్ని సమోసాలు కొన్నామో వాటికి బిల్లు ఇస్తారు కదా. బోర్డులో ఒక్కో సమోసా ధర ఎంతో ఉంటుంది. కొన్న ప్రతీ పదార్థానికి బిల్లు తప్పనిసరి చేయడంలో తప్పులేదు. కానీ ఇలా సహేతుకంగా లేని, ఆచరణ సాధ్యం కాని నిబంధనలు విధించడం  సరికాదు’’అని అన్నారు.

దోపిడీ నుంచి కాపాడేందుకే..
ఇలాంటి నిబంధన విధించే అధికారం తూనికలు, కొలతల శాఖకు ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి కోరారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది జ్యోతికిరణ్‌ నిబంధనలను చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూనికలు, కొలతల అధికారులు ఈ నిబంధనలు రూపొందించారని, తాము కొత్తగా దీన్ని తీసుకురాలేదని, చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలను కోరామని చెప్పారు.

అంతేకాక సినిమా హాళ్లలో అధిక ధరల వసూలుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారన్నారు. అడ్డగోలు దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకే వీటిని అమలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో అధిక ధరల వసూలు ప్రస్తావన ఎక్కడుందని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.


ఏ బ్రాండ్‌ అమ్మాలో కూడా మీరే నిర్ణయిస్తారా?
నిబంధనల్లో సినిమా హాళ్లలో కేవలం ఒక బ్రాండే కాక ప్రేక్షకులకు నచ్చిన బ్రాండ్‌లను అమ్మాలని పేర్కొనడంపై కూడా న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ‘‘ఏ బ్రాండ్‌లు అమ్మాలో.. ఎన్ని బ్రాండ్‌లు అమ్మాలో కూడా అధికారులే నిర్ణయిస్తారా? ఒక ప్రేక్షకుడు నాకు బిస్లరీ వాటర్‌ కావాలంటాడు.. మరొకరు కిన్లే కావాలంటారు.. మరొకరు ఆక్వా ఫినా అడుగుతారు.. ఇవన్నీ అందుబాటులో ఉంచాలా? వద్దా? అన్నది సినిమా థియేటర్ల వాళ్ల ఇష్టం. అందులో అధికారుల జోక్యం ఏంటి? మరీ టూమచ్‌గా వ్యవహరిస్తున్నారు.

లేని అధికారాన్ని ప్రదర్శిస్తామంటే కుదరదు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ, ఏది ఎప్పుడు, ఎలా చేయాలో కూడా నిర్ణయిస్తామంటే ఎలా? ప్రభుత్వం ఎప్పుడూ న్యానీ స్టేట్‌ (పౌరుల ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోవడం)గా వ్యవహరించరాదు. నాన్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విషయంలో అధికారులు విధించిన నిబంధనలన్నీ దాదాపు చట్ట విరుద్ధంగా ఉన్నాయి. చట్టం అనుమతించని వాటిని అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు’’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement