
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికల్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం ఉందన్నారు. దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ మార్పుకు అవకాశం ఉండవచ్చు అంచనా వేశారు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహాంతో ముందుకు వెళ్తుందని అధిష్టానం ఆ దిశలో ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. శుక్రవారం నిజమాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మధుయాష్కీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కింది స్థాయి కార్యకర్త వరకూ అందరూ కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారని తెలిపారు. ఆ తరువాత అధిష్టానం పీసీసీ మార్పు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా పీసీసీ చీఫ్ మార్పుపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా ఉత్తమ్‌ను బాధ్యత నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment