సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారిని నిరుద్యోగులుగానే ఉంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తానన్న కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను నియంతృత్వ పాలనలో పరిపాలిస్తుందన్నారు. సాగుకోసం రైతులు నీళ్లడిగితే ఊళ్లకు ఊళ్లను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్, కవితలు ఈ చరిత్ర మర్చిపోయారని అందువల్లే ప్రజలకు మేలు చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరిని మూసివేశారని ఆరోపించారు.
బీజేపీ ‘బీ’ టీమ్ టీఆర్‌ఎస్ పార్టీ
తన అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ మోడీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారని మధు యాష్కి విమర్శించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని ప్రజా సంఘాలు, వర్గాలు, మహిళలు ముందుండి ఈ ప్రజాకంటక పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
మహిళల అక్రమ రవాణాలో మనమే ముందున్నాం : గీతారెడ్డి
మహిళల అభివృద్ధికోసం కృషి చేస్తున్నామంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి ఎద్దేవాచేశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. దీన్ని బట్టే తెలంగాణలో ఎలాంటి పాలన ఉందో అర్ధమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం చాలా చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా మహిళల పేరుతోనే మొదలు పెట్టేదని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో స్వయం ఉపాధి మహిళా సంఘాలకు చాలా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ మహిళా సంఘాలతో సమావేశం అవుతారని తెలిపారు. అందువల్ల మహిళలు పెద్దఎత్తున ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్‌ను సెక్రెటేరియట్ కోసం ఇస్తే భారీ ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment