Madhu Yaskhi
-
కేసీఆర్ వ్యతిరేకులను కూడగడతా
మహేశ్వరం, తుక్కుగూడ: రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో కలిసొచ్చే వారిని కలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్, ఆయన కుమారులతో కాం గ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన దేవేందర్ గౌడ్ అనుభవాలు సలహాలు, సూచనలు తెలంగాణ ప్రజలకు అవసరమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయ వనరులు తెలంగాణకే దక్కాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్‌గౌడ్ అని చెప్పారు. దేవేందర్‌గౌడ్ ఆనాడు ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు పాదయాత్ర చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కారు దారి తప్పిందని, దివాలా తీసిన తెలంగాణను పట్టాలెక్కించేందుకు అందరి ఆలోచనలు, అనుభవాలను స్వీకరిస్తామన్నారు. ప్రాజెక్టుల పేరిట కల్వకుంట్ల కుటుంబం కోట్లు దండుకుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటులో దేవేందర్ పాత్ర కీలకం: మధుయాష్కీ 70 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమాన్ని గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలంగాణకు రావాల్సిన వనరుల గురించి పార్లమెంటులో కొట్లాడారని మధుయాష్కీగౌడ్ గుర్తు చేశారు. అంతకుముందు దేవేందర్ గౌడ్, ఆయన కుమారులు పుష్పగుచ్ఛం అందజేసి రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ నిర్మాణం .. ప్రజాందోళనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒకవైపు కేడర్‌లో ఉత్సాహం నింపుతూ సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు, ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయా లని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం గాంధీభవన్‌లో కీలక సమావేశాలు నిర్వహించారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ముందుగా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ కో చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్‌తో సమావేశం జరిగింది. ఆ తర్వాత సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. యువత, మహిళల సమస్యలపై పోరాటం ప్రధానంగా యువత, మహిళలకు సంబంధించిన సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. ఆగస్టులో వివిధ స్థాయిల్లో పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందా మని, పార్టీ సభ్యులకు, నాయకులకు గుర్తింపు కార్డులు ఇద్దామని చెప్పారు. పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుని, 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దించి పార్టీని అధికారంలోకి తెచ్చే దిశలో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. 12న సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు ఈ సమావేశాల వివరాలను నేతలు మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, అజ్మతుల్లా హుస్సేన్‌లు మీడియాకు వివరించారు. హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించినట్లు మధుయాష్కీ తెలిపారు. పలు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా నిరుద్యోగ సమస్యపై త్వరలోనే 48 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరల పెంపునకు నిరసనగా ఈనెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌లో జరిగే ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈనెల 16న ‘చలో రాజ్‌భవన్’చేపడతామన్నారు. పార్టీని నడిపించేందుకు అయ్యే ఖర్చును ప్రతి ఒక్కరూ పంచుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. వైఎస్‌కు నివాళి ఈ సమావేశాలకు ముందు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి రేవంత్ సహా ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పీసీసీ మార్పు: మధుయాష్కీ హాట్ కామెంట్స్
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందన్నారు. దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ మార్పుకు అవకాశం ఉండవచ్చు అంచనా వేశారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అధిష్టానం ఆ దిశలో ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. శుక్రవారం నిజమాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మధుయాష్కీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కింది స్థాయి కార్యకర్త వరకూ అందరూ కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారని తెలిపారు. ఆ తరువాత అధిష్టానం పీసీసీ మార్పు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా పీసీసీ చీఫ్ మార్పుపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా ఉత్తమ్‌ను బాధ్యత నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచినా లాభం లేదు
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచినా లాభం లేదని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని టీపీసీసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆలోచన వేరుగా ఉంటుందని, మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై రానున్న ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, మీడియాతో సమన్వయంపై చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులు మల్లురవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఇందిరాశోభన్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూలీలుగా మార్చుకున్న అహంకారి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన సరైన రీతిలో జరగాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేస్తారని చెప్పారు. మీడియాతో సమన్వయం కోసం త్వరలోనే జిల్లా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కమిటీలో ముగ్గురు సభ్యులు.. కాగా, పార్లమెంటు ఎన్నికలకోసం ఏర్పాటు చేసిన మీడియా కోఆర్డినేషన్ కమిటీలో కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, సుధాకర్‌గౌడ్‌లను కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్టు మధుయాష్కీ వెల్లడించారు. -
టీఆర్ఎస్ పేలని చిచ్చుబుడ్డి: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: దీపావళి పేలని చిచ్చుబుడ్డిగా డిసెం బర్ 7న టీఆర్ఎస్ తుస్సుమనడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు, కల్వకుంట్ల కుంటుంబానికి జరిగే ఎన్నిక ల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. టీఆర్ఎస్కు వంద సీట్లు కాదు కదా.. అందులో నాలుగో వంతు సీట్లు కూడా రావన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా కూటమిని చూసి టీఆర్ఎస్కు భయం పట్టుకుందని, బావ బామర్దులు కలసి ఓట మి భయంతో బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా కూటమి సీట్లన్నీ ఉమ్మడిగా ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నామని చెప్పారు. కూటమి మిత్ర పక్ష పార్టీలు తమకు ఎన్ని సీట్లు కావాలో నివేది క ఇచ్చాయని, వాటిపై సర్వే కూడా చేయించామన్నా రు. దీపావళి రోజున లేదా ఆ తర్వాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలిపారు. -
దిగజారుడు మాటలు మానుకో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ నేత మధుయాష్కీ దిగజారుడు మాటలు మానుకోవాలని ఎంపీ కవిత అన్నారు. మంగళవారం నిజామా బాద్ లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఓటమి పాలయ్యాక కనీసం నియోజకవర్గం ముఖం కూడా చూడని యాష్కీకి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆయనలా తాను దిగాజారుడు మాటలు మాట్లాడనని, ఆయన భాష మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో నిజామాబాద్ –పెద్దపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం కేవలం రూ.440 కోట్లు కేటాయిస్తే, తాను ఎంపీగా గెలిచాక రూ.500 కోట్లు మంజూ రు చేయించానని చెప్పారు. రైల్వేమంత్రి సదానంద గౌడ్‌ను 50 సార్లు కలసి వినతిపత్రాలు అందించా నని, రైల్వేశాఖపై ఒత్తిడి తెచ్చి దేశంలోనే అధిక ప్రాధాన్యత ప్రాజెక్టులో ఈ లైనును చేర్చానని కవిత పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను మధుయాష్కీ ఖర్చు చేయకపోవడంతో రూ.3.5 కోట్లు మురిగిపోయాయని, తాను ఎంపీగా గెలిచాక తిరిగి మంజూరు చేయించి అభివృద్ధి పనులకు వెచ్చించామన్నారు. లక్కంపల్లి సెజ్ భూములు పడావుగా మారి ఉంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లు మంజూరు చేయించి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇలా కుటుంబపాలనలో కొనసాగుతున్న కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కులేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. యాష్కీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. -
అవినీతి బండారం బయటపెడతా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల పార్టీగా మారిపోయిందని ఏఐసీసీ కార్య దర్శి మధుయాష్కీగౌడ్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమం త్రి కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు మళ్లీ బహురూపు వేషాలు, బట్టేబాజీ మాటలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గఢీల పాలన కొనసాగుతోందని, ఎన్నికల్లో ప్రజలు దీనికి చరమగీతం పాడుతారన్నారు. కేసుల విచారణ పేరుతో కాంగ్రెస్ నేతలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల అక్రమ రవాణా కేసులో కేసీఆర్, హరీశ్‌రావుల ప్రమేయంపై ఎందుకు విచారణ జరగ డం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిని త్వరలో బయటపెడతామని చెప్పారు. కాంట్రాక్టుల్లో, అక్రమ వ్యాపారాల్లో పది శాతం కమీషన్, 30 శాతం వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. ఐఎంజీ భూ ములు, పద్మాలయ స్టూడియో కేసులను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో చెప్పాలన్నారు. అపార్టుమెంట్లో నివాసమున్న ఎంపీ కవిత విల్లాల్లోకి మారారని దుయ్యబట్టారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి ఇప్పటికే రూ.3 కోట్లు పంపారని ఆరోపించారు. ఆంధ్రా పార్టీతో జత కట్టారని విమర్శిస్తున్న మంత్రి కేటీఆర్.. అదే ఆంధ్రాకు చెందిన వెంకయ్యనాయుడు కార్ల ఏజెన్సీ వద్ద కొనుగోలు చేసిన కార్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత అక్రమ సంపాదన కూడగట్టారని ఆరోపించారు. ఈవీఎంలు ట్యాం పరయ్యే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. -
మధు యాష్కీపై కవిత ఫైర్
సాక్షి, నిజమాబాద్ : కాంగ్రెస్ నేత మధు యాష్కిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించే అర్హత మధుయాష్కికి లేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మధుయాష్కి ఓడిపోయాక నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వైపు ఒక్క సారైనా కన్నెత్తి చూశారా అని ప్రశ్నించారు. గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా మాట్లాడడం సరికాదన్నారు. తాను చేసిన కృషి ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసన్నారు. నాలుగేళ్లలో రూ.500 కోట్లు నిజమాబాద్‌కి తీసుకొచ్చి దశాబ్దాల కల నెరవేర్చానని పేర్కొన్నారు. మధు యాష్కీ హయంలో మూడున్నర కోట్ల నిధులు ల్యాప్స్ అయితే 2017లో ఆ నిధులను సాధించామన్నారు.కరీంనగర్, నిజామాబాద్ రైల్వే నిధులు కూడా 10 ఏళ్లలో రూ.440 కోట్లు వస్తే తాను ఢిల్లీకి యాభైసార్లు వెళ్లీ టాప్ 20లో పెట్టించానని గుర్తుచేశారు. జిల్లాకి పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను తీసుకొచ్చామని, బాబా రామ్‌దేవ్‌ను కలిసి పసుపు ఆధారిత పరిశ్రమల కల్పనకు ఒప్పించామని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే మధుయాష్కికి ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. -
పాపాత్ముని పాలన అంతం: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాపాత్ముని పాలన అంతమైందని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. గురువారం గాంధీ భవన్లో అసెంబ్లీ రద్దుపై ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారమిస్తే.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందన్నారు. కేసీఆర్ ఓ ఆధునిక నయీం అని, అతని ఎన్కౌంటర్ తర్వాత దొరికిన డైరీ, ఆస్తులు ఎటుపోయాయని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు మూసేస్తామని చెప్పి.. పబ్బులను కేటీఆర్ తెరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక, గుట్కా దందాలతో దోచుకుంటున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. -
‘బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్ పార్టీ’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారిని నిరుద్యోగులుగానే ఉంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తానన్న కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను నియంతృత్వ పాలనలో పరిపాలిస్తుందన్నారు. సాగుకోసం రైతులు నీళ్లడిగితే ఊళ్లకు ఊళ్లను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్, కవితలు ఈ చరిత్ర మర్చిపోయారని అందువల్లే ప్రజలకు మేలు చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరిని మూసివేశారని ఆరోపించారు. బీజేపీ ‘బీ’ టీమ్ టీఆర్ఎస్ పార్టీ తన అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ మోడీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారని మధు యాష్కి విమర్శించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని ప్రజా సంఘాలు, వర్గాలు, మహిళలు ముందుండి ఈ ప్రజాకంటక పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహిళల అక్రమ రవాణాలో మనమే ముందున్నాం : గీతారెడ్డి మహిళల అభివృద్ధికోసం కృషి చేస్తున్నామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి ఎద్దేవాచేశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. దీన్ని బట్టే తెలంగాణలో ఎలాంటి పాలన ఉందో అర్ధమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం చాలా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా మహిళల పేరుతోనే మొదలు పెట్టేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో స్వయం ఉపాధి మహిళా సంఘాలకు చాలా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ మహిళా సంఘాలతో సమావేశం అవుతారని తెలిపారు. అందువల్ల మహిళలు పెద్దఎత్తున ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్‌ను సెక్రెటేరియట్ కోసం ఇస్తే భారీ ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు..
సాక్షి, హైదరాబాద్ : సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదని, జాతీయ చానెల్ స్క్రోలింగ్ చూసి అందరూ నిజమనుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. రోజూ న్యూస్ ఛానెల్స్‌లో ఏ అంశంపై చర్చ జరగాలనేది బీజేపీ నిర్ణయిస్తుందని, 2019లో మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అనే అంశంపై చర్చ నడిపించాలని బీజేపీ యోచిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీకి పలు అంశాల్లో సీఎం కేసీఆర్ సాయం చేశారని అన్నారు. మధుయాష్కీ బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రాహుల్ విదేశీ పర్యటనల ప్రబావం ఏంటో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అర్ధమవుతుందన్నారు. ఇక రాష్ట్రాల్లో పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు విశ్వసనీయతే లేదని, రాజ్యసభలో వారికి ఎంపీలే లేరని తాము బీజేపీ సభ్యులను ఒప్పించి బిల్లు పాస్ అయ్యేలా చూశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా ఉద్యమ సమయంలో కూడా కిరణ్‌కుమార్ రెడ్డి సమర్ధవంతంగా పాలించాడని కితాబిచ్చారు. -
కాంగ్రెస్‌లో ఎన్నికల టీం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో త్వరలోనే ఎన్నికల టీం రెడీ కానుంది. ఒడిశాలో ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణలోనూ పార్టీ కమిటీల నియామకానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, కోర్ కమిటీలను వచ్చే నెలలో ప్రకటించే దిశగా ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ యోచిస్తున్నారని సమాచారం. సామాజిక సమతుల్యత ఆధారంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారని, ఎస్సీ, బీసీ నాయకులకు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆశావహుల జాబితా చాంతాడంత పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్‌లో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికల టీంను నియమించేందుకు కసరత్తు చేస్తుండడంతో ఈ పోటీ మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే ప్రచార, మేనిఫెస్టో, కో ఆర్డినేషన్, కోర్ కమిటీల పగ్గాల కోసం, ఆ కమిటీల్లో స్థానం కోసం టీపీసీసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతుండగా.. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను ఈ కమిటీలతో పాటు ప్రకటించనున్నారు. ఈ నెల19న విడుదల చేసిన ఒడిశా కమిటీలతోపాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అదే తరహాలో రాష్ట్రంలోనూ ముగ్గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి ఈ హోదాలో ఉండగా.. కొత్తగా నియమించే ఇద్దరిలో ఒకరిని ఓసీ, మరొకరిని బీసీ వర్గం నుంచి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని ఎప్పట్నుంచో అంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌కు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. యాష్కికి కీలక బాధ్యతలు ఏఐసీసీలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో రాహుల్ ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న యాష్కికి ఈసారి పదోన్నతి వస్తుందని పీసీసీ వర్గాలంటున్నాయి. ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలకు ఇచ్చే ఈ హోదాను ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట వేశామనే సంకేతాలు పంపాలన్నది రాహుల్ యోచనగా కనిపిస్తోంది. యాష్కికి పదోన్నతి రాకపోతే ఆయన్ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఒకవేళ పదోన్నతి వస్తే ప్రచార కమిటీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు అప్పగించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సీనియర్ నేత జైపాల్‌రెడ్డికి చోటు ఖాయమని తెలుస్తోంది. సీడబ్ల్యూసీలో జైపాల్‌కు చోటివ్వకపోతే రాష్ట్ర పార్టీ సలహాదారుగా లేదా పార్టీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి రాజనర్సింహ ఇతర కమిటీల విషయానికి వస్తే.. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధా న్యం పెంచాలనే కోణంలో హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈయన నేతృత్వంలో ఉండే ఈ కమిటీకి కన్వీనర్‌గా ఓసీ సామా జిక వర్గ నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కో ఆర్డినేషన్ కమిటీలో పార్టీ సీనియర్ నేతలందరికీ స్థానం కల్పించనున్నారు. కోర్‌కమిటీలో సభ్యుల సంఖ్య తక్కువే అయినా.. చైర్మన్, కన్వీనర్లుగా ఓసీ, బీసీ నేతలను ఎంపిక చేయనున్నా రని టీపీసీసీ వర్గాలంటున్నాయి. టీపీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ కమిటీల ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చ జరిగినా.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఆక్రోశ్ర్యాలీకి వెళ్లే సందర్భంగా టీపీసీసీ ముఖ్యులతో కమిటీల ఏర్పాటుపై రాహుల్, గెహ్లాట్ చర్చలు జరపనున్నారు. -
సీమపందుల్లా టీఆర్ఎస్ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మూడేళ్ల పాలనపై మాజీ ఎంపీ మధుయాష్కీ దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ మూడేళ్ల పాలన దారిద్రపు పాలన అని ఆయన వ్యాఖ్యానించారు. కాపలా కుక్కగా ఉంటన్న కేసీఆర్.. ఇప్పుడు అధికారంతో దోచుకుంటున్నారని మధుయాష్కీ శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణ అమరుల, ఆత్మహత్యలు చెసుకున్న రైతుల శాపం కేసీఆర్‌కు తప్పక తగులుతుందని విమర్శించారు. సర్వేలతోనే టీఆర్ఎస్ సర్వ నాశనం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం.. అవినితీ సంపాదనను విదేశాలలో దాచుకున్నది నిజం కాదా? అంటూ... జీహెచ్ఎంసీలో అవినీతి కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ ప్రశ్నించారు. కుంభకోణానికి కేటీఆర్ ఎందుకు నైతిక భాధ్యత వహించలేదన్నారు. ఎంత మంది తెలంగాణ యువతకు ఉద్యోగాల వచ్చాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ హబ్ పేరుతూ గబ్బు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇండ్లు కట్టించకుండా... బులెట్ ఫ్రూఫ్ బాత్ రూమ్ కట్టించుకోవడానికి మాత్రం డబ్బులున్నాయా అని నిలదీశారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేటీఆర్, కవిత, కేటీఆర్ బావ కన్నారావు పాత్ర ఎంతో తేలాలని అన్నారు. టీఆఆర్ఎస్ మంత్రులు సీమ పందులుగా మారారని విమర్శించారు. కేసీఆర్ దుష్ట పాలనకు అంతం.. సంగారెడ్డి నుండే మొదలవుతుందని శాపనార్థాలు పెట్టారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ పై రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ అవినీతిపై త్వరలోనే సీబీఐని ఆశ్రయిస్తామని తెలిపారు. ఎంపీ కవిత భర్త పై అనేక వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కవిత, ఆమె భర్త పేరుపై ఉన్న ఆస్తులు ఎంత అని, కవిత ..అపార్ట్మెంట్ల నుండి కోట్ల విలువ చేసే విల్లాలో లోకి ఎలా మారారని ప్రశ్నలు సంధించారు. ఏ వ్యాపారాలు చేయకుండా.. ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో.. కవిత చెప్పాలని నిలదీశారు. మియాపూర్ కుంభకోణంలో తలసాని ముందు మాత్రమే అని.. వెనకాల కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండవచ్చునని మధుయాష్కీ అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఇంటిని, ప్రతి పౌరున్ని కదిలిస్తామన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను ఏకం చేస్తామని ఆయన తెలిపారు. రాహుల్ సభతో బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని తేలిపోయిందని మధుయాష్కీ అన్నారు. మతం, మాంసం పేరుతో నరేంద్ర మోదీ దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. -
‘కవిత, ఆమె భర్త పేరుపై ఉన్న ఆస్తులు ఎన్ని?’
-
టీఆర్ఎస్ను మించిన గలీజు పార్టీ లేదు
మాజీ ఎంపీ మధు యాష్కీ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను మించి న గలీజు పార్టీ మరో టి లేదని, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబంధుల సమితి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ విమర్శించారు. గాంధీ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని విమర్శించారు. ప్రజల సొమ్ము 300 కోట్లతో కట్టుకున్న బంగ్లాలో ఉంటూ, రైతులను పరామర్శిం చే తీరిక కూడా సీఎం కేసీఆర్‌కు లేద న్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్య లు తీసుకోకుండా తన సామాజికవర్గం వారిని కాపాడుకుంటున్నారని ఆరోపిం చారు. జీహెచ్ఎంసీలో 100 కోట్ల అవినీతి జరిగిందని, మంత్రిగా బాధ్యుడైన కేటీఆర్ పై చర్య తీసుకోకుండా కేవలం ఓ అధికారి ని మాత్రమే సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని యాష్కీ ఆరోపించారు. కేసుల భయంతోనే కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని ఆరోపించారు. -
'ఆ మాజీ ఎంపీకి మతి భ్రమించింది'
హైదరాబాద్: సీఎం కేసీఆర్, ఎంపీ కవితలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మధుయాష్కీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారనిపిస్తోందని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ కవిత గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడు నియోజకవార్గాల్లో రూ. వెయ్యి కోట్ల ఖర్చు పెట్టిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న కవిత టీఆర్ఎస్ను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ బలోపేతం అయితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదనే అక్కసుతో యాష్కీ మాట్లాడుతున్నారని, ఓ మహిళ అనే కనీస గౌరవం లేకుండా ఆయన మాట్లాడిన తీరు గర్హనీయం అన్నారు. సోకుల కోసమే కవిత విదేశాలకు వెళుతున్నారని యాష్కీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. యాష్కీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని... లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై యాష్కీ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు అర్థరహితమని, మనీ లాండరింగ్ లాంటి విద్యలు కాంగ్రెస్ నేతలకే తెలుసునన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే లేని తప్పు, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే వచ్చిందా అని బాల్క సుమన్, జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. -
మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తప్పుల తడక అని విమర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కీపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే సీఎం ప్రస్తావించారని, మధుయాష్కీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్, కేవీపీలు బినామీ వ్యాపారాలు చేస్తున్నారంటూ యాష్కీ వ్యాఖ్యానించడం పై మంగళవారమిక్కడ స్పందిస్తూ... ఆధారాలుంటే నిరూపించాలని, లేదంటే నోరు మూసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక శక్తిగా మారిన నయీమ్‌ను గత ప్రభుత్వాలే పెంచి పోషించాయని సుమన్ ఆరోపించారు. -
కేసీఆర్ సీఎం అయితే సీమాంధ్రులదే పెత్తనం
కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ మెట్పల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే సీమాంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం కొనసాగిస్తారని ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత సుమారు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కేసీఆర్ కోట్లు వెచ్చించి హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి తిరిగారన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారని, ఆయన అధికారంలోకి వస్తే వారే పెత్తనం సాగిస్తారని అన్నారు. -
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘటన సాధించటానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్ నుంచే బరిలో నిలిచారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. -
'కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారు'
హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేకులైన కొండా సురేఖ దంపతులను టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ ప్రశ్నించారు. కేసీఆర్ అధికార దాహంతో ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఎంపీ వివేక్ నివాసంలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మధుయాష్కీ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకపోవటంతో తనపై కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగిందని వివేక్ ఈ సందర్భంగా తెలిపారు. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబుతో ఎలాంటి విభేదాలు లేవని వివేక్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ ‘అసెంబ్లీ’ తాజా జాబితా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడికలు, తీసివేతల అనంతరం ఎంపీ అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వాలని భావించిన హైకమాండ్ నిర్ణయం మేరకు మళ్లీ పాత కాపుల పేర్లనే టీపీసీసీ సూచించింది. నిజామాబాద్,జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ కమి టీ యథాతథంగా టీపీసీసీకి పంపించింది. దీం తోపాటు అసెంబ్లీ టికెట్ల ఆశావహుల జాబితా ను సైతం అందజేసింది. వడపోత అనంతరం రెండు లోక్‌సభ స్థానాలకు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్ పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి శనివారం రాత్రి అందజేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ పేరును టీపీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యుడు వెంకట శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా, జహీరాబాద్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్‌ను డీసీసీ, పీసీసీ సభ్యుడు ఎం. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సి ఫారసు చేశారు. కాగా, తొమ్మిది అసెంబ్లీ ని యోజకవర్గాలకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు నుంచి ఐదుగురి పేర్లను డీసీసీ సిఫారసు చేసింది. ఈ జాబితాపైనా కసరత్తు చేసిన టీపీసీసీ తుది నిర్ణయం కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. నాలుగైదు రో జులలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు అసెంబ్లీ ఆశావహులలో టెన్షన్ మొదలైంది. ఎంపీ అభ్యర్థులలో ఆందోళన తెలంగాణ జిల్లాలకు సంబంధించి ‘సిట్టింగ్’లకు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులు అనుకూలమా? ప్రతికూలమా? అన్న అంశాల జోలి కి వెళ్లకుండా, సింగిల్ ఎజెండాతో కాంగ్రెస్ అధిష్టానం బెర్తులు ఖరారు చేసే దిశలో ఉంది. నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీకి ఈసారి గడ్డుపరిస్థితులు తప్పవ నే మాట వినిపిస్తోంది. 2004 ఎన్నికలలో టీ ఆర్ఎస్తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలలో తెలంగాణ అంశంలో దూకుడుగా వ్యవహరించిన ఆయనకు తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించి విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై 1,37,981 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి అభ్యర్థి (టీఆర్ఎస్) బిగాల గణేశ్గుప్తాపై 60,390 మెజార్టీ సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009 నాటికి టీఆర్ఎస్ అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తగింది. కవిత రంగప్రవేశంతో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా కే సీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చిన కవిత తెలంగాణవాదులు, ముఖ్యంగా మహిళలను అభిమానాలను చూరగొన్నా రు. కవితపై పోటీ మధుయాష్కీకి ఆషామాషీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానానికి వస్తే గత ఎన్నికలలో సురేశ్ షెట్కార్ టీఆర్ఎస్ అభ్యర్థి సయ్య ద్ యూసుఫ్ అలీపై కేవలం 17,407 ఓట్లతో గెలుపొందారు. సురేశ్‌కు 3,95,767 ఓట్లు వస్తే.. యూసుఫ్‌కు 3,78,360 వచ్చాయి. ఈసారి కూడ టీఆర్ఎస్ ఓ వ్యాపారవేత్తను, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతుండగా జహీరాబాద్‌లో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖరారైనా విజయావకాశాలపైనా ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఎవ్వరో? లోక్‌సభతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల అ భ్యర్థుల జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన జరుపుతోంది. వారం రోజుల కిందట డీసీసీ ఆశావహుల జాబితాను టీపీసీసీకి అందజేయగా, శనివారం సాయంత్రం ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. తొమ్మిది సెగ్మెంట్ల లో ఆశావహుల సంఖ్య మొత్తం 27కు చేరింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో పాటు ఆయన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు రెండేసి నియోజకవర్గాలలో ఉండగా ఎవరెవరికి టికెట్లు వస్తాయనేది ‘ఢిల్లీ’ ప్రకటన తర్వాతే తేలుతుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబి తాలు వెలువడనున్నాయి. -
'బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదు'
హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య టీడీపీని సమర్థించటాన్ని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బీసీలను కేవలం ఓట్లుగానే చూసిన చంద్రబాబు వద్ద బీసీల గౌరవాన్ని ఆర్. కృష్ణయ్య తాకట్టు పెట్టడం సరికాదని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. కాగా రంగారెడ్డి జిల్ల చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. -
జేసీ కాలం చెల్లిన మెడిసిన్: మధు యాష్కీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ భగ్గుమన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటివారు కాలం చెల్లిన (ఎక్స్ పైరీ) మెడిసిన్ లాంటివారు అని యాష్కీ వ్యాఖ్యానించారు. ఇక అధిష్టానం చుట్టూ తిరిగినా రాజ్యసభ టికెట్ రాకపోవడంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటివాళ్లు కాంగ్రెస్ పనైపోయిందని అనడంపై ఆయన తప్పుపట్టారు. జేసీ, లగడపాటిలాంటి వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరు అని ఆయన అన్నారు. జేసీ నమ్మి టికెట్ ఇస్తే ట్రావెల్స్ పెట్టి ప్రజల ప్రాణం తీస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సమైక్యం కోసం రాజీనామా చేశామని చెప్పుకుంటున్న నేతలు రాజ్యసభ సీట్లు ఎందుకు అడుగుతున్నారో సీమాంధ్ర ప్రజలు గమనించాలి ఎంపీ మధుయాష్కీ అన్నారు. -
'మంత్రిని మార్చారు సరే టి.బిల్లు....'
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి తనదైన శైలిలో విమర్శించారు. బుధవారం మధుయాష్కీ హైదరాబాద్‌లో మాట్లాడుతూ... కిరణ్ సీఎంగా మంత్రుల శాఖలను మార్చే అధికారం ఉండవచ్చు... కానీ తెలంగాణ బిల్లును మర్చే అధికారం మాత్రం ఆయనకు లేదని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్నారు. ఆ వెంటనే రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, వెనువెంటనే ఇరు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని మధు యాష్కి తెలిపారు. అయితే శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించి, వాణిజ్య శాఖను కట్టబెడుతూ సీఎం కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ వ్యవహారాల శాఖను ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్‌కు అప్పగించారు. దాంతో టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు ఏమిటని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్‌తోపాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సమైక్యవాది అని పేరుపడిన ముఖ్యమంత్రి టి. బిల్లుకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో మధు యాష్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సద్భావన సభ!
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 21 లేదా 22 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడితోపాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కేవలం కాంగ్రెస్‌వల్లే సాధ్యమవుతోందన్న భావం ప్రజల్లో కలిగేలా ఈ సభను ఏర్పాటు చేయాలని సంకల్పిం చారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. మంత్రులు కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎంపీలు మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.ఎ. ఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ ’సభ, సీఎం కిరణ్ తీరు తది తర అంశాలపై సమావేశంలో నేతల మధ్య చర్చ సాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్రం సాధ్యమైనంత త్వరగా పూర్తిచే సి పార్లమెంటులో ఆమోదింపచేయాల్సిన అవసరముందని సమావేశం అభిప్రాయపడింది. ఆహారభద్రతా బిల్లు ఆమోదం పొందడం, కేంద్రంలో రాజకీయ పరిణామాలు రోజుకోరకంగా మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఇబ్బందుల్లో పడతామన్న భావనను కొందరు నేతలు వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితులు రాకముందే తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసేలా చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు దీటుగా కార్యక్రమాలు తెలంగాణ ఏర్పాటుపై పూర్తి బాధ్యత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వహిస్తుండగా ఆ క్రెడిట్‌ను తన్నుకుపోయేలా టీఆర్ఎస్ చురుగ్గా కదులుతోందని సమావేశంలో చర్చ సాగింది. ఇటీవల ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సభ నిర్వహించడం, టీఆర్ఎస్ కూడా త్వరలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నందున కాంగ్రెస్ తరఫున కూడా హైదరాబాద్‌లో సభ పెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనికి సద్భావనా సభగా పేరుపెడితే బాగుం టుందని కొందరు సూచించారు. సభను ఈనెల 21 లేదా 22 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈనెల 15న టీ కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ఇతర నేతలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌పై మూడురకాల ప్రతిపాదనలున్నాయని షిండే చెప్పడంపై నేతల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ఉద్యోగుల సమస్యలపై కన్నా రాజకీ యాంశాలను ప్రస్తావించడాన్ని సమావేశం తప్పుబట్టింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం మొత్తానికి సీఎంగా వ్యవహరించట్లేదని, కేవలం సీమాంధ్రప్రాంత నేతగా ప్రవర్తిస్తున్నారని పలువురు మండిపడ్డారు. ఢిల్లీలో తెలంగాణ ప్రక్రియపై జరుగుతున్న కదలికల గురించి మధుయాష్కీ వివరించారు. పార్లమెంటులో సోనియాను ఇటలీ వనితని తీవ్రపదజాలంతో విమర్శించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రుత్విక్ సంస్థకు కంతనపల్లి ప్రాజెక్టును అత్యధిక అంచనాలతో అప్పగించడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అభ్యంతరం లేవనెత్తారు. రూ. అయిదారువందల కోట్లు అధికంగా అంచనాలు పెంచి కాంట్రాక్టును అప్పగించారని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరముందని ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. జేసీ రాయల తెలంగానం: టీ కాంగ్రెస్ నేతల భేటీ జరుగుతున్న సమయంలో సీనియర్‌నేత జేసీ దివాకర్‌రెడ్డి సీఎల్పీకి వచ్చారు. సమావేశం జరుగుతున్న రూంలోకి వెళ్లి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నవ్వుతూ నినదించారు. దీంతో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘జై తెలంగాణ’ అని గట్టిగా నినదించారు. కనీసం తమ రెండు జిల్లాల(అనంతపురం, కర్నూలు)ను కలుపుకొని రాయల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని, అలాకాకుంటే నీటి సమస్యలతో తాము భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని జేసీ చెప్పారు. అలా కాకపోతే సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్నదే తమ అభిప్రాయమన్నారు. సమైక్యాంధ్ర అనే మాటే లేదని, తెలంగాణకు అనుకూలంగా ఉంటే తొలిగవర్నర్‌గా మిమ్మల్నే ఆహ్వానిస్తామని నేతలు ప్రతిపాదించగా జేసీ బయటకు వచ్చేశారు. -
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ చీఫ్ విప్ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన గురువారమిక్కడ తెలిపారు. హోంమంత్రి అనారోగ్యం కారణంగానే కొంత ఆలస్యం జరిగిందని మధుయాష్కీ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులు అనవసర భయాలు, అపోహలు సృష్టించుకోవద్దని ఆయన సూచించారు. కాగా ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అనారోగ్యం కారణంగా ఈ అంశం చర్చించటం లేదని తెలుస్తోంది.