
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచినా లాభం లేదని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని టీపీసీసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆలోచన వేరుగా ఉంటుందని, మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై రానున్న ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, మీడియాతో సమన్వయంపై చర్చించారు.
అనంతరం కమిటీ సభ్యులు మల్లురవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఇందిరాశోభన్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూలీలుగా మార్చుకున్న అహంకారి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన సరైన రీతిలో జరగాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేస్తారని చెప్పారు. మీడియాతో సమన్వయం కోసం త్వరలోనే జిల్లా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కమిటీలో ముగ్గురు సభ్యులు..
కాగా, పార్లమెంటు ఎన్నికలకోసం ఏర్పాటు చేసిన మీడియా కోఆర్డినేషన్ కమిటీలో కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, సుధాకర్‌గౌడ్‌లను కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్టు మధుయాష్కీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment